వైసీపీ-బీజేపీల మ‌ధ్య స్నేహం ఉందంటూ.. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ చేసిన ప్ర‌చారం అం తా ఇంతా కాదు. అయితే, అప్ప‌ట్లో ఈ విష‌యాన్ని నిరూపించ‌లేక పోయారు. ఇదిలావుంటే, ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల్లో చాలా వ‌ర‌కు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ ల‌భిస్తోంది. ముఖ్యంగా మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌, ఇంగ్లీష్ మీడియం, మండ‌లి ర‌ద్దు వంటి విష‌యాల్లో కేంద్రం స‌హ‌క‌రించే అవ‌కాశం మెండుగానే క‌నిపిస్తోంది. నిజానికి వైసీపీ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను తిప్పికొట్టడ‌మో.. లేదా తిర‌స్క‌రించ‌డం ద్వారానో బీజేపీ త‌మ‌కు స‌హ‌క‌రిస్తుంద‌ని టీడీపీ భావించింది.

 

కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ ఆశ‌లు అడియాస‌లుగానే మారాయి. ఇదిలావుంటే, తాజాగా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని కూడా ప్ర‌జ‌లే ఎన్నుకున్నార‌ని, ఆ ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాల‌ను చ‌ట్ట ప‌రిధికి లోబ‌డి కేంద్రం నోటిఫై చేస్తుంద‌ని బీజేపీ నుంచి సంకేతాలు వెలువ‌డ్డాయి. దీంతో రాష్ట్రంలో టీడీపీ ఆశ‌లు ఎలా ఉన్నా.. వైసీపీ లోపాయికారీగా బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్న‌ద‌నే విష‌యానికి చాలా వ‌ర‌కు మ‌ద్ద‌తు ల‌భించిన‌ట్ట‌యింది.

 

ఇది ప్ర‌స్తుతానికి టీడీపీకి ఎలాంటి ఇబ్బందీ లేకపోయినా.. ప్ర‌శ్నిస్తానంటూ.. పార్టీ పెట్టిన జ‌న‌సేన‌కు మాత్రం పెద్ద మైన‌స్ అయ్యే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. అటు రాజ‌ధాని రైతులు కానీ, ఇటు ప్ర‌త్యేక హోదా కోసం ఇప్ప‌టికీ ఆశ‌లు పెట్టుకున్న ప్ర‌జ‌లు కానీ, ప‌వన్ పై చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు.ఈ  క్ర‌మంలోనే జ‌న‌సేనాని జ‌గ‌న్‌ను ఎంత విమ‌ర్శించినా ఆనందించారు. కానీ, ఇప్పుడు తాను పొత్తు పెట్టుకున్న పార్టీ.. త‌న‌కు ఇష్టంలేని ఓ నాయ‌కుడికి అనుకూలంగా వ్య‌వహరిస్తే.. ప‌వ‌న్ ఏం చేయాలి ? అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

 

రాష్ట్ర రాజ‌ధాని విష‌యాన్ని కేంద్రం ప‌రిష్క‌రిస్తుంద‌ని చెబుతూ వ‌చ్చిన ప‌వ‌న్‌.. ఇప్పుడు ఈ విష‌యం జ‌గ‌న్ ప‌రిధిలోనే ఉంద‌ని ఆయన మ‌ద్ద‌తిచ్చిన పార్టీనే చెప్ప‌డాన్ని ఎలా జీర్ణించుకుంటారు? ప‌్ర‌జ‌ల‌ను ఎలా క‌లుస్తారు?  రాజ‌ధాని రైతుల‌ను ఎలా ఓదారుస్తారు?  అస‌లు జ‌గ‌న్‌తో బీజేపీ లోపాయికారీ ఒప్పందాన్ని ఎలా స‌హిస్తారు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌లుగా మారాయి. మ‌రి ప‌వ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: