ఏపీలో స్థానిక సమస్థల ఎన్నికల కోలాహలం జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఉరుముల్లేని పిడుగులా వాయిదా నిర్ణయం రావడం, దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతుండడం తదితర పరిణామాలన్నీ ఏపీలో చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా ఏపీలో అనేక రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు చోటుచేసుకున్నాయి. దాదాపు ఎన్నికల తంతు చివరి దశలో ఉండగా ఈసీ ఇటువంటి నిర్ణయం తీసుకుంటుంది అని ఎవరూ ముందుగా ఊహించలేకపోయారు. ఏదైతేనేమి ఎన్నికల వాయిదా పడడం, దీనిపై పెద్దఎత్తున రాద్ధాంతం జరగడం, ఏపీ ఎన్నికల కమిషనర్ తీరుపై వైసీపీ నాయకులంతా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ మండిపడడం, ఏపీ సీఎస్ నీలం సహానీ ఎన్నికల కంమిషన్ ను ఉద్దేశించి లేఖ రాయడం తదితర పరిణామాలన్నీ జరిగిపోయాయి. 


అసలు ఏపీలో ఎన్నికలు వాయిదా వేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఎక్కువగా ఉండడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే చాలా స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా తానే సీఎం గా చంద్రబాబు ఊహించుకుంటూ... వైసీపీ ప్రభుత్వాన్ని ట్రోల్ చేయడం జగన్ సహించలేకపోతున్నారు. తాను నిజాయితీగా ఏపీలో పరిపాలన చేద్దామనుకుంటే చంద్రబాబు అడ్డదారుల్లో వచ్చి తనకు అడ్డుపడుతున్నారని జగన్ ఆగ్రహంగా ఉన్నారు. తాను ఏపీ సీఎం గా అధికారంలో ఉన్నా చంద్రబాబు తనపై ఏపీ పైన పెత్తనం చేయడం ఏంటి అనేది జగన్ ప్రశ్న.


చంద్రబాబు సూచనలతోనే ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారని, జగన్ తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో పాటు వెంటనే మీడియా సమావేశం నిర్వహించి ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఆరోపణలు చేయడం వెనుక కారణాలు లేకపోలేదు. ఎందుకంటే 2016 లో చంద్రబాబు నాయుడే నిమ్మగడ్డ రమేష్ ను ఎన్నికల కమిషనర్ గా నియమించారు. అదీకాకుండా చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనపై సహజంగానే అనుమానాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఎన్నికలను వాయిదా వేయడానికి కారణంగా కరోనా వైరస్ ను సాకుగా చూపించడం ఇవన్నీ నిమ్మగడ్డపై అనుమానాలు పెంచుతున్నాయి.

 

ఎన్నికలు వాయిదా వేస్తూ నిమ్మగడ్డ రమేష్ నిర్ణయం తీసుకోవడం తప్పేమీ కాకపోయినా... కనీసం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించాల్సి ఉన్నా, ఆయన అలా చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతోనే ఈ స్థాయిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికలు తేదీ దగ్గరికి వస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆరు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేయడం అంటే ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఆ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించి ఉంటే ఏ విమర్శలు వచ్చేవి కాదు. కానీ అలా కాకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుమార్తె శరణ్య టిడిపి ప్రభుత్వ హయాంలో కీలక పదవి పొందారు. ఆర్థిక అభివృద్ధి మండలిలో అసోసియేట్ డైరెక్టర్ గా నియమించి నెలకు 2 లక్షలు జీతం చెల్లించారు. అయితే టీడీపీ అధికారం కోల్పోగానే శరణ్య తన పదవికి రాజీనామా చేశారు.

 

నిమ్మగడ్డకు చంద్రబాబు ఈ విధంగా సహాయ చేయడంతోనే ఇప్పుడు ఆయన చంద్రబాబు రుణం తీర్చుకున్నారు అంటూ వైసిపి విమర్శలు చేస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారంలో టిడిపి అధినేత చంద్రబాబు పాత్ర ఎక్కువగా ఉన్నట్టుగా అందరిలోనూ అనుమానాలు బలపడుతున్నాయి. కేవలం కరోనా వైరస్ అనేది సాకు మాత్రమే అనేది ఏపీ అధికార పార్టీ లోనూ, ప్రజలల్లోనూ బలంగా జరుగుతున్న చర్చ. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: