అవును.. ఇప్పుడు అన్ని రాజ‌కీయాలు ప‌క్క‌కు వెళ్లిపోయి.. క‌రోనా పాలిటిక్స్ ఒక్క‌టే క‌నిపిస్తున్నాయి. అటు తెలంగాణ‌లోను, ఇటు ఏపీలోనూ క‌రోనా వైర‌స్ విష‌య‌మే రాజ‌కీయ నేత‌ల‌కు ప్ర‌ధాన టాపిక్‌గా మారిపోయింది. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌భుత్వాలు జాగ్ర‌త్త‌లు తీసుకున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అనేక రూపాల్లో క‌రోనా మ‌హ‌మ్మారిని కట్ట‌డి చేసేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు కూడా చాలానే దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకున్నాయి. తెలంగాణ‌లో అయితే.. ఏకంగా అక్క‌డి సీఎం కేసీఆర్‌.. ఇంట్లోనే ఉంటారా?  సైన్యాన్ని రంగంలోకి దింప‌మంటారా?  తేల్చుకోండి! అంటూ.. ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించారు. 


ఏపీలో ఇంత సీరియ‌స్‌గా ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించ‌క‌పోయినా.. మాధ్య‌మాల ద్వారా.. జాగ్ర‌త్త‌ల‌పై చేసిన ప్ర‌చారం ఫ‌లించింది. దీంతో ఏప్రిల్ నెల పూర్తిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంపూర్ణ లాక్‌డౌన్ కొన‌సాగింది. దీంతో కేసులు కూడా త‌క్కువ‌గానే న‌మోద‌య్యాయి. అయితే.. రాను రాను ఆర్ధిక స‌మ‌స్య పెర‌గ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల జీవ‌నం కూడా చాలా ప్రాంతాల్లో దుర్భ‌రంగా త‌యారైంది. ఇక‌, కేంద్రం నుంచి వ‌స్తాయ‌నుకున్న నిధుల విష‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కోత‌లు పెట్టారు. అంతేకాదు, జీఎస్టీలో కేంద్ర ప్ర‌భుత్వ వాటాను త‌గ్గించుకోవాల‌ని సూచించినా.. ఆయ‌న పెడ చెవిన పెట్టారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాష్ట్రాల‌కు ఇచ్చిన వెసులుబాటు మ‌ద్యం విక్ర‌యించుకోమ‌ని! 


దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వాలు అయిష్టంగానే మ‌ద్యం విక్ర‌యాల‌కు గ్రీన్ సిగ్న‌ళ్లు ఇచ్చాయి. ఇక‌, అక్క‌డ నుంచి లాక్‌డౌన్ 1.0, లాక్‌డౌన్ 2.0 అంటూ.. కేంద్ర‌మే ప‌లు ద‌ఫాలుగా లాక్‌డౌన్ వెసులుబాటు ఇచ్చేసింది. అంతేకాదు... సంపూర్ణ లాక్‌డౌన్ వ‌ద్ద‌ని కూడా తేల్చిచెప్పింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జ‌నసంచారం పెరిగిపోయింది. లాక్‌డౌన్ వేళ‌ల‌కు కుదింపు ఇచ్చేశారు. ఫ‌లితంగా కేవ‌లం నెల రోజులు తిరిగేస‌రికి క‌రోనా కేసుల సంఖ్య తారాజువ్వ మాదిరిగా పెరిగిపోయింది. అదేస‌మ‌యంలో మృతుల సంఖ్య మ‌రింత ఆందోళ‌నక‌రంగా పెరిగింది. తాజాగా అటు తెలంగాణ‌లోను, ఏపీలో 500ల‌కు చేరువ‌గా మృతుల సంఖ్య ప‌రుగులు పెడుతుండ‌డం అత్యంత ఆందోళ‌న‌కు దారితీస్తోంది. 


ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు అన్నివిధాలా అండ‌గా నిల‌వాల్సిన ప్ర‌తిప‌క్షాలు.. ప్ర‌భుత్వాలు చేస్తున్న ప‌నుల‌పైనా.. క‌రోనా క‌ట్టడి అంశాల‌పై విష ప్ర‌చారం చేస్తున్నాయ‌నే అనాలి. క్వారంటైన్ సెంట‌ర్ల‌లో స‌రిగా చూడ‌డంలేద‌ని,  అన్నం కూడా పెట్ట‌డం లేద‌ని.. ప్ర‌చారం చేస్తున్నారు. ఇక‌, క‌రోనా ప‌రీక్ష‌ల్లోనూ స‌రైన ఫ‌లితంరావ‌డం లేద‌ని మ‌రో ప్ర‌చారం ముందుకు తెచ్చారు. దీంతో క‌రోనా ప‌రీక్ష చేయించుకునేందుకు వ‌చ్చేవారి సంఖ్య నానాటికీ త‌గ్గుముఖం ప‌డుతోంది. వైర‌స్ ల‌క్ష‌ణాలు ముదిరిపోయిన‌ ప‌రిస్థితిలోనే బ‌య‌ట‌కు వ‌చ్చి ప‌రీక్ష చేయించుకుంటున్నారు. అయితే, అప్ప‌టికే వైర‌స్ వారి దేహాన్ని తినేస్తోంది. ఆసుప‌త్రిలో చేరిన కొద్ది స‌మ‌యంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. అదే ప‌రీక్ష ముందుగానే చేయించుకుని ఉంటే.. ప్రాణాలు ద‌క్కే ప‌రిస్థితి ఉండేద‌ని వైద్యులు చెబుతున్నారు. కానీ, క‌రోనా విష‌యంలో చోటు చేసుకుంటున్న రాజ‌కీయాలు ప్ర‌జ‌ల ప్రాణాల‌ను తీసేస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: