ఆసియా, అమెరికాల్లో పక్షులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని రెండు ప్రధానమైన సర్వేలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా, కెనడాల్లో 1970తో పోలిస్తే ఇప్పుడు మూడు వందల కోట్ల పక్షులు తగ్గిపోయాయని, అంటే పక్షుల సంఖ్య 29 శాతం క్షీణించిందని ఉత్తర అమెరికాలో జరిపిన సర్వే చెబుతోంది. ఆసియాలోని ఇండొనేషియాలో జావా ద్వీపంలో పాడేపక్షులు (సాంగ్‌బర్డ్స్) తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని ఈ సందర్భంగా నిర్వహించిన సర్వే వెల్లడిస్తోంది. అక్కడ అడవుల్లో కంటే పంజరాల్లో ఉండే పక్షుల సంఖ్యే ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తోంది.

 

గడ్డిభూములు, తీరం, ఎడారులు ఇలా అన్ని ప్రాంతాల్లో ఎన్ని పక్షులు తగ్గిపోయాయో ఉత్తర అమెరికా సర్వే చెబుతోంది. మనుషుల చేసే పనుల వల్ల పక్షులు వాటి ఆవాసం కోల్పోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సర్వేపై అమెరికాలోని కార్నెల్ ల్యాబ్ ఆఫ్ ఆర్నిథాలజీ, అమెరికన్ బర్డ్ కన్జర్వన్సీలకు లీడ్ రీసర్చర్ డాక్టర్ కెన్ రూజన్‌బర్గ్ మాట్లాడుతూ కొన్ని జాతుల పక్షుల సంఖ్య తగ్గిపోతోందని శాస్త్రవేత్తలకు తెలుసని చెప్పారు.

 

అరుదైన పక్షుల సంఖ్య తగ్గిపోవడం వల్ల ఏర్పడే లోటు సాధారణ పక్షులు, మానవ ఆవాసాలకు అలవాటు పడ్డ పక్షుల సంఖ్యలో పెరుగుదలతో పూడుతుందని తాము భావించామని, అయితే అలా జరగలేదని అధ్యయనాన్ని బట్టి తెలుస్తోందని ఆయన చెప్పారు. మనకు నిత్యం ఇంటి పెరట్లో కనిపించే పక్షులు, సాధారణ జాతుల పక్షులు కూడా భారీగా తగ్గిపోవడం విస్మయం కలిగిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

 

ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోనూ పరిస్థితి ఉత్తర అమెరికాలో మాదిరే ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. మనిషి చేసే పనుల వల్ల పక్షులు ఎదుర్కొంటున్న మనుగడ సంక్షోభానికి ఆసియాలో పరిస్థితి ఒక స్పష్టమైన ఉదాహరణని రూజన్‌బర్గ్ వ్యాఖ్యానించారు. ఆసియా సర్వే  ఈ విషయాన్ని వెల్లడిస్తోందన్నారు. అమెరికా, కెనడాల్లో బాతు, ఇతర నీటి పక్షులు తగ్గిపోతుండటాన్ని గుర్తించిన బాతుల వేటగాళ్లు వాటి సంరక్షణకు ప్రయత్నం చేశారని ఆయన చెప్పారు. బాతుల వేటగాళ్లకు అవసరమైన సంఖ్యలో బాతుల సంఖ్య ఉండేలా చూసేందుకు చిత్తడి నేలల పరిరక్షణ, వాటి పునరుద్ధరణకు లక్షల డాలర్లు వెచ్చించారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: