ఇదీ ఒడిషాలోని గిరిజన గ్రామాల దుస్థితి.రాష్ట్రంలోని గజపతి జిల్లా రాయగడ బ్లాక్‌లోని ఏడు గిరిజన గ్రామాలకు సరైన దారి లేదు.ఈ కొండల నడుమ ఉండే లిమర్ సింగ్, తబతర్ సింగ్, పతిలొడ, గడజుబ, అల్జర్, కింతే సింగ్, దిబ్రిసాయి గ్రామాల పరిస్థితి దారణంవీరంతా బయటి ప్రపంచం చూడాలంటే పంట పొలాలు, కొండలు మధ్య ఉన్న ప్రమాదకర వాగు దాటాలి.

బయటకు వెళ్లడానికి వారికి ఉన్న ఏకైక మార్గం 60 మీటర్ల వెడల్పు ఉన్న ఈ వాగు ఒక్కటే కావడంతో బడికెళ్లే చిన్నారుల నుంచి ముసలివాళ్ల వరకు అందరూ ఈ దారిని ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది.ఈ వాగు దగ్గర ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. వాగును దాటడానికి వారంతా ఈ చెట్టునే నమ్మకున్నారు. ప్రవాహం దాటడానికి వారికి ఈ పెద్ద చెట్టు వంతెనలా పనిచేస్తోంది.

ఈ చెట్టు కొమ్మ వాగుపైన సగభాగం కన్నా ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ గ్రామాల ప్రజలు వేరే ఊరు వెళ్లాలంటే వాగును దాటాలి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉధృతంగా ప్రవహించే నది గుండా వెళ్లాలి. ఏడాదిలో దాదాపు ఆరు నెలలు వారిది ఇదే పరిస్థితి.రాయగడ బ్లాక్‌ మొత్తం గిరిజన ప్రాంతమే. ఐటీడీఏ పరిధిలోకి వచ్చే ఈ బ్లాక్‌లో ఎటుచూసినా పచ్చని చెట్లు, పంట పొలాలు, కొండలు కనివిందు చేస్తాయి. 

చుట్టూ కొండలు ఉండటం వల్ల అక్కడ నుంచి వచ్చే వర్షపు నీరు కూడా ఈ వాగులోకే వస్తుంది. అప్పుడు ఇందులో నీరు చాలా వేగంగా ప్రవహిస్తుంది. చెట్టు మీద నుంచి వాగు దాటేటప్పుడు కింద పడిపోకుండా వెదురు కర్రలతో ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. మామిడి కొమ్మలకు రెండు వైపులా వెదురు గెడలు కట్టారు. దీన్ని ఇనుప వైర్లతో చుట్టారు. ఈ తాత్కాలిక వంతెన మామిడి కొమ్మల మీదుగా ఉండటంతో పడిపోకుండా ఉండేందుకు సన్నటి వెదురు బొంగులను కట్టారు. అయితే, ఈ వంతెన గుండా వెళుతూ ఏమాత్రం కాలుజారినా 20 అడుగుల క్రింద ఉన్న ప్రవాహంలో పడిపోతారు. గతంలో ఈ ప్రవాహంలో చాలా మంది పడ్డారని గ్రామస్థులు చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: