'అయ్య కొండ'. పేరుకు తగ్గట్టే కొండమీద ఉంది ఈ గ్రామం.పాడుబడిన ఇంటి గోడ మీద వెలిసిపోతున్న అక్షరాలు ఊరి వైపు చూపించాయి.ఆ ఊరి నిండా గోరీలే. ప్రతీ ఇంటి ముందు కనీసం ఒక సమాధి ఉంది.ఆడవాళ్లు వాటి మధ్యే నీళ్లు మోసుకుంటూ వెళ్తారు. పిల్లలు సమాధుల ముందే ఆడుకుంటారు.ఇక్కడ బడి, గుడి ముందు కూడా సమాధులే ఉన్నాయి.


ఊరి మధ్యలో సమాధులు ఉన్నాయో.. సమాధుల మధ్య ఊరుందో అక్కడ అడుగు పెట్టిన మాకు అర్ధం కాలేదు.కానీ, అక్కడ సమాధులే సర్వస్వం. వాటితోనే ప్రజల జీవితం పెనవేసుకుపోయింది.ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ ఉందో తెలుసా? రాయలసీమలో.కర్నూలు నుంచి పడమర వైపున 66కిలోమీటర్ల దూరంలో గోనెగండ్ల మండలంలో గంజిహల్లి పంచాయితీ పరిధిలోని కుగ్రామమే అయ్యకొండ.ఇక్కడ ప్రతీ ఇంటి ముందు కనీసం ఒక సమాధి ఉంది.ఇంటి ముందు ఉన్న గోరీలకు ప్రతీరోజూ నైవేద్యాలు పెడతారు.


వంట చేసిన తర్వాత గోరీల ముందు నైవేద్యం పెట్టిన తర్వాతే ఇంట్లోని వారు తింటారు.'ఈ సమాధులు మా తాత, ముత్తాతలవని మా పెద్దలు చెప్పారు. వాటిని భక్తితో పూజిస్తాం. నిత్యం నైవేద్యం సమర్పిస్తాం. అనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని అలాగే కొనసాగిస్తున్నాం' అని గ్రామస్తులు చెప్పారు.పూర్వం నల్లారెడ్డి అనే గురువు ఈ ఊరి కోసం శ్రమించి, తన సర్వస్వం ధారపోశాడట. ఆయన శిష్యుడు ఈ గ్రామానికి చెందిన మాలదాసరి చింతల మునిస్వామి. అయ్యకొండ అభివృద్ధికి వీరిద్దరు కృషి చేశారట.


వారు చేసిన మేలుకు కృతజ్ఞతగా వారి మరణానంతరం వారికి ఇక్కడే గుడి కట్టి పూజిస్తున్నారు. అప్పటి నుంచి ఎవరు మరణించినా వారి ఇంటి ముందే సమాధి కడుతున్నారు' అని శ్రీనివాసులు చెప్పారు.కొత్త వస్తువు కొన్నా, ఏదైనా వండినా ఈ ఇద్దరు స్వాముల సమాధుల వద్ద పెట్టి, ఆ తర్వాత, ఇంటి ముందున్న సమాధులకు సమర్పించాలి. ఆ తర్వాతే ఇంట్లోని వాళ్లు ముట్టుకోవాలి.నైవేద్యం పెట్టకుండా నేరుగా తింటే అరిష్టం జరుగుతుందని గ్రామస్తుల గట్టి నమ్మకం.


మరింత సమాచారం తెలుసుకోండి: