చెప్పులు ఎగిరెగిరి పడుతున్నాయి.. అనుమానాలు పెరిగిపోతున్నాయి. పార్టీలో ఉన్నా లేనట్టుగానే నాయకుల వ్యవహారం ఉంటోంది. ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా స్పందన కరువవుతోంది. ప్రజల చూపు, అభిప్రాయాలు అంతకు ముందు ఉన్నట్టుగా లేవు. దొంగను చూసినట్లుగా చూసే పరిస్థితి వచ్చింది. గతంలో వలకబోసిన వైభోగం అంతా ఇప్పుడు అకస్మాత్తుగా పోయింది. పార్టీలోనూ ప్రజల్లోనూ ఉన్న పేరు ప్రఖ్యాతలు అమాంతం పోయాయి. ఇప్పుడు ఉనికి కోసం ఆరాటపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవైపు వయస్సు ఏడు పదులు దాటుతోంది. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. అయినా పార్టీ కోసం పరపతి కోసం ఆరాటం... పోరాటం చేయవలసిన దుస్థితి. 


ఈ వయసులోనూ వచ్చేసింది. తన తర్వాత పార్టీకి అండగా నిలవాల్సిన రాజకీయ వారసుడు అసమర్దుడిగా మిగిలిపోయాడు. పార్టీలోనూ, ప్రజల్లోనూ అతని నాయకత్వంపై అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ నాయకుల్లోనూ, ప్రజల్లోనూ భరోసా పెంచుతూ నాలుగేళ్ల పాటు పార్టీని మోసుకురావడం అంటే ఆషామాషీ కాదు. ఇవన్నీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నూ... ఆ పార్టీ అధినేత చంద్రబాబు లోను అలుముకున్న అనుమానాలు, సందేహాలు.  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తాము ఘోరంగా ఓటమి చెందడం  వీటన్నింటి నుంచి తొందరగానే టీడీపీ అధినేత చంద్రబాబు మేల్కొన్నా వైసిపి ప్రభుత్వ దూకుడు ఇంత స్పీడ్ గా ఉంటుందని, తమ పార్టీ పరిస్థితి ఇంత దారుణంగా తయారవుతుందని చంద్రబాబు ముందుగా ఊహించలేకపోయారు. 


తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతానికి  21  మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునే విషయంలో జగన్ నిజాయితీగా ఉండడంతో వైసీపీలోకి చేరికలు లేవు. అదే గత ప్రభుత్వంలో చంద్రబాబు ఏ విధంగా అయితే వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని వారిలో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారో ఆ విధంగానే జగన్ కూడా తమ పార్టీలోకి గేట్లు ఎత్తేస్తే టీడీపీలో చంద్రబాబు తప్ప మరెవరు ఉండేవారు కాదు. అప్పుడు ఇప్పుడున్న పరిస్థితికంటే దారుణంగా పరిస్థితులు ఉండేవి. ఇప్పటికీ వైసీపీలోకి వచ్చేందుకు టిడిపిలో చాలా మంది ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ విషయంలో జగన్ కఠినంగా ఉండడంతో పాటు టిడిపి ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో జగన్ ఆసక్తిగా లేకపోవడంతో, తప్పని పరిస్థితుల్లో వారు టిడిపిలో కొనసాగుతున్నారు.


 వీరే కాకుండా క్షేత్రస్థాయిలో నాయకులు కూడా టిడిపిలో ఉంటే భవిష్యత్తు అంధకారం అనే ఆలోచనలోనే ఉన్నారు. మరి కొంత మంది వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబులో ఆందోళన పెంచుతున్నాయి. తాము ఏ ఉద్యమం చేపట్టినా, ప్రజా ఆందోళనలు చేసినా కొద్ది రోజులకే అది జగన్ కు అనుకూలంగా మారడం, ప్రజల్లో నవ్వులపాలవ్వడం చంద్రబాబును కలిచి వేస్తోంది. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అని పదే పదే చెప్పుకునే చంద్రబాబులో ఇప్పుడు భయాందోళనలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో అధికార పార్టీ ఎత్తి చూపుతున్న తప్పులకు  సమాధానం చెప్పలేక బిత్తర చూపులు చూస్తుంటే చంద్రబాబు పరిస్థితి చూసి జాలి కలుగుతుంది. 


పార్టీ అధికారంలో ఉండగా అక్రమాలు, అన్యాయాలకు గేట్లు తెరిచి చూసి చూడనట్లుగా వ్యవహరించడం, నాయకులను ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతూ అందులో అధినేత కూడా వాటాలు పంచడం... ఇప్పుడు వాటిపై విచారణ జరుగుతుండడం ఇవన్నీ 70ఏళ్ల వయసులో చంద్రబాబు పడుతున్న టెన్షన్ లు. తన తరువాత పార్టీలో పార్టీని ముందుకు నడిపించే నాయకుడు ఇతడే అని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి చంద్రబాబు ది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా... చంద్రబాబు తర్వాత టిడిపి పగ్గాలు అందుకునేది లోకేష్ అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ లోకేష్ నాయకత్వంపై సొంత పార్టీ నేతల్లోనే తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇప్పటికే పార్టీని వీడి వెళ్లిన వారంతా లోకేష్ ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు బలవంతంగా లోకేష్ నాయకత్వాన్ని టీడీపీకి అంటగట్టినా అది కొంతకాలానికి పెను ముప్పు తెచ్చే అవకాశం ఉంది. 

 

ఇన్ని టెన్షన్ లు తట్టుకుంటూ పార్టీని మరో నాలుగేళ్ల పాటు జనాల్లో ఆదరణ కోల్పోకుండా ముందుకు తీసుకు వెళ్లడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. చంద్రబాబులో ఆ కసి పట్టుదల ఉన్నా ఆ పార్టీ నాయకుల్లో మాత్రం నిరుత్సాహం పోలేదు. అసలు టీడీపీకి మళ్ళీ పునర్వైభవం వస్తుందన్న ఆశలు ఆ పార్టీలోని ఏ ఒక్కరి లోనూ కనిపించడం లేదు. కేవలం పార్టీ లో ఉన్నాము ..తప్పదు కాబట్టి..  పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము అన్నట్లుగా టిడిపి నాయకుల వ్యవహారం ఉంటోంది. ఇవన్నీ టిడిపి భవిష్యత్తును ముందుగానే తెలియజేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: