ఇప్ప‌టికే రాష్ట్రంలో టీడీపీ ప‌రువు పోయింది. ప్ర‌జ‌లు చిత్తుగా ఓడించి ప‌క్క‌న పెట్టారు. మ‌రోప‌క్క‌, పార్టీలో నేత‌లు ఎవ‌రూ కూడా చంద్ర‌బాబును ఖాత‌రు చేయ‌డం లేదు. త‌ల‌కో వైఖ‌రితో చంద్ర‌బాబు వైఖ‌రిని ఎవ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. ఇక‌, మండ‌లిలో ఏదో సాధించాల‌ని అనుకుని మొత్తానికే చేతులు కాల్చుకున్నారు. దీంతో రాష్ట్రంలో చంద్ర‌బాబు పరువు ఘోరంగా పోయింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి ఇలాంటి ప‌రిస్థితిలో రాష్ట్రంలో పార్టీని పుంజుకునేలా చేయాల్సిన బాబు.. రాష్ట్రంలోని ప‌రిస్థి తుల‌ను దేశంలోకి కూడా తీసుకువెళ్లి అక్క‌డ కూడా ప‌రువు పొగొట్టుకునేందుకు రెడీ అయ్యార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

 

తాజాగా చంద్ర‌బాబు త‌న‌కున్న ముగ్గరు ఎంపీలు, రాజ్య‌స‌భ స‌భ్యుల‌తో భేటీ అయ్యారు. ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై టీడీపీలో చర్చ జరిగింది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన భేటీలో ఎంపీలకు పలు కీలక సూచనలు చేశారు. అమరావతి అంశాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లా లన్నారు. రాజధాని నిర్మాణానికి పెట్టిన ఖర్చు, రైతుల పోరాటాలను...పార్లమెంట్ ద్వారా దేశం దృష్టికి తేవాలని చంద్రబాబు సూచించారు.

 

కక్షపూరితంగా శాసనమండలి రద్దు జరిగిందనే విషయాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యంపైనా పార్లమెంట్‌లో ప్రస్తావించాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. సీఏఏపై ఆయా వర్గాల్లో ఆందోళనలకు అనుగుణంగా సభలో వ్యవహరించాలన్నారు. ఉపాధి హామీ ప‌థ‌కానికి సంబంధించిన ప‌నుల‌కు బిల్లుల చెల్లింపులో రాష్ట్రం వైఖరిని కేంద్రం దృష్టికి తేవాలని, రాష్ట్రంలో పోలీసుల వ్యవహార శైలిని పార్లమెంట్‌లో ప్రస్తావించాలన్నారు.

 

పోలీసుల అక్రమ నిర్బంధం, తప్పుడు కేసులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ప్ర‌తిప‌క్షాల ప‌రిస్థితి కొంచెమైనా బాగున్న రాష్ట్రం ఒక్క ఏపీనేన‌ని కేంద్రం భావిస్తోంది. ఇప్పుడు ఇక్క‌డ ప‌రువు పోగొట్టుకున్న చంద్ర‌బాబు.. త‌న లోపాల‌ను పార్ల‌మెంటులోనూ ప్ర‌స్తావించి.. అక్క‌డ కూడా త‌న చేత‌గాని త‌నాన్ని చెప్పుకొంటారా? అంటూ టీడీపీలోని ఓ వ‌ర్గం బుగ్గ‌లు నొక్కుకుంటుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: