శ‌నివారం ప్ర‌వేశ పెట్ట‌నున్న కేంద్ర బ‌డ్జెట్‌పై తూర్పుగోదావ‌రి జిల్లా కోన‌సీమ వాసులు చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఇక్క‌డి రైల్వే లైన్‌నిర్మాణానికి నిధులు ఉన్నా..ప‌నులు మాత్రం మందకొడిగా సాగుతున్నాయి. అదేస‌మ‌యం లో కేంద్రం నుంచి మ‌రిన్ని నిధులు రావాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ నేప‌థ్యంలో బ‌డ్జెట్‌లో ఏం జ‌రుగుతుంద‌నే విష‌యంపై కోన‌సీ మ వాసులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. దశాబ్దకాలం నాటి కోనసీమ రైల్వేలైన్‌కు ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత భారీగా నిధుల కేటాయింపు జరిగింది. గడిచిన నాలుగు బడ్జెట్‌లలో కేంద్ర ప్రభుత్వం రూ.1,030 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.126 కోట్లు కేటాయించాయి. మొత్తం రూ.1,156 కోట్ల నిధులు ఈ ప్రాజెక్టుకు మంజూరయ్యాయి.

 

మొత్తం ఈ ప్రాజెక్టు వ్యయం తొలి అంచనా రూ.1,045.20 కోట్లు కాగా, అది ఇప్పుడు రూ.2,120 కోట్లకు చేరింది. ఇంతవరకు రూ.667.11 కోట్ల విలువ చేసే మూడు ప్రధాన వంతెనల నిర్మాణాలు మొదలయ్యాయి. దీనిలో గౌతమీ న‌ది మీద వంతెనకు రూ.346.87 కోట్లు, వైనతేయ, వశిష్ఠ నదులపై రూ.320.24 కోట్లకు టెండర్లు ఖరారై పనులు వేగంగా సాగుతున్నాయి. గౌతమీ పనులు వేగంగా సాగుతుండగా, వైనతేయ, వశిష్ఠ పనులు ఆలస్యంగా ఆరంభమయ్యాయి. మంజూరైన నిధుల్లో వంతెనలకు కేటాయించిన  నిధులు పోగా, ఇంకా రూ.488.89 కోట్ల పనులు మొదలు కావాల్సి ఉంది. ప్రధాన వంతెనల నిర్మాణాలు పూర్తయిన తరువాత ట్రాక్‌ పనులు జరిగే అవకాశముంటుంది. ప్రధాన వంతెనల నిర్మాణం సంతృప్తికరంగా సాగుతున్నా ట్రాక్‌ నిర్మాణ పనులకు ఇంతవరకు టెండర్ల ప్రక్రియ మొదలు కాలేదు. ఇందుకు భూసేకరణ పూర్తిస్థాయిలో జరగకపోవడం కూడా ఒక కారణమని తెలుస్తోంది.

 

 కోటిపల్లి నుంచి అయినవిల్లి మండలం మాగాం మీదుగా అమలాపురం మండలం భట్నవల్లి వరకు సుమారు 154 ఎకరాల భూసేకరణ జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో చించినాడ నుంచి నరసాపురం వరకు దాదాపుగా భూసేకరణ పూర్త యింది. గౌతమీ, వైనతేయ, వశిష్ఠ వంతెనకు అవసరమైన 14.87 ఎకరాల భూసేకరణ సైతం పూర్తయ్యింది. పాశర్లపూడి వైపు వంతెన నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న మత్స్యకారుల కోసం 3.6 ఎకరాలను సమీపంలోని పాశర్లపూడి బాడవలో రెవెన్యూ అధికారులు సేకరించారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే వారికి పునరావాసం కల్పించనున్నారు. కాని అమలాపురం మండలం భట్నవల్లి నుంచి రోళ్లపాలెం, పేరమ్మ అగ్రహారం, పేరూరు, తోట్లపాలెం, మామిడికుదురు మండలం పాశర్లపూడి, జగ్గంపేట, రాజోలు నుంచి దిండి వరకు భూసేకరణ పూర్తి కాలేదు.

 

ఈ నేప‌థ్యంలో కేంద్రం ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే సాధారణ బడ్జెట్‌లో కోనసీమ రైల్వేలైన్‌కు కేటాయించే నిధులపై ఈ ప్రాంత వాసులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. గత నాలుగు బడ్జెట్లలో కేంద్రం భారీగా నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు 2001–02 నుంచి 2015–16 వరకు కేటాయించిన నిధులు కేవలం రూ.90.2 కోట్లు మాత్రమే. 2016–17 నుంచి నిధులు కేటాయింపు భారీగా పెరిగింది. ఆ ఏడాది రూ.200 కోట్లు, 2017–18లో రూ.430 కోట్లు, 2018–19లో రూ.200 కోట్లు, 2019–20లో రూ.200 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది కేటాయింపు భారీగా ఉంటుందని కోనసీమ వాసులు ఆశతో ఉన్నారు. మ‌రి ఏమేర‌కు కోనసీమ వాసుల క‌ల నెర‌వేరుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: