క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా  ప్రింట్ మీడియాకు గ‌డ్డు కాలం ఎదుర‌వుతోంది. మూలిగే న‌క్క‌పై తాటికాయ ప‌డ్డ‌ట్లు అస‌లే న‌ష్టాలకు ఎదురొడ్డి న‌డుపుతున్న ప‌త్రిక‌ల యాజ‌మాన్యాల‌కు ఇప్పుడు ఉరుములేని పిడుగులా క‌రోనా దెబ్బ త‌గ‌ల‌డంతో చాలా సంస్థ‌లు కుదేల‌వుతున్నాయి. ముక్కు మూలిగి కొన్ని..బ‌తిమాలి..బామాలి కొన్ని సంస్థ‌లు...యాడ్స్ తెచ్చుకుని న‌డుపుతున్న రోజులివి. అయితే దేశీయంగా ఏర్ప‌డిన ప‌రిస్థితుల్లో వార్త‌ల సేక‌ర‌ణ మొద‌లు రీడ‌ర్‌కు పేప‌ర్ అంద‌జేసేందుకు మ‌హాయ‌జ్ఞ‌మే చేయాల్సి వ‌స్తోంద‌ట‌. ఇత ప్ర‌యాస‌ప‌డినా ఇప్పుడు కొద్దిరోజుల పాటు పేప‌ర్ల‌ను బంద్ చేయాల‌ని కేంద్రం ఉత్త‌ర్వులు తీసుకొచ్చే యోచ‌న చేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

 

క‌రోనా వైర‌స్ పేప‌ర్‌పై దాదాపు 12గంట‌ల పాటు బ‌తికి ఉండే అవకాశం ఉన్న‌ట్లు నిపుణులు చెప్ప‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయింద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ప‌లు దేశాల్లో పేప‌ర్‌ను నిషేధించిన విష‌యాన్ని కూడా కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే మీడియా సంస్థ‌ల‌కు నోటీసులు అంద‌జేయ‌నున్న‌ట్లుగా కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే జ‌రిగితే ప్రింట్ కాస్ట్ రూపంలో కొంత పెట్టుబుడి త‌గ్గినా...ఎల‌క్ట్రానిక్ అండ్ వెబ్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండి మ‌ళ్లీ రీడ‌ర్ గాడి త‌ప్పుతాడో అన్న భ‌యం యాజ‌మాన్యాలను వెంటాడుతున్న‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి ఇప్ప‌టికే చాలా పేరెన్నిక‌గ‌న్న దిన‌ప‌త్రిక‌లు ఏటా గ‌ణ‌నీయంగా త‌గ్గుతూ వ‌స్తోంది. 

 

వెబ్ జ‌ర్న‌లిజం ఉధృత‌మ‌వ‌డం, రీడ‌ర్లు  సోష‌ల్ మీడియాకు ఎడిక్ట‌వ‌డంతో దిన‌ప‌త్రిక‌లు చ‌దివే ఓపిక‌, తీరిక లేద‌న్న‌ది వాస్త‌వ‌మ‌ని సుదీర్ఘ‌కాలంగా ప్రింట్ మీడియాలో ప‌నిచేస్తున్న ఎడిట‌ర్లే ప‌లు సంద‌ర్భాల్లో వేదిక‌ల‌పైన వ్యాఖ్య‌నించారు. ఇప్పుడు క‌రోనాతో ప్రింట్ మీడియాకు ష‌ట్‌డౌన్ ఆదేశాలు వ‌స్తే చాలాకాలం పాటు అమ‌ల్లో ఉండే అవ‌కాశం ఉంటుంది. ప‌నిచేయ‌కున్నా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. చిన్నాచిత‌కా సంస్థ‌ల‌కైతే ఇది పెనుభార‌మే అని చెప్పాలి. కేంద్రం ఆదేశాలు మాత్రం అమ‌ల్లోకి వ‌స్తే ష‌ట్‌డౌన్ త‌ర్వాత కొన్ని సంస్థ‌లు తెరుచుకోక‌పోయినా ఆశ్చ‌ర్య‌మేమీ లేద‌ని తెలుగు జ‌ర్న‌లిజంలో కొన‌సాగుతున్న డెస్క్ జ‌ర్న‌లిస్టులు వ్యాఖ్య‌నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: