విశాఖకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంబిల్లి వద్ద ప్రత్యామ్నాయ స్థావరం ఏర్పాటుచేస్తున్నారు. మొదటి దశలో ఇప్పటికే 3 వేల ఎకరాల్లో జలాంతర్గామి స్థావరం నిర్మించారు. రెండో దశ పనులకు మరో 3,500 ఎకరాల భూమి సేకరిస్తున్నారు. దేశ రక్షణకు సంబంధించి ‘వర్ష’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు రూ.వేల కోట్లు వెచ్చిస్తున్నారు. విశాఖ కేంద్రంగానే అణుజలాంతర్గాముల నిర్మాణం జరుగుతోంది. ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ ఇప్పటికే అందుబాటులోకి రాగా.. మరొకటి నిర్మాణంలో ఉంది. ఇలా దేశ రక్షణకు సంబంధించిన పలు కీలకమైన ప్రాజెక్టులు విశాఖలో రూపుదిద్దుకుంటుండగా.. పాకిస్థాన్‌ వీటి గుట్టుమట్లు తెలుసుకోవడానికి హనీట్రాప్ కు పాల్పడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.


అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన మన నౌకాదళం అధికారుల, పాకిస్థాన్‌ పన్నిన కుట్రకు చిక్కారు! శత్రు దేశం పన్నిన హనీట్రా్‌పలో పడ్డారు. అందమైన అమ్మాయిల ప్రొఫైల్‌తో కొందరు అందమైన మాటలతో వలపులు ఒలకబోస్తూ చాటింగ్‌ చేయడంతో కరిగిపోయి.. ఏ బాధ్యతలో ఉన్నామో, ఏం చేస్తున్నామో అనేదీ మరిచి దేశ భద్రతకు సంబంధించిన కీలక రహస్యాలనంతా దాయాది దేశానికి వెల్లడించారు. విశాఖ, ముంబై, కార్వార్‌ (కర్ణాటక)లోని స్థావరాలకు చెందిన ఏడుగురు అధికారుల దుశ్చేష్టలవి! వీరంతా నిఘా వర్గాలకు చిక్కడంతో ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు. ముంబై, కార్వార్‌ పాకిస్థాన్‌ వైపు ఉండడంతో అక్కడి నుంచి ఎక్కువ వ్యవహారం నడిపించకుండా ప్రణాళిక ప్రకారం తూర్పు ప్రాంతమైన విశాఖనే లక్ష్యంగా చేసుకుని పాక్‌ నడిపించిన తీరు ‘ఆపరేషన్‌ డాల్ఫిన్‌ నోస్‌’తో బట్టబయలైంది. మన దేశ రక్షణకు సంబంధించిన జలాంతర్గాములు, యుద్ధనౌకల గురించి.. ఇతర రహస్యాలపై కన్నేసిన పాక్‌.. నేవీ అధికారులను హనీట్రాప్‌ చేయడంలో పకడ్బందీగా వ్యవహరించింది.

 
మన నేవీలో పనిచేస్తున్న కొందరు అధికారుల ఫోన్‌ నంబర్లను కనిపెట్టింది. ఆ నంబర్లకు సోషల్‌ మీడియా ద్వారా స్పైవేర్‌ పంపి ఏ విధమైన సైట్లు చూస్తున్నారో పసిగట్టింది. కొంతమందికి అందమైన అమ్మాయిల ఫొటోలతో ఉన్న ప్రొఫైల్స్‌తో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపింది. ఆ వైపు నుంచి ఆమోదించగానే అంతమైన ‘మీరేం చేస్తారు? ఎక్కడుంటారు?’ అంటూ కబుర్లలోకి దింపి అంతా రాబట్టింది. సముద్రంలో యుద్ధనౌకలంటే ఎలా ఉంటాయి.? టెక్నాలజీ ఏంటి.? అందులో వాడుతున్న వార్‌ హెడ్లు, క్షిపణులు తదితర కీలక విషయాలను అత్యంత చాకచక్యంగా సేకరించేందుకు ప్రయత్నించింది. మరికొందరు డబ్బుకు పడతారని గుర్తించిన పాక్‌ గూఢచారులు ఆ మార్గంలో ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముంబైలో ఒక హవాలా ఆపరేటర్‌ ద్వారా డబ్బులు ఎరగా వేసి మన సముద్ర రక్షణ ఎలా ఉందో వివరాలు సేకరించేందుకు ప్రయత్నించింది. ముంబై, కార్వార్‌ నౌకాస్థావరాలతో పాటు తూర్పు నౌకాదళ స్థావరం విశాఖ నుంచి మొత్తం ఏడుగురిని బుట్టలో వేసుకుంది. హనీట్రా్‌పలో ముంబై పోర్టు నుంచి ఇద్దరు, కార్వార్‌ నుంచి ఇద్దరు, విశాఖపట్నం నుంచి మరో ముగ్గురు నేవల్‌ అధికారులు పడ్డారని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి.

 
ఈ హనీట్రాప్‌ను కేంద్ర నిఘా వర్గాలు, నేవీ ఇంటెలిజెన్స్‌, ఏపీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సంయుక్తంగా పసిగట్టాయి. అనుమానితులైన అధికారులతో పాటు ముంబైకి చెందిన దళారిని కూడా అదుపులోకి తీసుకున్నాయి. దేశద్రోహం కేసులో వారిని శుక్రవారం విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ వ్యవహారంపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడుతూ.. దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన సమస్య కావడంతో కేంద్ర నిఘా వర్గాలతో కలిసి ఏపీ ఇంటెలిజెన్స్‌ అనుమానితులను అదుపులోకి తీసుకుందన్నారు. వారి పేర్లు వివరాలు వెల్లడించలేమని తెలిపారు.
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: