కాలం కాని కాలంలో, దేశం, కాని దేశం నుండి కంటికి కనిపించని కణజాలాన్ని విస్తరించుకొంటూ, కరోనా మహమ్మారిగా తిరుగుతున్నావ్, మానవుల ప్రాణాలను తీసేస్తున్నావ్ ,మారణాయుధాలకు గాని, మానవ బాంబులకిగాని, అణు యుద్ధాలకి గాని, బెదరని మనిషిని బెదిరేలా చేసావ్! అదిరిపోయేలా చేసావ్ ! కంటికి కనిపించని నీతో చీకటి యుద్ధం చేస్తున్నాడు. నిరంతరం నీవునికికై వెతుకుతున్నాడు, కాని నీవు మరణ మృదంగం వాయించుకుంటూ ఖండాంతరాలు చక్కర్లు కొడుతూ నీ కొరడా ఝుళిపిస్తున్నావ్ ! నీ దెబ్బకి మానవ సంభందాలు తెగిపోయాయ్, మనిషి, మనిషిని అనుమానిస్తున్నాడు. ప్రపంచం సరిహద్దుల్ని మూసేసుకుంటుంది, స్వేచ్చని, స్వచ్చందంగా వదులుకుంటున్నారు, హక్కుల మాటే మర్చిపోయారు, విధుల్ని మాత్రం పాటిస్తున్నారు, వీధులు దాటి రావటం లేదు, నలుగురు కూర్చుని మాట్లాడే ముచ్చట లేదు. ఆస్ట్రేలియా కంగారు పొట్టలో సంచిలో మాదిరి వుంది చిన్నపిల్లల పరిస్థితి. 


ఎటుకదిలినా..ఆజ్ఞలు, హుకుంలు, హెచ్చరికలు, లాఠి దెబ్బలు, అరుపులు, కేకలు, ఆర్తనాదాలు, అరెస్టులు, కేసులు. ఎమర్జెన్సీ అంటే తెలియని తరం మాది. కాని ఎమర్జెన్సీ రుచి చూస్తున్నాం. పోలీసులు కొడుతున్నా, తిడుతున్నా, మా మంచికే అని సరి పెట్టుకుపోతున్నాం. కాని తప్పదు, మనుగడకై పోరాటం, ఒక రోజు కూలికి పోతే గాని, కూడు తినలేని వాళ్లం, రెక్కాడితే గాని మా బ్రతుకులకి డొక్కాడదు, ఒకరోజు పనిచేసి తెచ్చుకున్న కూలి ఒకరోజుకే సరిపెట్టుకునే మేము, తర్వాత రోజుకి ఎలా సరి పెట్టుకోగలం, అదనుచూసి శవాలమీద చిల్లర ఏరుకునే మాదిరి, అన్ని సరుకులు, అమాంతం పెంచేసారు. 

IHG

 

పనులు లేవు. పస్తులు మొదలయ్యాయి. రూపాయి అప్పు పుట్టే మార్గంలేదు. ఎక్కడ చూసినా ఆంక్షలు. నెల మారుతుంది, కరంటు బిల్లు, గ్యాస్ బండ నిండుకుంది. సరుకులు అయిపోయాయి. కిరాణా కొట్లో పాతబకాయి తీర్చాలి. పాలవాడు ఊరుకోడు. ఎక్కడ చూసినా అరువు లేదు అని కనిపించే బోర్డులే. బయటికి వెళ్లే మార్గం లేదు. మాది పేద దేశం, పత్రికా ప్రకటనలు తప్ప! మాటల మరాఠీలు తప్ప ,చేతలు శూన్యం. మనిషికిచ్చే ఐదు కేజీల బియ్యంతో నెల ఎలా గడపాలి ?, కేజీ కందిపప్పుని ఎన్ని రోజులు తినాలి ? పనిచేసే ఓనరికి ఫోన్ చేస్తే స్విచాఫ్. ఓ కరోనా! ఎంత పని చేసావ్? కరువు కాలంలో వచ్చి మా జీవితాలు కడగండ్ల పాలు చేసావ్ ? తల్లి.  వదిలేయ్ మాదేహాన్ని, మాదేశాన్న.

 

 


 నిన్న మొన్నటి దాకా విభూదితో ,తాయత్తుతో అన్ని రోగాలు మాయం చేసేస్తామన్న మాయగాళ్లు మాయమైపోయారు. ఇంట్లోనే వుంటే చాలు ఒక్కఫోన్ కాల్ తో హీలింగ్ ద్వారా ఏరోగాన్నయినా ఇట్టే తగ్గించేస్తామన్నసన్నాసుల స్టేట్మెంట్లులేవు, స్వాంతన చేకూర్చే స్వామీజీలు , బాబాలు, పీఠాదిపతులు, మతాధిపతులు, పాస్టర్ లు, పకీర్లు, ఉలేమాలు, కనిపించటంలేదు. ఇలా మీ ఇల్లు కడితే ఏరోగాలు మీ దరి చేరవు అన్న వాస్తు విశారదులు ఏమయ్యారో తెలియటంలేదు ! రంగురాళ్ల ఉంగరాలు ధరించండి రోగాలు ధూరం, అని చెప్పిన జాతక, జ్యోతిష్య విద్వాంసులు ఎక్కడున్నారో జాడలేదు. 

 


రోగాల అంతు చూసే గ్రామ దేవతలు ఏమయ్యారో తెలియటం లేదు. నిజాలు నమ్మని కర్మ భూమిలో పుట్టాం మూఢత్వాన్ని మతం పేరుతో రుద్దే దరిద్రం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటాం. కాని కరోనా మనిషి తెల్సుకోవాల్సింది చాలా వుందని నిరూపించావ్, భయపెట్టావ్ ! భాదపెట్టావ్ ! వణికించావ్ !సమాజ సంభందాలు తెంచావ్ ! కుటుంబ సంబంధాలు పెంచావ్ !

మరింత సమాచారం తెలుసుకోండి: