ప్రశ్నిస్తాను అంటూ రాజకీయాల్లోకి వచ్చి ప్రశ్నగా మారిపోయారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజకీయాల్లోకి వచ్చిన  మొదట్లో తాను ఆషామాషీ రాజకీయాలు చేయనని, సాంప్రదాయ పార్టీలకు భిన్నంగా జనసేన పార్టీ రాజకీయాలు చేస్తుంది అంటూ గొప్పగా చెప్పుకున్నారు పవన్. కానీ ఆ సంగతి అప్పుడే మర్చిపోయి... అనుమానాస్పద రాజకీయాలకు తెర తీశారు. అసలు తాను జనసేన పార్టీని ఏ ఉద్దేశంతో స్థాపించారో ఆ సంగతి మరిచిపోయి సిల్లీ సిల్లీ గా పాలిటిక్స్ చేస్తుండడంతో ఆయన పై అనుమానాలు మొదలయ్యాయి. అసలు పవన్ రాజకీయాలకు పనికి వస్తారా అని సందేహం కూడా జనాల్లో మొదలైంది. 


ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు కానీ, రాజకీయ నాయకుడికి ఉండాల్సిన అర్హతలు కానీ పవన్ లో ఉన్నట్టుగా కనిపించడంలేదు. ఈ మాటలు ఏవేవో చెబుతున్నవి అయితే కాదు .. స్వయంగా పవన్ తో అత్యంత సన్నిహితంగా మెలిగి ఆయనకు దూరం జరిగిన రాజు రవితేజ వంటి వారు చెబుతున్నవే. అధికారం కోసం తాను రాజకీయ పార్టీ పెట్టలేదన్నా ఆ అధికారం కోసమే పవన్ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. సీఎం సీఎం అని స్వయంగా అభిమానులతో పిలిపించుకున్నారు. పోనీ అధికారం తెచ్చుకునే విధంగా ప్రయత్నాలు చేశారా అంటే అదీ లేదు. సొంత పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోకుండా ఇతర పార్టీలపై పవన్ విమర్శలు చేసుకుంటూ కాలాన్ని ఇప్పటికీ గడిపేస్తున్నారు. ఇదే పవన్ పై జనసేన పార్టీ నాయకులకు తీవ్రస్థాయిలో అసహనం కలిగిస్తోంది. 


గతేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోజనసేన పార్టీ ఘోర పరాజయం పాలవడానికి ప్రధాన కారణం పవన్ వ్యవహారశైలే కారణం అనేది అందరికి తెలిసిన విషయమే. ఆ ఎన్నికల్లో గెలుపొందే లేకపోవడానికి పవన్ అనుమానాస్పద, నిలకడలేని మాటలు ప్రజల్లో నమ్మకాన్నిపెంచలేకపోయాయి అనేది వాస్తవం. మరీ ముఖ్యంగా చెప్పుకుంటే ఆయన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అదుపాజ్ఞల్లో పని చేస్తున్నారనేది నిజమే అని విమర్శలు వస్తున్నా జనసేన నాయకులు కానీ, పవన్ కానీ దానిని కందించలేకపోతున్నారు. అప్పటికి ఇప్పటికి పవన్ చంద్రబాబు అదుపాజ్ఞల్లోనే పనిచేస్తున్నారని ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దీనికి తగ్గట్టుగానే ఆయన వ్యవహారశైలి కూడా  ఉంటూ వచ్చింది.


 టిడిపి ప్రభుత్వ హయాంలో పవన్ టార్గెట్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద,  ఆ పార్టీ అధినేత జగన్ మీద పెట్టారు. తరచుగా ప్రతిపక్షంలో ఉన్న వై సీ పీ ని విమర్శించడానికి సమయం కేటాయించారు. అదే సమయంలో టిడిపి ప్రభుత్వంలో నెలకొన్న లోపాలను ఎత్తిచూపిస్తూ ప్రశ్నించేందుకు ముందుకు రాలేదు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా పవన్ వైసీపీ ని టార్గెట్ చేసుకుంటూ ప్రజా ఉద్యమాలు, ధర్నాలు, ఆందోళనలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఉద్యమాలు చేయడం తప్పు కాకపోయినా తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే విధంగా ఆ పార్టీకి మైలేజ్ తెచ్చే విధంగా పవన్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి.


జనసేన పరిస్థితి ఏ క్లారిటీ లేకుండా గందరగోళంలో ఉండగానే అకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు పవన్.  ఈ విషయాన్ని జనసేన పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు కూడా చెప్పకుండా ఈ వ్యవహారం అంతా నడపడంతో జెడి లక్ష్మీనారాయణ వంటి వారు పార్టీకి దూరమయ్యారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం పై కక్ష సాధించాలని పవన్ చూసారు. కానీ బీజేపీ అగ్ర నేతలు ఎవరూ పవన్ కి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో పవన్ చాలా అవమానాలే రాజకీయంగా ఎదుర్కొన్నారు. బీజేపీ మాత్రం తమకు రాజకీయంగా ఏది ఉపయోగం.. ఎవరి వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందో లెక్క చూసుకుని ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. 


 పవన్ కు ఈ పరిణామాలు తీవ్ర ఆగ్రహం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జగన్ కు బిజెపి మద్దతు ఇవ్వడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు.  బీజేపీని కాదని పవన్ మూడు రాజధానులు నిర్ణయాన్ని వ్యతిరేకించే లేక గతంలో తాను అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉంటానన్న మాటను నిజం చేయలేక పవన్ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. మొదట్లో రాజధాని ప్రాంతంలో పర్యటించిన పవన్ నేను రోడ్డు మీదకి వస్తే అమరావతిలోనే రాజధానిని ఉంచేస్తారా అని ప్రకటించి చివరికి గ్రామాల్లోకి వెళ్లేసరికి బిజెపి అమరావతి విషయంలో అండగా ఉంటానని తనకు హామీ ఇచ్చిందని, అందుకే తాను ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాను అంటూ చెప్పుకున్నారు. కానీ బీజేపీ మాత్రం ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు.


 ఇప్పుడు జగన్ కు మూడు రాజధానుల విషయంలో స్వయంగా మోదీనే మద్దతు  ఇవ్వడం ద్వారా పవన్ కు ఏ హామీ ఇవ్వలేదనే విషయం బయటపడుతుంది. అసలు తాను ఢిల్లీకి వెళ్లింది అమరావతి రైతులకు మద్దతుగా అని చెప్పి బీజేపీ అమరావతికి మద్దతుగా ఉంటాను అని చెప్పింది అని పవన్ చెప్పుకున్న మాటలన్నీ ఉత్తుత్తి మాటలే అన్నది అర్ధం అయిపొయింది. దాన్ని కవర్ చేసుకునేందుకు రాజధాని పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశం అంటూ తాను అడ్డుకుంటే అది ఆగేది కాదు అంటూ పవన్ ఇప్పుడు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరోసారి పవన్ కు ఏ విషయంలోనూ క్లారిటీ ఉండదు అనే విషయాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. 


ఇక వైసీపీ కనుక ఎన్డీయేలో చేరితే తాను బయటకు వచ్చేస్తాను.. అంటూ పవన్ అప్పుడే బెదిరింపులు మొదలుపెట్టారు. అయితే పవన్ బెదిరింపులకు బిజెపి భయపడే అవకాశమే లేదు. ఎందుకంటే..?  ఏపీలో పవన్ కళ్యాణ్ బలం ఏంటో బీజేపీకి బాగా తెలుసు. ఇదే కాదు ఏ విషయంలోనూ పవన్ మాటమీద నిలబడే రకం కాదు అని, అసలు ఆయనకి ఏ విషయంలోనూ క్లారిటీ ఉండదని బీజేపీకి బాగా బాగా తెలుసు. మరి పవన్ కు ఈ విషయం ఎప్పుడు తెలుస్తుందో ..? జనసేన పార్టీకి ఎప్పుడు మంచి రోజులు వస్తాయో ...? 

మరింత సమాచారం తెలుసుకోండి: