న్నికలకు ముందు... తరువాత జగన్ నోటి నుంచి ఎప్పుడు వినిపించే మాట నవరత్నాలు. ఈ నవరత్నాలు కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే  కాకుండా, చిత్తశుద్ధితో వాటిని అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే సంకల్పంతో ముందుకు వెళ్తోంది. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ వైసీపీ అధినేత జగన్ ఎన్నికలకు ముందు 14 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి జనాల కష్టాలను, బాధలను అన్నిటిని చూసారు. పాదయాత్ర సమయంలో తనకు ఎదురైన అనుభవాలు అన్నిటిని పూర్తిస్థాయిలో విశ్లేషించి 'నవరత్నాలు' అనే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారు. అనుకున్నట్టుగానే ఏపీలో వైసీపీ ప్రభుత్వం కనీవినీ ఎరుగని మెజార్టీతో అధికారం చేపట్టింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే జగన్ నవరత్నాలు కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టారు. ఇంతకీ జగన్ అమలు చేస్తున్న నవరత్న పథకాలు కార్యక్రమాలు ఏంటి అంటే..?

IHG

ఆరోగ్యశ్రీ

ఫీజు రియంబర్స్మెంట్

పేదలందరికీ ఇళ్లు

వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత

పింఛన్ల పెంపు

అమ్మ ఒడి

వైఎస్సార్ రైతు భరోసా

జలయజ్ఞం

మద్య నిషేధం

 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇప్పటికీ తొమ్మిది మాసాలు అవుతోంది. ఈ తొమ్మిది మాసాల్లో ఈ నవరత్నాలు కార్యక్రమాన్ని జగన్ చాలా సమర్ధవంతంగా అమలు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు అని చెప్పాలి.

 

ఆరోగ్యశ్రీ

ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా లక్ష నుంచి 10 లక్షల వరకు మేలు చేసే విధంగా దీనిని రూపొందించారు. వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే విధంగా నిబంధనలు పొందుపరిచారు. అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లను వీటి పరిధిలోకి తీసుకువచ్చారు. కిడ్నీ వ్యాధి, తలసేమియా తో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అందరికీ ప్రతి నెల పదివేల పెన్షన్ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి రూపురేఖలు మార్చి కార్పొరేట్ హాస్పటల్ కు ధీటుగా వాటిని తీర్చిదిద్దుతున్నారు. ఈ పథకం సక్సెస్ ఫుల్ గా అమలవుతోంది. ఎంతో మంది నిరుపేదలు ఈ పథకం ద్వారా లభ్ది పొందుతున్నారు. 

 

IHG

 

ఫీజు రీయింబర్స్మెంట్

ఒకటో తరగతి మొదలు ఇంజనీరింగ్ వరకు ఉన్నత చదువులు చదివే పేద వారికి అయ్యే ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా దీనిని రూపుదిద్దారు. అన్ని సామాజిక వర్గాల విద్యార్థులకు నూరు శాతం ఫీజు రియంబర్స్మెంట్ ఈ పథకం ద్వారా అందుతోంది. ఈ పథకం ద్వారా లక్షా 50 వేల వరకు ప్రయోజనం చేకూరుతుంది. ఇవి కాకుండా విద్యార్థులకు భోజనం, వసతి సౌకర్యాల కోసం అదనంగా ప్రతి ఒక్కరికి 20 వేల రూపాయలు ప్రభుత్వం ఇప్పటికే వారి బ్యాంకు అకౌంట్ లో వేసింది.

 

పేదలందరికీ ఇళ్లు

ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 2 నుంచి 5 లక్షల వరకు ప్రయోజనం చేకూరేలా రూపొందించారు. ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇల్లు ప్రభుత్వం నిర్మించేలా, ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు కట్టాలని జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అవసరమైతే ఇంటి మీద పావలా వడ్డీకే రుణాన్ని అందించే ఏర్పాటు చేశారు. ఈ ఉగాది నాటికి ప్రతి గ్రామంలోనూ, ఇళ్ల స్థలాలు, పట్టాలు పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే స్థల సేకరణ జరిగింది. ఈ పథకం అమలుపై ప్రజల ఆనందం వ్యక్తమవుతోంది.

IHG

 

వైయస్సార్ ఆసరా వైయస్సార్ చేయూత

ఈ పథకం కింద పొదుపు సంఘాల రుణ మొత్తాన్ని నాలుగు దఫాలుగా చేతికి నేరుగా ఇస్తారు.అంతేకాకుండా సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వడమే కాకుండా ఆ వడ్డీ డబ్బులు ప్రభుత్వం నేరుగా బ్యాంకులకు ఇచ్చే ఏర్పాట్లు చేశారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి 50,000 వరకు ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాకుండా వైయస్సార్ చేయూత ద్వారా 45 ఏళ్లు నిండిన బి.సి, ఎస్సి, ఎస్.టి మైనారిటీ మహిళలకు అందిస్తున్నారు. రెండో ఏడాది నుంచి నాలుగేళ్లలో 75000 దశల వారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా అందించే ఏర్పాటు చేశారు. గ్రామ వార్డు వాలంటీర్ ల సహకారంతో సంబంధిత కార్పొరేషన్ ద్వారా దీనిని అమలుకు శ్రీకారం చుట్టారు. 

 

పెన్షన్ల పెంపు

వృద్ధులు, వికలాంగులకు గతంలో అందే పెన్షన్ కంటే ఇప్పుడు కాస్త ఎక్కువగా పెన్షన్ అందిస్తున్నారు. ఈ నెల నుంచి లబ్ధిదారులు ఇళ్లకే నేరుగా పెన్షన్ అందించే ఏర్పాటును కూడా వైసిపి ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటి వరకు పెన్షన్ పొందాలంటే 65 ఏళ్లు వయసు ఉన్నవారు మాత్రమే అర్హులు అయ్యేవారు. కానీ వైసిపి ప్రభుత్వం దీనిని 60 ఏళ్లకు తగ్గించింది. వృద్ధులకు 2000 గా ఉన్న పెన్షన్ దశల వారీగా మూడు వేలకు పెంచే విధంగా ఈ పథకంలో పొందు పరిచారు. ప్రస్తుతం 2250 అందుతోంది. వచ్చే సంవత్సరం నుంచి 2500 ఆ తరువాత 2750 ఆ తరువాత 3000 వేల వరకు దశలవారీగా పెంచి అమలు చేసేందుకు జగన్ తొలి సంతకం చేశారు. ఇక దివ్యాంగులకు 3000 కు పెన్షన్ పెంచారు. అలాగే డయాలసిస్ రోగులకు 3500 నుంచి 10,000 వరకు పెంచారు. గీత కార్మికులు మత్స్యకారులు ఒంటరి మహిళలకు పెన్షన్ 2250 కి పెంచారు.

 

అమ్మ ఒడి 

ఈ అమ్మ ఒడి పథకం అమలకు అనేక ఒడిదుడుకులు ఎదురైనా సమర్థవంతంగా అమలు చేసి చూపించింది ప్రభుత్వం. ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకే కాకుండా ఇంటర్ విద్యార్థులు కూడా అమ్మఒడిని వర్తింపజేశారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి కి 15 వేలు అమ్మఒడి పథకం ద్వారా అందిస్తున్నారు. ఇప్పటికే అమ్మ ఒడి పథకం సొమ్ములు ప్రతి తల్లి ఖాతాలో పడ్డాయి. ఇక ప్రతి శనివారం నో బ్యాగ్ డే ,అక్షయ పాత్ర ద్వారా రోజు రుచికరమైన, బలవర్ధకమైన భోజనం, ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లోనూ  తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, క్రీడలకు ప్రాధాన్యం అలాగే రాష్ట్రంలో 100% అక్షరాస్యత ఇలా అన్ని అమలు చేస్తున్నారు.

 

వైఎస్సార్ రైతు భరోసా

ఈ పథకాన్ని కూడా చిత్తశుద్ధితో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 12500  నుంచి లక్ష వరకు ప్రయోజనం చేకూర్చాలని చూస్తోంది. ఇప్పటికే మొదటి విడతగా రైతులకు సొమ్ములు పడ్డాయి. ఉచిత విద్యుత్ ఏర్పాటు, రుణాలు, రైతులు వాడే ట్రాక్టర్లకు రోడ్ టాక్స్ మినహాయింపు,  ఇలా అనేక అంశాలను పొందుపరిచారు. ఏడాదికి 12500 నాలుగేళ్ల పాటు రైతులకు నేరుగా సొమ్ములు అందించే విధంగా ఏర్పాటు చేశారు. ఆక్వా రైతులకు కరెంటు చార్జీలను యూనిట్ కు 1 .50 తగ్గించారు. అలాగే మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ పథకం ద్వారా రైతులకు ఎంతో మేలు చేకూరుస్తున్నారు.

 

జలయజ్ఞం

దివంగత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే జల యజ్ఞం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అమలు చేసి చుపించారో అదే విధంగా చిత్తశుద్ధితో జలయజ్ఞం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పోలవరం తో సహా ఏపీ లో ఉన్న అన్ని ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి రైతులకు మేలు చేసే విధంగా జగన్ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. అలాగే కృష్ణ, గోదావరి, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను సస్యశ్యామలం చేసేవిధంగా జగన్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రాజెక్టుల కు భారీగా నిధులు కేటాయించి చురుగ్గా పనులు చేయిస్తున్నారు.

 

మద్య నిషేధం

మూడు దశల్లో ఏపీలో మద్య నిషేధాన్ని అమలు చేసేందుకు నవరత్నాల్లో మద్యపాన నిషేధం కూడా చేర్చారు. ఇప్పటికే ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం దుకాణాలు నడుపుతున్నారు. అలాగే మద్యం ధరలు భారీగా పెంచి క్రమక్రమంగా తాగే వారి సంఖ్యను తగ్గించాలని జగన్ ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలుచేస్తోంది. తాగుబోతులు తమను తిట్టుకున్నా ఫర్వాలేదు అంటూనే ఈ పథకాన్ని చిత్తశుద్ధితో కఠినమైన నియమాలతో వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తోంది. ఇలా చెప్పుకుంటూ వెళితే ఇంకా అనేక పథకాలను నవరత్నాల్లో లేని ఎన్నో సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం తొమ్మిది నెలల కాలంలోనే అమలు చేసి ప్రజల్లో తమ చిత్తశుద్ధిని జగన్ నిరూపించుకున్నారు.  మాట తప్పను మడమ తిప్పను అనే నినాదాన్ని అమలు చేసి చూపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: