దేశంలోని గ్రామీణ, పర్వత ప్రాంతాలలో కొండచరియలు విరిగిపోవడం తరచూ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా భారీ వర్షాల తరువాత కొండచరియలు విరిగిపోవడం సర్వసాధారణం.అయితే, కొండచరియ ప్రమాదాలు గుర్తించడానికి స్మార్ట్‌ఫోన్‌లలో సాధారణంగా కనిపించే మోషన్ సెన్సార్‌ను ఉపయోగించి తక్కువ ఖర్చుతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశామని శాస్త్రవేత్తలు తెలిపారు.


ప్రస్తుతం ఈ పరికరాన్ని హిమాలయ రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లోని 20కి పైగా ప్రదేశాలలో పరీక్షిస్తున్నారు.ఇక్కడ ఏటా కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రాణనష్టం జరుగుతుంది.ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగా తగ్గించేందుకు ఈ పరికరం సహాయపడుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.యాక్సిలెరోమీటర్ అనేది ఒక రకమైన మోషన్ సెన్సార్‌లాంటిది. ఇది వేగంలో మార్పులను కొలుస్తుంది. మనం వాడే స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే ఇది.. దిక్సూచి, మ్యాప్‌లను ఉపయోగించడానికి, స్క్రీన్‌ను అడ్డంగా, నిలువుగా తిప్పడానికి సహాపడుతుంది.


హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలోని ఐఐటీ శాస్త్రవేత్తలు ఈ యాక్సిలెరోమీటర్‌లో కొన్ని మార్పులు చేసి విరిగిపడే కొండచరియలను గుర్తించే ముందస్తు హెచ్చరిక వ్యవస్థను రూపొందించారు. ఈ పరికరం తయారీకి రూ.20 వేలు ఖర్చు అవుతుందని ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి కంప్యూటర్ ఇంజినీర్ డాక్టర్ వరుణ్ దత్, అతని సహోద్యోగి డాక్టర్ కేవీ ఉదయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. మట్టి కదలికలను కొలవడానికి మోషన్ సెన్సార్‌ను ఉపయోగిస్తున్నట్లు వారు చెప్పారు.


''మేము దానిని మట్టిలో పూడ్చినప్పుడు నేల కదలికలనుబట్టి యాక్సిలెరోమీటర్ కదులుతుంది. దానిపై కొంత బలప్రయోగం జరిగినప్పుడు అది తప్పనిసరిగా కదులుతుంది. నేల కదలిక పరిధిని రికార్డ్ చేయడానికి ఈ సెన్సార్ మాకు ఉపయోగపడుతుంది. కొండచరియ ప్రమాదాలకు కారణమయ్యే మట్టిలోని చిన్న స్థానభ్రంశాలను కూడా దీని ద్వారా సేకరించవచ్చు'' అని డాక్టర్ దత్ బీబీసీ ప్రతినిధి అయేషా పెరెరాతో అన్నారు
.

చిన్న మట్టి కదలికలను సైతం గుర్తించి ముందస్తు హెచ్చరికలను అందించడంలో ఇది సహాయపడుతుందని ఆయన వివరించారు.''కొండచరియ ప్రమాదాలకు దారితీసే భూ స్థానభ్రంశాన్ని గుర్తించినప్పుడు ఇది పెద్ద శబ్దాలను విడుదల చేస్తుంది. అధికారులకు సందేశాలను పంపుతుంది. అప్పుడు అధికారులు ఆ ప్రాంతంలో తక్షణ చర్యలు తీసుకుంటారు. ఈ పరికరం ఇప్పటికే కొంత విజయాన్ని సాధించింది'' అని ఆయన తెలిపారు.మండి జిల్లాలోని కుట్రోపిలో కొండచరియలు విరిగిపడటం గురించి ఈ పరికరం అధికారులను అప్రమత్తం చేయగలిగింది. దీంతో పోలీసులు ఆ దారిని మూసివేసి వాహనాలను మళ్లించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: