అంద‌రిదీ ఒక దారి ఉలిపిక‌ట్టెది మ‌రోదారి అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించే తెలుగు మీడియా కూడా ఇప్పుడు అంద‌రి దారిలోనే అంద‌రికన్నా ముందుగానే ప్ర‌యాణం ప్రారంభించింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో క‌రోనా నేప‌థ్యంలో అమ‌ల‌వుతున్న లాక్ డౌన్ కార‌ణంగా.. అనేక రంగాల్లో ప‌నులు నిలిచిపోయాయి. దీంతో ఇప్ప‌టికిప్పుడు కాక‌పోయినా.. లాక్‌డౌన్ ఎత్తేసిన త‌ర్వాతైనా ఆయా ప‌రిశ్ర‌మ‌లు, కంపెనీలు తెరుచుకున్నాక‌యినా.. ఆర్ధిక ప‌రిస్థితి పుంజుకునే అవ‌కాశం లేద‌ని భావిస్తున్న నేప‌థ్యంలో ల‌క్ష‌ల సంఖ్య‌లో కార్మికులు , ఉద్యోగులు రోడ్డున ప‌డ‌తార‌ని అంటున్నారు. 

 

నిజ‌మే లాక్‌డౌన్ కార‌ణంగా ఉత్ప‌త్తులు నిలిచిపోయి న నేప‌థ్యంలో ఆర్థిక ప‌రిస్థితి పుంజుకునే అవ‌కాశం లేనందున ఈ ప‌రిస్థితి ఉత్ప‌న్న‌మైంద‌ని అనుకోవ‌చ్చు. ఇక‌, మిగిలిన ప‌రిశ్ర‌మ‌లు, కంపెనీల ప‌రిస్థితి లాక్‌డౌన్ త‌ర్వాత దివాలా తీసే ప‌రిస్థితి ఉంటే.. తెలుగు మీడియాలో ఇప్పుడే ఈ త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తెలుగు మీడియాలో కీల‌క‌మైన ప్రింట్ మీడియాలో ఇప్ప‌టికే మూడు ప్ర‌ధాన ప‌త్రిక‌లు ఉద్యోగుల‌ను ఇంటికి పంపించే ప‌నిని యుద్ధ ప్రాతిప‌దిక‌న చేప‌ట్టాయ‌ని అంటున్నారు. వీటిలో త‌న మ‌న అనే తేడా లేకుండా అన్ని ప‌త్రిక‌లూ ఉన్నాయ‌ని చెబుతున్నారు. 

 

ఆంధ్ర‌ప్ర‌భ, భూమి, సూర్య ప‌త్రిక‌లు ఇప్ప‌టికే ప్రింట్‌ను నిలిపివే శాయి. అంటే అవి పూర్తిగా మూత‌బ‌డ్డాయ‌నే చెప్పాలి. లాక్‌డౌన్ ఎత్తేసిన త‌ర్వాత ప‌రిస్థితులు చూసుకుని తిరిగి పునః ప్రారంభించే అవ‌కాశం ఉంద‌ని ఈ ప‌త్రిక‌లు చెబుతున్నాయి. ఇక‌, తెలుగు మీడియాలో కీల‌కంగా ఉన్న తొలి మూడు స్థానాల్లో ఉన్న ఈనాడు, సాక్షి, ఆంధ్ర‌జ్యోతిల్లోనూ కాస్ట్ క‌టింగ్ పేరుతో అప్పుడే ఉద్వాస‌న‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. ఈ మూడు ప‌త్రిక‌లు కూడా లాక్‌డౌన్‌కు ముందు నిత్యం మెయిన్ ఎడిష‌న్‌ను 12 నుంచి 14 పేజీలు, జిల్లా టాబ్లాయిడ్ 20 నుంచి 24 పేజీల‌తో ఇచ్చేవి. అయితే, లాక్‌డౌన్‌తొ కొన్ని రోజులు జిల్లా ఎడిష‌న్‌ను కంటిన్యూ చేసినా.. న్యూస్ ప్రింట్‌(పేప‌ర్) ల‌భించ‌క‌పోవ‌డంతో జిల్లా పేజీల‌ను ఎత్తేశారు. వాటినే భారీగా కుదించి మెయిన్ ఎడిష‌న్ లో పుల్ అవుట్ కింద ఇస్తున్నారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న జోన్లు కూడా త‌గ్గిపోయాయి. 

 

ఇక‌, ఈ క్ర‌మంలో ఎడ్వ‌ర్‌ట యిజ్ మెంట్లు కూడా లేక పోవ‌డంతో ఈ విభాగం సిబ్బందిని ఆంధ్ర‌జ్యోతి ఇప్ప‌టికే ఇంటికి పంపేసింది. ఇక‌, జిల్లా పేజీల‌ను కుదించ‌డంతో.. ఆయా ఎడిష‌న్ల‌లో ప‌నిచేస్తున్న జిల్లా స‌బ్ ఎడిట‌ర్ల‌ను కూడా ఇంటికే ప‌రిమితం కావాల‌ని తాజాగా ఫోన్లు వెళ్లాయి. దీంతో మొత్తంగా సిబ్బందిని 50శాతం త‌గ్గించే ప‌నిని ప‌త్రిక‌లు చేప‌ట్టాయి. నేడు జ్యోతి, రేపు సాక్షి, ఈనాడు ఇదే పంథాను అనుస‌రించ‌నున్నాయ‌ని అంటున్నారు. మ‌రి ఇలా తీసేసిన వారు ఎలా త‌మ కుటుంబాల‌ను గ‌డుపుకొంటారు ? అనే ప్ర‌శ్న‌కు మాత్రం మీడియా అధినేత‌లు, నీతులు చెప్పేవారు మాత్రం నోరు మెద‌ప‌క‌పోవ‌డం గ‌మనార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: