రాష్ట్రంలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థ‌ల‌తో పాటు,  ప‌లు ఐటీ కంపెనీలు, మాల్స్, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు నేటి నుంచి మూత‌ప‌డ్డాయి. కాగా హైద‌రాబాద్‌లోని మెట్రోకు కూడా క‌రోనా ఎఫెక్ట్ త‌గిలింది.  సాధారణంగా మెట్రోలో ప్రయాణికుల సంఖ్య ప్రతి రోజూ సుమారు 4.50 లక్షల వరకు ఉంటుంది. అయితే మైండ్‌స్పేస్‌లో కరోనా కలకలం నేపథ్యంలో మెట్రో రైలులో ప్రయాణికుల సంఖ్య తగ్గింది. రద్దీ అధికంగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో మెట్రో రైలును ఎక్కేందుకు జ‌నం ఆసక్తి చూపడంలేదు.

మెట్రో రైలు ఏసీది కావడంతో త్వరగా వైరస్ వ్యాప్తి చెందే  అవకాశముంద‌ని ప్ర‌యాణికులు జంకుతున్నారు. గతంతో పోల్చితే ప్రతి రోజూ పది వేల మందికి పైగా ప్రయాణికులు తగ్గారని మెట్రో అధికారులు పేర్కొంటున్నారు.  ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల బంద్‌ ప్రకటించి ఆంక్షలు విధించిన నేప‌థ్యంలో మరింతగా ప్రయాణికుల సంఖ్య  తగ్గే అవకాశాలున్నాయి. ఎంఎంటీఎస్‌, వివిధ మార్గాల్లో వెళ్ళే రైళ్లలో ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. రద్దీగా ఉండే పలు రైళ్లలోని జనరల్ బోగీలలో హడావిడి తగ్గింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: