పుల్వామా దాడి జరిగడానికి సరిగా మూడు రోజుల క్రితం... మూడు రోజుల క్రితం... అమెరికా నిఘా సంస్థలు భారత్ లో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించడమే కాకుండా తమ వార్షిక నివేదకను అమెరికన్ కాంగ్రెస్ ముందు కూడా ఉంచాయి... అదే కాదు... రెండు రోజులు ముందు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆఫ్ఘన్ లో జరిగిన ఒక కారు బాంబు దాడి వీడియోను ఆన్లైన్ లో ఉంచింది. వెంటనే కాశ్మీర్ పోలీసులు అప్రమత్తమై నిఘా వర్గాలకు సమాచారం అందించి... ఇలాంటి దాడి జరిగే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఆర్మీలో అత్యున్నత స్థాయి అధికారులకు కూడా ఇదే విషయం చెప్పారు. 

 

ఇన్ని హెచ్చరికలు ఉన్నా సరే... రోడ్డు బాగోలేదు... అనే కారణంతో 2500 మంది జవాన్లను ఒకేసారి సరిహద్దులకు విధులకు తరలించారు. ఫలితం మంచు కొండలు రక్తంతో తడిచిపోయాయి. మువ్వన్నెల జెండా తనను మోసిన చేతుల వద్ద దీనంగా పడి రోదించింది. కోట్లాది మంది భారతీయులు తమ పౌరులను కోల్పోయినందుకు కన్నీరు మున్నీరుగా విలపి౦చారు. దాడి జరిగిపోయింది సరే... ప్రధాని సహా విపక్షాలు అన్ని దాడిని తీవ్రంగా ఖండించడమే కాకుండా ప్రతీకారం తీర్చుకోవాలని కూడా సూచిస్తూ తమ సలహాలను కూడా ఇచ్చారు.

 

ఎప్పటి లాగే బిజెపి దేశ భక్తులు తమ దేశ భక్తిని చాటుతూ ప్రతి రక్తపు బొట్టుకి ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. మరి ఇక్కడ తప్పు ఎవరిది...? మూడు రోజుల ముందు అన్ని హెచ్చరికలు వచ్చినప్పుడు నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి...? భారత జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ ఏం చేస్తున్నారు...? భారత ప్రభుత్వం ఏం చేస్తుంది...? ఇన్ని హెచ్చరికలు వచ్చినప్పుడు అంత మంది జవాన్లను ఏ విధంగా ఒక్కసారే తరలించారు...? కాశ్మీర్ లాంటి వివాదాస్పద ప్రాంతంలోనే ఈ విధంగా నిఘా వర్గం విఫలమైతే మరి ఇతర ప్రాంతాల పరిస్థితి ఏంటి...? ఆ దాడి అనంతరం వినపడిన ప్రశ్నలు ఇవి. 

 

నిఘా వర్గాన్ని పటిష్టంగా ఉంచాల్సిన దోవల్ సిబిఐ వ్యవహారాల్లో తలదూర్చి సమయం మొత్తం ఇలాంటి వ్యవహారాలకు వెచ్చించినందుకు ఫలితం ఇదేనని పలువురు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. రోహింగ్యా ముస్లింలు భారత్ లోకి వస్తున్నారనే విషయాన్ని లెక్కలతో సహా చెప్పిన నిఘా వర్గాలు ఇలాంటి దాడి జరుగుతుందనే విషయాన్ని ఎందుకు అంచనా వేయలేకపోయాయి. కాశ్మీర్ లో శాంతి భద్రతల విషయంలో ముఫ్తీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన అమిత్ షా గారు, ఇప్పుడు అక్కడ గవర్నర్ పాలన ఉంది కదా... అంటే కేంద్రందే బాధ్యత కదా...? 

 

దాడి జరిగిన తర్వాత బిజెపి పెద్దలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాట్లాడటం మొదలుపెట్టి భావోద్వేగాలు రగిలించే ప్రయత్నం చేసి ఎన్నికల్లో లబ్ది పొందే ప్రయత్నం చేసారు. ఎన్నికల వేళ తమకు అనుకూలంగా ఉండే విధంగా వ్యాఖ్యలు చేసారు. ఈ 5 ఏళ్ళలో ఎంత మంది భారత జవాన్లు మరణించారు...? 20౦4 నుంచి 2014 వరకు ఎంత మంది మరణించారు...? ఈ మధ్యలో జరిగిన దాడులు ఎన్ని...? బిజెపి సర్కార్ దీనిపై మాట్లాడి తాము కట్టామని చెప్పిన కోటకు ఎందుకు చిల్లులు ఉన్నాయో మాత్రం ఏ ఒక్కరు సమాధానం చెప్పలేదు. 

 

నోట్ల రద్దు తర్వాత కాశ్మీర్ లో రాళ్ళ దాడులు తగ్గిపోయాయి అని చెప్పుకున్న రక్షణ శా ఏవేవో మాటలు చెప్పింది. ఎన్నికల వేళ బిజెపికి దొరికిన ఆహారం ఈ దాడని సోషల్ మీడియాలో కొందరు తీవ్ర ఆరోపణలు చేసారు. దీనిని ఎంత వండి వార్చితే అంతగా ఎన్నికల ఫలితం ఉంటుందని బిజెపి భావిస్తున్నట్టు కూడా చెప్పారు. తమ దేశ భక్తిని శంకించడానికి ఆస్కారం లేకుండా చూసుకుంది బిజెపి... ఇంత పెద్ద దాడి జరగడమే బిజెపి ఊహించలేనప్పుడు, ఇతర ప్రాంతాల మీద దాడులను ఊహించే ప్రయత్నాలు చేస్తుందా...? అయినా చంద్రబాబు దీక్షల మీద, మమతా బెనర్జీ పంచాయితీల మీద, సిబిఐ, ఈడి వ్యవహారాల మీద దృష్టి ఉన్న మోడీ సర్కార్ ఇలాంటి విషయాలను అనుకూలంగా మార్చుకోక ఏ౦ చేస్తుందని ఆరోపణలు వచ్చాయి. 

 

ఇక ఆ దాడి తర్వాత హిందుస్తాన్ ఎక్స్ప్రెస్ ప్రారంభం సందర్భంగా మోడీ కొన్ని వ్యాఖ్యలు చేసారు. భారత బలగాలు కచ్చితంగా సమాధానం చెప్తాయని వారికి పూర్తి స్వేచ్చ ఇచ్చామని చెప్పారు. పఠాన్ కోట్ ఆర్మీ బేస్ క్యాంప్ పై దాడి జరిగినప్పుడు అప్పుడు రక్షణ శాఖా మంత్రిగా ఉన్న దివంగత మనోహర్ పారికర్ అటు నుంచి ఒక బుల్లెట్ వస్తే ఇటు నుంచి పది వెళ్తాయని అన్నారు. ఆ స్వేచ్చ ఇచ్చామని కూడా స్పష్టంగా చెప్పారు. మరి అంత స్వేచ్చ ఉన్నప్పుడు ఇలాంటి దాడి ఎందుకు జరిగిందనే సమాధానం రాలేదు. ఆ దాడి తర్వాత... పాకిస్తాన్ భూభాగంలోకి 90 కిలోమీటర్ల మేర చొచ్చుకు వెళ్లి యుద్ద విమానాలతో భారత వైమానిక దళం దాడులు చేసి 300 మంది ఉగ్రవాదులను హతమార్చారని బిజెపి ప్రకటించింది. 

 

మీడియాలో కూడా ఈ ప్రసారాలు ఎక్కువగానే రావడంతో సాక్ష్యాలు ఆధారాలు లేకుండానే ఉత్తరభారతదేశం మోడిని కీర్తించింది. వైమానిక దళం గాని అప్పుడు రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ గాని ఎక్కడా కూడా ఇంత మంది మరణించారని లెక్కలు చెప్పలేదు. కేవలం మీడియాలో మాత్రమె ఆ కథనాలు రావడానికి అమిత్ షా లాంటి రాజకీయ నాయకులే కారణం. ఆ తర్వాత సాక్ష్యాలు అడిగిన వారిని దేశ ద్రోహులుగా చిత్రీకరించారు. ఆ తర్వాత బీబీసి లాంటి అంతర్జాతీయ వార్తా సంస్థలు అసలు ఆ దాడి జరిగినట్టు, ఆ దాడిలో అంత మంది ఉగ్రవాదులు మరణించినట్టు సాక్ష్యాలు ఉన్నట్టు కనపడలేదని వ్యాఖ్యానించారు. అసలు అంత పెద్ద దాడులు సరిహద్దుల్లో జరిగితే పాక్ వైమానిక దళం నిద్రపోతుందా...? 

 

ఇక ఆ సమయంలో సాక్ష్యాలను అడిగే అవకాశం లేకుండా అభినంధన్ వ్యవహారాన్ని కూడా బిజెపి వాడుకుందనే ఆరోపణలు ఉన్నాయి. అతనిని పాకిస్తాన్ పట్టుకున్న తర్వాత బిజెపి దేశ భక్తులు సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా రెచ్చిపోయారు. ఆ తర్వాత అతనిని పాకిస్తాన్ వదలడంతో జెనివా ఒప్పందం ప్రకారం అభినంధన్ ని పాకిస్తాన్ వదిలే విధంగా అగ్రరాజ్యాల నుంచి మోడీ ఒత్తిడి తీసుకువచ్చారని అందుకే అతనిని వదిలేసారని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ సైనికులు మన సైనికులు తలలు నరికితే కనీసం స్పందించని మోడీ, పాకిస్తాన్ కులభూషణ్ జాదవ్ ని అదుపులోకి తీసుకుని చిత్ర హింసలు పెడుతుంటే విడిపించలేని మోడీ అభినంధన్ విషయంలో అంత వేగంగా ఏ విధంగా స్పందించారు ఎలా విడిపించారు అనేది కూడా ఎవరికి అర్ధం కాలేదు.

 

అసలు మన సైనికుడిని పట్టుకుంటే పాక్ వీడియో ఎందుకు విడుదల చేస్తుంది...? ఈ అనుమానం ఎంత మందికో వచ్చింది. కులభూషణ్ ఫోటో గాని రవీందర్ కౌశిక్ ఫోటో గాని చాలా ఏళ్ళు బయటకు రాలేదు. ఏది ఎలా ఉన్నా... ఎన్నికలు అవుతున్నా ఎన్నికల ముందు చేసిన సర్జికల్ దాడుల వీడియోలు మాత్రం బయటకు రాలేదు. కాని సైనికులను మాత్రం రాజకీయానికి వాడుకున్నట్టు స్పష్టంగా అర్ధమవుతుందనే ఆరోపణలు ఇప్పటికి వినపడుతున్నాయి. ఈ దాడి జరిగి ఏడాది అయినా ఇప్పటి వరకు ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: