నైతిక విలువ‌ల‌కు పాఠాలు చెప్పే తెలుగు మీడియాలో ఇప్పుడు ఒక క‌న్నే ప‌నిచేస్తోందా?  క‌లం ఒక‌వైపు మాత్ర‌మే రాస్తోందా?  రాష్ట్ర ప‌రిణామాల‌ను ఉన్న‌వి ఉన్న‌ట్టుగా చూపించేందుకు కూడా మీడియా మ‌న‌సు ఒప్పు కోవ‌డం లేదా? ఇవే విష‌యాల‌పై చ‌ర్చిస్తున్నారు మేధావులు. రాజ్యంగ బ‌ద్ధ‌మైన వ్య‌వ‌స్త‌గా అవ‌త‌రిం చిన పా త్రికేయ రంగం పోక‌డ‌లు నానాటికీ తీసిక‌ట్టుగా మారుతున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో అయితే, ఒక్కొ మీడియా సంస్థ‌కు ఒక్కొక్క అజెండా ఉంటుంది. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నిక‌లు లేవు. అయినా కూడా ప్ర‌జ‌ల కోణాన్ని స‌రైన విధంగా వెల్ల‌డించ‌డంలో మాత్రంమీడియా ప‌క్షపాతంతో వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

 

ప్ర‌స్తుతం రాజ‌ధాని విష‌యాన్ని తీసుకుంటే.. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున సీఎం జ‌గ‌న్ చేసిన మూడు రాజ ధానుల ప్ర‌క‌ట‌న‌పై అమ‌రావ‌తిలో ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. గ‌డిచిన 20 రోజుల‌కు పైగానే ఇవి కొన సాగుతున్నాయి. వీటిని పూర్తిగా మీడియా ప్ర‌సారం చేయాల్సిందే. ఈ విష‌యంలో రెండో ఆలోచ‌నే లేదు. అయితే, రాష్ట్రంలో గ‌డిచిన వారం ప‌ది రోజులుగా విశాఖ‌, తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, క‌డ‌ప‌, క‌ర్నూ లు జిల్లాల్లో మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తిస్తూ.. ఆయా ప్రాంతాల ప్ర‌జ‌లు ఆందోళ‌న చేస్తున్నారు.
అయితే , వీటిని ప్ర‌చురించేందుకు, ప్ర‌సారం చేసేందుకు కూడా మీడియా సాహ‌సించ‌డం లేదు.

 

ఒక‌వేళ‌.. మూడు రాజ‌ధానుల కోసం చేస్తున్న ఆందోళ‌న‌ల‌ను, మంత్రులు పాల్గొంటున్న ర్యాలీల‌ను రాజకీ య కోణంలో చూస్తున్నారా? అనేది కూడా చ‌ర్చ‌కు దారితీస్తోంది. అయితే, అమ‌రావ‌తి కోసం జ‌రుగుతున్న ఆందోళ‌న‌లను కూడా ఇదే కోణంలో చూడాల్సి ఉంటుందన్న‌ది మేధావుల మాట‌. గ‌తంలోనూ ప‌త్రిక‌ల‌కు ఒక అజెండా ఉండేది. గ‌తంలో ప‌త్రిక‌లు కూడా కొన్ని పార్టీల‌కు మ‌ద్ద‌తిచ్చాయి. వాటి అభిప్రాయాల‌ను, వాటి అజెండాల‌ను ప్ర‌త్యేకంగా చెప్పుకొనేవి. ఆ నేప‌థ్యంలో ఎడిట్ పేజీలు వ‌చ్చాయి. ఎడిటోరియ‌ల్ పేజీలో వ‌చ్చిన ప్ర‌తి ఐటం కూడా ప‌త్రిక‌కు సంబంధించిన అభిప్రాయంగా ఉండేది. మిగిలిన పేజీల్లో ప్ర‌జ‌ల‌కు సంబంధించిన వార్త‌లు ఉండేవి. అవి ఏవైనా స‌రే. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా ప్ర‌చురించేవారు.  

 

అయితే, ఇప్పుడు ఏపీ మీడియాలో ప్ర‌తి పేజీ ఎడిట్ పేజీనే అయిపోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌జ‌ల డ‌బ్బుల‌తో సౌధాలు నిర్మించుకుని పాత్రికేయ వృత్తిలో ఉన్న మీడియా సంస్థ‌ల‌కు ఇలా ఏక‌నేత్ర కోణంలో వార్త‌లు రాయ‌డం అంటే.. ప్ర‌జ‌ల సొమ్మును తీసుకుని వారి కంట్లో దుమ్ము కొట్ట‌డ‌మే అంటున్నారు మేధావులు. మీ అభిప్రాయం ఏదైనా ఉంటే.. చెప్పుకోవ‌చ్చు. కానీ, ఇలా కొన్ని అంశాల‌ను పూర్తిగా ప‌క్క‌కు పెట్టి.. రాష్ట్రంలో ఏం జ‌రుగుతోందో కూడా తెలియ‌ద‌నే విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం ప్ర‌జాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ విలువ‌ల‌ను పూర్తిగా తుంగ‌లోకి తొక్క‌డ‌మే అవుతుంద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: