వర్షాలు వచ్చి పోయాయి.. అవి ముఖం చాటేసి వారం దాటింది.వర్షాల వల్ల  రోడ్లు కూడా అమానుషంగా తయారు అయ్యాయి  పాటు దీంతో.. హైదరాబాద్‌లో అడుగు పెట్టాలంటే జిల్లాలవాసులు జంకుతున్నారు. ఇంకొన్ని రోజులయ్యాక వెళ్లి వద్దాంలే అనుకుంటూ ఊరుకుంటున్నారు.


తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చారో.. మరుసటి రోజే బెడ్డు ఎక్కుతున్నారు. వెన్నెపూస ఫట్ అని అంటుంటే.. బొక్కలన్నీ విరిగినట్లు భయపెడుతుంటే.. గుండెల్లో గుబులు రేకెత్తుతుంటే.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని నగరంలో పర్యటిస్తున్నారు జనం. ముఖ్యంగా ద్విచక్రవాహనాలపై వచ్చే వాహనదారులైతే ఏ గుంతలో పడి చేయి, కాలు విరుగుతుందోనని జంకుతున్నారు


బండి ఫల్టీలు కొట్టి పుర్రె పగులుతుందోనని గజ గజ వణుకుతున్నారు. నరకానికే వెళ్తున్నట్లుంది.. అనుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇదంతా ఎందుకనుకుంటున్నారా...? హైదరాబాద్ నగరవ్యాప్తంగా రోడ్లు అలా ఉన్నాయి మరి. భారీ వర్షాల ప్రభావంతో నగరంలోని రోడ్లన్నీ గుంతలుగా మారిపోయాయి. నాలాలు నిండి రోడ్లను ముంచెత్తుతున్నాయి. ఏ రోడ్డు చూసినా అస్తవ్యస్తంగా, నీటి కుంటలతో నిండిపోయాయి. అయితే, వర్షాలు తగ్గి వారం, పది రోజులు గడుస్తున్నా జీహెచ్‌ఎంసీ మాత్రం నిద్ర మబ్బు నుంచి తేరుకోనట్లుంది.


రోడ్ల మరమ్మతు గురించి చర్యలు ప్రారంభించిందా? అని సగటు నగరవాసుడు అసహనం వ్యక్తం చేస్తున్నాడు. రోడ్ ట్యాక్స్ పేరిట వేలకు వేలు తీసుకునే ప్రభుత్వం.. రోడ్లను మాత్రం పట్టించుకోదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. నడ్డి విరిగి మంచాన పడుతుంటే పట్టింపు లేదా? అంటూ కోపంతో ఊగిపోతున్నాడు. రెండ్రోజులకు ఒకసారి బైక్‌ను రిపేర్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తోందంటూ, ఈ రోడ్ల వల్ల బైక్‌లు, కార్ల పార్టులన్నీ వదులవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ అధికారులు మేల్కొని, సత్వర చర్యలు చేపట్టాలని.. రోడ్ల మరమ్మతు చేపట్టి మంచాన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు విన్నవిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: