ఓట‌మి గెలుపున‌కు నాంది ప‌ల‌కాలి!-ఇది అన్నిరంగాల‌కు వ‌ర్తించే సూత్రం. రాజ‌కీయాల్లోనూ ఈ క‌సి ఉంటుంది. ప్ర‌త్య‌క్ష రాజ‌కీ యాల్లో ఓడిపోయిన నాయ‌కులు, పార్టీలు కూడా ప‌ట్టుబ‌ట్టి గెలిచిన సంద‌ర్భాలు, అధికారంలోకి వ‌చ్చిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ వైసీపీ. 2014లో ఓట‌మి పాలైన ఈ పార్టీని అధినేత జ‌గ‌న్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని మ‌రీ గాడిలో పెట్టారు. అనేక తుఫాన్ల‌ను ఎదుర్కొన్నారు. అయినా ఎక్క‌డా వెనుక‌డుగువేయ‌కుండా త‌న‌ను న‌మ్మిన వారిని, పార్టీ కోసం ప‌నిచేసిన వారిని వెంట పెట్టుకుని ముందుకు సాగారు. అంతిమంగా ఆయ‌న భారీ విజ‌యం న‌మోదు చేశారు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితి భ‌విష్య‌త్తులో టీడీపీకి ఉంటుందా ? గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఘోరంగా ప‌రాజ‌యం పాలైన టీడీపీ పుంజుకునేనా ? ఇప్పుడున్న ప‌రిస్థితిలో పార్టీని గాడిలో పెట్ట‌డం పార్టీ అధినేత‌, ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ చంద్ర‌బాబుకు సాధ్య‌మ‌య్యేనా ? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

 

ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో ఈ చ‌ర్చ భారీగా సాగుతోంది. ఇక‌, టీడీపీ క‌థ ముగిసింద‌ని అనేవారు ఎక్కు వ‌గా క‌నిపిస్తుంటే.. బాబు మారితే.. ప‌రిస్థితి మారుతుంద‌నే వారు కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే.. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ పునాదుల‌పై ఆవిర్భ‌వించిన టీడీపీ ఇప్పుడు అదే తెలుగు వారి మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్ట‌లేక పోతుండ‌డం మాత్రం వాస్త‌వం. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల్లో కీల‌క‌మైంది రాజ‌ధాని అంశం. అమ‌రావ‌తిని తాను ప్ర‌పంచ స్తాయి రాజ‌ధానిగా మార్చాల‌ని చంద్ర‌బాబు క‌ల‌లు గ‌న్న మాట వాస్త‌వం. అయితే, దీనిని సాధించేలోగానే ఆయ‌న ప్ర‌భుత్వం కుప్ప‌కూలింది. ఇక‌, జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆది నుం చి చెప్పిన‌ట్టే.. రాజ‌ధాని అమ‌రావ‌తిని కేవ‌లం శాస‌న రాజ‌ధానికే ప‌రిమితం చేసింది. దీనిని అడ్డుకునేందుకు చంద్ర‌బాబు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు.

 

ముఖ్యంగా రాష్ట్ర రాజ‌ధాని అంశాన్ని సెంటిమెంటుగా మార్చ‌డంలో ఆయ‌న పూర్తిగా విఫ‌లమయ్యారనే వాద‌న వాస్త‌వం. నిజానికి సెంటిమెంటును పండించ‌డంలో బాబు అందెవేసిన చేయి. ఏ విష‌యాన్న‌యినా త‌న‌కు, పార్టీకి అనుకూలంగా మార్చుకుని ముందుకుసాగుతారు. కానీ, ఇప్పుడు మాత్రం ఆయ‌న తీసుకున్న రాజ‌ధాని పోరాటం అనే అజెండా సెంటిమెంటు విష‌యంలో రాష్ట్రాన్ని క‌దిలించ‌లేక పోయింది. కేవ‌లం 29 గ్రామాల‌కే ప‌ర‌మిత‌మైంది. అందులోనూ కొంద‌రు మాత్ర మే బాబుకు బాస‌ట‌గా నిలిచార‌నేది నిర్వివాదాంశం. ఇక‌, పార్టీ ప‌రంగా కూడా కీల‌క నాయ‌కులు బాబు వెంట న‌డ‌వ‌లేక పోయారు. ఆయ‌న గ‌తంలో అధికారంలో ఉన్న స‌మ‌యంలో కొంద‌రికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వ‌డం, పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారిని పక్కన పెట్ట‌డం వంటివి ఇప్పుడు వారిలో బాబుపై విశ్వాసం స‌న్న‌గిల్లేలా చేశాయి.

 

దీంతో బాబుకు గుంటూరు, కృష్నా జిల్లాల‌కు చెంది న టీడీపీ నాయ‌కుల్లో చాలా మంది క‌ల‌సి రాలేదు. అసెంబ్లీలో మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, అమ రావతి పరిధిలో ఆ 29 గ్రామాల్లోనే అలజడి కన్పించింది తప్ప, రాష్ట్రంలో ఎక్కడా చిన్న పాటి కదలిక కన్పించలేదు. అంటే, ఇక్కడ పార్టీ పరంగా చంద్రబాబు నేత‌ల‌ను క‌దిలించ‌లేక పోయారు. అదేస‌మ‌యంలో పార్టీ నేత‌ల‌పై ప‌ట్టు కూడా కోల్పోయార‌నే వాద‌న ఉంది. ముఖ్యంగా ఉత్త‌రాంధ్రలో రాజ‌ధాని ఏర్పాటు విష‌యంలో అక్క‌డి నేత‌లు స్వాగ‌తించ‌డం, బాబు వ్య‌తిరేకించ‌డం కూడా వ‌ర్క‌వుట్ కాలేదు. అస‌లు రాజ‌ధానిని క‌మ్మ సామాజిక వ‌ర్గానికి ప‌రిమితం చేస్తూ.. వైసీపీ చేసిన ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొట్ట‌డంలో ఆదిలోనే (అంటే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఉన్న స‌మ‌యంలోనే) విఫ‌ల‌మ‌య్యారు.

 

ఇక‌, ఇన్‌సైడ్ ట్రేడింగ్ జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌ల‌ను కూడా అప్ప‌ట్లోనే వ్య‌తిరేకించి, లేదా తిప్పికొట్టి ఉంటే.. ఇటు ప్ర‌జ‌ల్లోను, అటు టీడీపీలోని మిగిలిన సామాజిక వ‌ర్గాల్లోనూ బాబుపై నిష్ప‌క్ష‌పాతిగా ముద్ర‌ప‌డేది. కానీ, అప్ప‌ట్లో వైసీపీని, ఆ పార్టీ నేత‌ల విమ‌ర్శ‌ల‌ను కూడా బాబు ప‌ట్టించుకోలేదు. అంతాలైట్ తీసుకున్నారు. జ‌గ‌న్‌ను కేవ‌లం ఓ నేర‌స్తుడిగా ప్రొజెక్ట్ చేసేందుకే ప‌రిమితం అయ్యారు. ఫ‌లితంగా అధికారానికే ఎస‌రు తెచ్చుకున్నారు. ఇక‌, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా ఇన్‌సైడ్ ట్రేడింగ్‌పై వైసీపీ ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ప్పుడు బాబు త‌నంత‌ట‌ తానే ముందుకు వ‌చ్చి.. ప్ర‌జ‌ల్లో చ‌ర్చ పెట్టి వివ‌రించి ఉంటే.. కొంత‌మేర‌కు ఆయ‌నకు నైతికంగా బ‌లం వ‌చ్చి ఉండేది. కానీ, బాబు సైలెంట్ అయ్యారు.

 

తాజాగా అసెంబ్లీలో వైసీపీ మంత్రి బుగ్గ‌న ఇన్ సైడ్ ట్రేడింగ్ వివ‌రాల‌ను పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించ‌డం, వాటిని టీవీల్లో ప్ర‌జ‌లు వీక్షించ‌డం, ఆది నుంచి వైసీపీ చెబుతున్న ఆరోప‌ణ‌లకు ఏనుగంత బ‌లం చేకూరిన‌ట్టు అయింది. ఫ‌లితంగా చంద్ర‌బాబు అమ‌రావ‌తిని ఎందుకు కోరుకున్నారు? అంటే .. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం అనే వారి సంఖ్య వంద‌ల సంఖ్య  నుంచి వేళ్ల మీద‌కి దిగ‌జారింది. వ‌ల్ల‌భ‌నేని వంశీ, మ‌ద్దాలి గిరి స‌హా గంటా శ్రీనివాస‌రావు వంటివారు త‌ట‌స్తులుగా మారుతున్నా.. చూసి చూడ‌న‌ట్టు.. పీక‌ల‌దాకా తెచ్చుకున్న చంద్ర‌బాబు ఇప్పుడు ఫ‌లితం అనుభ‌విస్తున్నార‌నే వాద‌న కూడా ఉంది. మ‌రీ ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను చూసి ఆయ‌న కుమారుడిని రాజ‌కీయంగా బ‌లోపేతం చేశారు కాబ‌ట్టి నేను కూడా నా కొడుకును బ‌లోపేతం చేసుకోవాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించ‌డం, మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డం వంటివి కూడా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను పెంచింది.

 

అదే స‌మ‌యంలో నాయ‌కుల్లోనూ అస‌హ‌నం పెంచింది. పోనీ మంత్రి అయ్యాకైనా నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను లోకేష్ పెంచుకుని ఉంటే.. బాగుండేది అలా చేయ‌లేక పోయారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను వాడుకుని వ‌దిలేశార‌ని, త‌న కొడుకు కోసం ఆయ‌న‌కు అన్యాయం చేశార‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. వీటిపై కూడా బాబు మౌనం పాటించారు. ఇక‌, పార్టీలో అసంతృప్తుల‌ను కూడా బాబు పెంచుకున్నారు. మొత్తంగా ఇటు ప్ర‌జ‌ల‌తోను, అటు పార్టీ నేత‌ల‌తోనూ కూడా బాబు వ్య‌వ‌హ‌రించిన తీరుతో ఆయ‌న‌, ఆయ‌న నాయ‌క‌త్వం.. పార్టీ ప‌రిస్థితి కూడా ప్ర‌మాదంలో చిక్కుకుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: