రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఉండడం సహజం. ఒకసారి  అధికారం దక్కవచ్చు. మరోసారి అధికారం దూరం అవ్వొచ్చు.  ఏమి జరిగినా... ఎందుకు జరిగినా.. రాజకీయాల్లో ఒడుదొడుకులు సహజమే. అయితే అదేపనిగా ఎత్తులు వచ్చినా .. ఒడిదుడుకులు వచ్చినా రాజకీయ జీవితం తలకిందులు అవ్వడమే  కాకుండా ప్రజల్లో ఉన్న పలుకుబడి కూడా అమాంతం పడిపోతుంది. ఇప్పుడు అదే రకమైన పరిస్థితిని ఏపీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఎదుర్కుంటోంది. టిడిపి ప్రభుత్వ హయాంలో లెక్కలు మిక్కిలిగా జరిగిన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అవినీతి జరుగుతోందని తెలిసినా ప్రజల్లో ఈ విషయమై చర్చ జరుగుతుందనే రిపోర్ట్స్ అందినా చూసీచూడనట్లుగా గత ప్రభుత్వ పెద్దలు వ్యవహరించడంతో అదే అలుసుగా తీసుకుని ఆ పార్టీలోని నాయకుల నుంచి మంత్రుల వరకు ఎవరికి వారు దోచుకున్నోడికి దోచుకున్నంత అన్నట్టుగా వ్యవహరించారు. 


ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు ఆ పార్టీకి శాపంగా మారాయనేది ఆ పార్టీ పెద్దలకు కూడా తెలిసిన నిజం. అయితే అప్పటికే జన్మభూమి కమిటీలను టిడిపి ప్రభుత్వం రద్దు చేసినా దాని ప్రభావం మాత్రం జనాల్లో కి బాగా వెళ్ళిపోయింది. కేవలం ఒక సామాజిక వర్గం ప్రజలు బాగుపడితే చాలు అన్నట్లుగా అప్పటి ప్రభుత్వ పెద్దలు వ్యవహరించిన తీరు కూడా విమర్శల పాలైంది. అడ్డు అదుపు లేని అవినీతి కుంభకోణాల కారణంగా తెలుగుదేశం పార్టీ పేరు కాస్త జనాల్లో పోయింది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో ఓటమి ఎదురైంది. ఇదంతా టిడిపి అగ్రనేతల స్వయంకృత అపరాధమే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. పార్టీలో ఉన్న నాయకులు సైతం దినమొక గండంగా తమ రాజకీయ జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు.


 ప్రస్తుతం టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీలో ఉన్న కీలక నాయకులందరి అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా రోజుకు ఒకటి బయటకు వస్తున్నాయి. అయినా ఆ పార్టీ నాయకులు తీరు మాత్రం ఎక్కడ పశ్చాత్తాపం కనిపించకపోగా అదేపనిగా ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. ఏ రోజు ఏ నాయకుడి అవినీతి వ్యవహారం బయట పడుతుందో తెలియని పరిస్థితి తెలుగుదేశం పార్టీలో నెలకొంది. చంద్రబాబు అవినీతికి సంబంధించి ఆయన పర్సనల్ సెక్రెటరీ ఇంట్లో ఐటి దాడులు జరిగిన సందర్భంగా అనేక కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అహ్మద్ పటేల్ కు సుమారు 400 కోట్లు పంచినట్టుగా కూడా వార్తలు వచ్చాయి.  


తాజాగా ఈఎస్ఐ లో భారీగా బయటపడిన అవకతవకలకు సంబంధించి మాజీ మంత్రి అచ్చం నాయుడు పేరు బయటకు వచ్చింది. ఆయనతో పాటు ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన పితాని సత్యనారాయణ పేరు కూడా ఈ స్కాం లో బయటపడింది. ఇప్పుడు ఇంకా అనేక మంది మాజీ మంత్రులు వ్యవహారాలు వెలుగుచూసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ నిర్వహించిన దేవినేని ఉమామహేశ్వరరావు వ్యవహారం కూడా మరికొద్ది రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 


వీరే కాకుండా ఇంకా అనేక మంది అవినీతి వ్యవహారాలను బయటకి తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం గట్టి పెట్టుదలతో ఉంది. గత ప్రభుత్వంలోని అవినీతిని తవ్వి తీసేందుకు ఇప్పటికే సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ పని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని అవకతవకలు  బయటకి తీయడమే పనిగా రంగంలోకి దిగింది. దీంతో తెలుగుదేశం లో కీలకంగా వ్యవహరించిన నాయకులంతా క్షణమొక యుగంగా గడుపుతున్నారు. ఎప్పుడు ఏ క్షణాన ఎవరు ఏ కేసులో ఇరుక్కుంటారో తెలియక ఆందోళన చెందుతున్నారు. దీంట్లో గ్రామ స్థాయి నాయకుల నుంచి టిడిపి అధినేత వరకు అంతా భయం భయంగానే కాలం గడుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: