దేశవ్యాప్తంగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్న అయోధ్య తీర్పు ఈరోజు వెలువడింది. సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలో అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులదేనని 2.77 ఎకరాల స్థలాన్ని హిందువులకు అప్పగించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్ ను కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వటంతో పాటు ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తీర్పు చెప్పింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. భారతీయులందరూ సోదర భావం, ప్రేమ, నమ్మకంతో వెల్లివిరియాల్సిన సమయం ఇది అని అన్నారు. కోర్టు తీర్పును గౌరవించి మనమంతా పరస్పరం సామరస్యంతో మెలగాలని అన్నారు. 
 
2019 లోక్ సభ ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు రామ జన్మభూమి - బాబ్రీ మసీదు కేసు వాయిదా పడిన సమయంలో రాహుల్ గాంధీ అయోధ్య రామ మందిరం ప్రధాన అంశం కాదని పేర్కొన్నారు. 1992 సంవత్సరంలో బాబ్రీ మసీదు కూల్చివేసిన తరువాత 26 సంవత్సరాలు గాంధీ - నెహ్రూ కుటుంబంలోని ఎవ్వరూ అయోధ్యలో పర్యటించలేదు. 2016 సంవత్సరంలో రాహుల్ గాంధీ 26 సంవత్సరాల తరువాత ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అయోధ్యలో పర్యటించారు. 1990 సంవత్సరంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ చివరిసారిగా అయోధ్యను సందర్శించారు. 26 సంవత్సరాల తరువాత రాహుల్ అయోధ్యను సందర్శించటంతో  అగ్ర కులాల ఓటర్లను ఆకర్షించేందుకు మాత్రమే రాహుల్ అయోధ్యను సందర్శించారనే విమర్శలు వినిపించాయి. 
 
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ప్రియాంక గాంధీ అయోధ్య కేసు వివాదం గురించి స్పందించారు. హింసకు తావుండకూడదని మహాత్మగాంధీ పుట్టిన దేశంలో హింసకు చోటివ్వకూడదని అన్నారు. సుప్రీం ఎలాంటి తీర్పు ఇచ్చినా మనం మాత్రం సంయమనం పాటించాలని అన్నారు. వేల సంవత్సరాల నాటి భారత సాంప్రదాయమైన ఐకమత్యాన్ని ప్రదర్శించాల్సిన బాధ్యత మనదే అని పరస్పర ప్రేమను, సామాజిక సామరస్యాన్ని పంచుకోవాలన్న విషయాన్ని మరిచిపోకూడదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత రణదీప్ సుర్జేవాలా సుప్రీంకోర్టు తీర్పుతో ఆలయ నిర్మాణానికి తలుపులు తెరచుకున్నాయని బీజేపీ పార్టీ తలుపులు మూసుకుపోతాయని వ్యాఖ్యలు చేశారు. ఇకనుండి అయోధ్య విషయం రాజకీయ రంగు పులుముకోదని అన్నారు. 
 
కాంగ్రెస్ పార్టీ అయోధ్యపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించింది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ఈ మేరకు తీర్మానం చేసింది. సున్నీ వక్ఫ్ బోర్డ్ అయోధ్య విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని చెబుతోంది. 5 ఎకరాల కొత్త స్థలం వలన ఏం ఉపయోగమని సున్నీ వక్ఫ్ బోర్డ్ ప్రశ్నించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని కానీ తాము అసంతృప్తిగా ఉన్నామని చెప్పింది. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తమ కమిటీ అంగీకరిస్తే రివ్యూ పిటిషన్ వేస్తామని తెలిపింది. ఎంఐఎం అధ్యక్షుడు అసరుద్దీన్ ఓవైసీ సుప్రీంకోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మా హక్కుల కోసం మేం పోరాడతాం అని రాజ్యాంగంపై మాకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: