భారతకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు యెమెన్ నుంచి అత్యంత చాకచక్యంగా తప్పించుకుని స్వదేశం చేరుకున్నారు. సముద్ర మార్గంలో దాదాపు 3,000 కిలోమీటర్ల దూరం 10 రోజుల పాటు కేవలం తమ వేట పడవలలోనే ప్రయాణించారు వీరందరూ. 2018 డిసెంబర్‌లో తమిళనాడుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రం జలాల్లో చేపలు పట్టే ఉద్యోగం కోసం దుబాయికి వెళ్లారు. అయితే, వారు దుబాయి చేరుకున్న తర్వాత వారి పరిస్థితి దారుణంగా తయారుయింది.

 

దుబాయిలో ఉద్యోగం చేయాలంటూ వారిని తీసుకెళ్లిన మోసం చేసి యెమెన్‌లో పని చేయాలని ఒత్తిడి చేసారు. యెమెన్ లో చాలా ఏళ్లుగా అంతర్యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. "మేము దుబాయి చేరుకోగానే, మీరు పని చేయాల్సింది ఇక్కడ కాదు, మనం ఇప్పుడు ఒమన్ వెళ్తున్నామని ఆ వ్యాపారి చెప్పారు. కానీ, అతడు మమ్మల్ని ఒమన్‌కు కాకుండా, యెమెన్‌కు తీసుకెళ్లాడు. ఎక్కడ అయితేనేం సరిగా డబ్బులు వస్తే చాలని అనుకున్నాం" అని వివరించారు.

 

 ఆ అరబ్ వ్యాపారి మీరు చేపలు పడితే వచ్చే ఆదాయంలో మీకు సగం, నాకు సగం అన్నారు. అయినా తప్పని పరిస్థితిలో వాళ్లు చేపల వేట కొనసాగించారు. మొదట్లో ఆ వ్యాపారి డబ్బులు బాగానే ఇచ్చారు. కానీ, ఓ నెల గడిచాక ఇక ఆ 50 శాతం డబ్బులు కూడా ఇచ్చేందుకు వ్యాపారి నిరాకరించారు. దాంతో, ఆందోళన చెందిన మత్స్యకారులకు ఇక స్వదేశం వెళ్లిపోవడమే మేలన్న ఆలోచన వచ్చింది. కానీ, ఎలా వెళ్లాలో వారికి తెలియదు.

 

యెమెన్ నుంచి కేరళలోని కోచికి దాదాపు 3000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి ఎలా తప్పించుకునేందుకు వాళ్లు ఒక పథకం వేసుకున్నారు. "మేము విమానంలో తప్పించుకోలేం. మాకున్న ఏకైక మార్గం సముద్రమే. మాకు తెలిసిన మార్గం అదొక్కటే. దాంతో, ఎలా తప్పించుకుని పారిపోవాలో నాలుగు నెలలపాటు ప్రణాళికలు వేశాం. మేము చేపల వేటకు వెళ్లేందుకు వాడే బోటులో యజమాని డీజిల్ పోయించేవారు. మేము వేటకు వెళ్లిన ప్రతిసారీ కొంత డీజిల్ 'దొంగిలించి' దాచిపెట్టడం మొదలుపెట్టాం. అలా నాలుగు నెలల్లో దాదాపు 7,000 లీటర్ల డీజిల్ పొదుపు చేశాం" అని వారిలో ఒకరు చెప్పారు .

 

"మేము ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంది. ప్రయాణమంతా చాలా కష్టంగా సాగింది. సరైన మార్గంలోనే వెళ్తున్నామా లేదా అని ఆందోళన చెందాం. ఒక సమయంలో మళ్లీ యెమెన్‌కు వెళ్లిపోదామా అన్న ఆలోచనలు కూడా వచ్చాయి. కానీ, తర్వాత ఏది ఏమైనా స్వదేశానికే వెళ్లాలని నిర్ణయించుకుని, ముందుకు ప్రయాణం సాగించాం" జగన్ చెప్పారు.

 

లక్షద్వీప్‌ సమీపంలోకి రాగానే వారి పడవలో ఇంధనం ఖాళీ అయిపోయింది. దాంతో, యెమెన్ నుంచి వెంట తెచ్చుకున్న శాటిలైట్ ఫోన్‌తో వాళ్లు తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.వాళ్లు లక్షద్వీప్‌కు 58 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు భారత తీర రక్షణ దళాలు వెళ్లి రక్షించి సురక్షితంగా కేరళలోని కోచికి తీసుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: