ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రారంభించిన జ‌న‌సేన పార్టీ ఇంతింతై.. అన్న‌ట్టుగా పుంజుకుంటుంద‌ని అంద రూ అనుకున్నారు. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయినా.. మున్ముందు మాత్రం పార్టీ పుంజుకుంటుంద‌ని, దీనికి త‌గిన విధంగా ప‌వ‌న్ ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుంటార‌ని అంద‌రూ అనుకున్నారు. ఓట‌మి ఎప్పుడు గెలుపున‌కు బాట‌లు ప‌రుస్తుంద‌నే సూత్రాన్ని ప‌వ‌న్ పాటిస్తార‌ని కూడా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆయ‌న కొన్ని రోజులు ఒంట‌రిగానే ఉన్నా.. బీజేపీతో చేతులు క‌లిపేశారు. కేంద్రంలోని బీజేపీ త‌న‌కు అనుకూల‌మైన స‌మ‌యంలో ప‌వ‌న్‌ను క‌లుపుకొంది.

 

ప్ర‌స్తుతం ఎన్నార్సీ, సీఏఏల‌పై బీజేపీకి వ్య‌తిరేక గాలులు వీస్తున్నాయి. ఈ క్ర‌మంలో సాధ్య‌మైనంత వ‌ర‌కు ఈ వ్య‌తిరేక గాలుల‌ను త‌గ్గించుకునేందుకు అందివ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొనేందుకు పార్టీ నేత‌లు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే పంజాబ్‌లో సైనా నెహ్వాల్ ను ఏపీలో ప‌వ‌న్ వంటివారిని క‌లుపుకొని ముందుకు సాగుతున్నారు. దీనివ‌ల్ల ప‌వ‌న్ ఎక్క‌డ ఏ వేదిక ఎక్కినా.. కేంద్రంలో మోడీ ప‌థ‌కాల‌ను వారు తీసుకున్న లైన్‌ల‌ను కూడా పొగిడి తీరాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ కూడా సీఏఏతో ఎవ‌రికీ ఎలాంటి హానీ ఉండ‌ద‌ని చెబుతున్నారు.

 

మ‌రి ఇదే విష‌యం తెలియ‌క‌నా.. మిగిలిన పార్టీల వారంతా సీఏఏకు వ్య‌తిరేకంగా ఉద్య‌మిస్తున్నారు తీర్మా నాలు చేస్తున్నారు?  అనే విష‌యంపై ప‌వ‌న్ క్లారిటీ ఇవ్వాలి. ఇక‌, నిన్న‌టికి నిన్న క‌ర్నూలు జ‌న‌సేన కేడ‌ర్ తో నిర్వ‌హించిన స‌మావేశానికి ముస్లిం నాయ‌కులు పూర్తిగా డుమ్మా కొట్టారు. ఈ ప‌రిణామాన్ని ముందు ఊహించ‌లేక పోయిన ప‌వ‌న్‌.. త‌ర్వాత వెంట‌నే త‌న‌ను తాను క‌వ‌ర్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. సీఏఏ వ‌ల్ల ఎవ‌రికీ ఎలాంటి హానీ ఉండ‌ద‌ని అన్నారు. త‌న‌ను న‌మ్మేవారితోనే తాను న‌డుస్తాన‌ని చెప్పారు. మొత్తంగా చూస్తే.. ప‌వ‌న్ తీసుకున్న బీజేపీతో పొత్తు అనేది పార్టీలోని ముస్లిం వ‌ర్గాన్ని దూరం పెట్టేసింది.

 

ఇక‌, మేధావులు సైతం మోడీ నిర్ణ‌యాల‌ను త‌ప్పు ప‌డుతున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ మోడీతో క‌లిసి వెళ్ల‌డాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. స‌మ‌యం చూసుకుని వారు కూడా జంప్ చేసేందుకురెడీ అవుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తున్నది. మ‌రి దీనికి ఎలాంటి అడ్డుక‌ట్ట వేస్తారో.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: