ఏపీ రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు క్వీన్ మాదిరిగా వెలుగొందిన పార్టీ కాంగ్రెస్. అయితే, వైఎస్ మ‌ర‌ణం, త‌ర్వాత పార్టీని లీడ్ చేసే నాయ‌కులు స‌రైన వారు లేక‌పోవ‌డం, దీనికి మ‌రో కార‌ణంగా రాష్ట్ర విభ‌జ‌న వంటి విష‌యా లు తెర‌మీదికి రావ‌డంతో ప్ర‌జ‌ల‌కు ఒక‌ప్ప‌డి పెద్ద‌పార్టీ కాంగ్రెస్ చిన్న‌బోయింది. గ‌ణ‌నీయ‌మైన ఓటు బ్యాంకును సొంతం చేసుకుని వేస్తే.. హ‌స్తానికే ఓటు! అని నిన‌దించిన ప్ర‌జ‌ల చేత ఛీత్క‌రించ‌బ‌డింది. అలాంటి పార్టీకి ఇప్పుడు కొత్త సార‌ధులు వ‌చ్చారు. మ‌రి ఇప్పుడున్న ఏపీ వాతావ‌ర‌ణంలో కాంగ్రెస్‌ను వీరు ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్తార‌నేది ఒక ప్ర‌శ్న.

 

అయితే, అస‌లు ఇప్పుడున్న ఏపీ రాజ‌కీయ వాతావ‌ర‌ణం.. కాంగ్రెస్‌కు ఎలా అనుకూలంగా ఉంటుంది? అనేది మ‌రో కీల‌క ప్ర‌శ్న‌గా ఉంది. ప్ర‌స్తుత ఏపీ ప‌రిణామాల‌ను చూస్తే.. ప్ర‌జ‌ల‌కు మ‌ళ్లీ కాంగ్రెస్ కావాల‌నే ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో వైసీపీ జ‌న‌రంజ‌క పాల‌న అందిస్తోంది. అయితే మిగిలిన ప‌క్షాలు మాత్రం ఎలాంటి రాజ‌కీయం చేస్తున్నాయో కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అదే స‌మ‌యంలో ఎవ‌రు ఎవ‌రితో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధ‌మ‌య్యారో కూడా తెలియ‌ని ప‌రిస్థితిలో రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి.

 

దీంతో ప్ర‌త్యామ్నాయం కోసం ఓ వ‌ర్గం ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం, కేంద్రం నుంచి రావాల్సిన విభ‌జ‌న హామీలు వంటివి ఇప్ప‌టి వ‌రకు కూడా ఏమీ ముందుకు సాగ‌లేదు. దీనికితోడు ప్ర‌శ్నిస్తానంటూ.. ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చిన ఓ పార్టీ.. స్వ‌యంగా తానే ప్ర‌శ్న‌ల్లో కూరుకు పోవ‌డం కూడా ప్ర‌శ్నార్థ‌కంగా మారిపోయింది. ఇక‌, గ‌డిచిన ఐదేళ్ల‌లో ప్ర‌జ‌ల‌కు గ్రాఫిక్స్ చూపించిన మ‌రోపార్టీ కూడా ఇప్పుడు నాయ‌క‌త్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. నాయ‌కుడిని ప్ర‌జ‌లు న‌మ్మ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో ప్ర‌త్యామ్నాయం కోసం ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నార‌నేది వాస్త‌వం.

 

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి 50.6 శాతం ఓట్లు షేర్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో మిగిలిన ఓటు బ్యాంకును వివిధ పార్టీలు కైవ‌సం చేసుకున్నా.. ఆశించిన విధంగా ప్ర‌జ‌ల‌కు-రాజ‌కీయాల‌కు మ‌ధ్య ఈ పార్టీలు ప‌నిచేయ‌డం లేద‌నేది వాస్త‌వం అంటు న్నారు ప‌రిశీల‌కులు. దీంతో ఇప్పుడు స‌రైన స‌మ‌యంలో కాంగ్రెస్‌కు సార‌ధులు బాధ్య‌త‌లు చేప‌ట్టారు క‌నుక‌.. వ్యూహాత్మ‌కంగా ఇప్పుడు ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకోగ‌లిగితే.. పోయిన కాంగ్రెస్ వైభ‌వం రాక‌పోయినా.. కాంగ్రెస్ ఖ‌చ్చితంగా పుంజుకోవ‌డం ఖాయ‌మ‌నేది నిజ‌మ‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: