దేశానికి కరోనా కష్టకాలం వచ్చింది. ఇది అంతా కలసిపోరాడాల్సిన సమయం. రాజకీయాలు, ఇతర అంశాలన్నీ పక్కకు పెట్టాల్సిన సమయం. అందుకే దేశ ప్రధాని మోడీ కరోనా కట్టడి వ్యూహాలపై అన్ని పార్టీల నేతలతోనూ మాట్లాడుతున్నారు. అన్ని వర్గాల వారితోనూ వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. నాయకులు, క్రీడాకారులు, పత్రికా విలేఖరులు, పత్రికాధిపతులు.. ఇలా అన్ని వర్గాల వారితో మేథోమథనం జరుపుతున్నారు.

 

 

ఏపీ విషయానికి వచ్చేసరికి.. సీఎం జగన్ పని చేసుకుంటూ పోవడమే తప్ప.. ఇలాంటి కలుపుకుపోయే చర్యలు చేయడం లేదన్న విమర్శ విపక్షాల నుంచి వస్తోంది. జగన్ కూడా కరోనా ఏపీలో కేసులు పెరగకానే... అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉంటే బావుండేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇలాంటి సమయంలో అఖిల పక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం సంప్రదాయం కోసం మాత్రమే.

 

 

మేం అందరి అభిప్రాయాలు విన్నామని ప్రజల్లోకి సంకేతాలు పంపేందుకు మాత్రమే. నిర్ణయం ఎప్పుడూ ప్రధాన మంత్రి లేదా ముఖ్యమంత్రి చేతిలోనే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఇదో సంప్రదాయం. వాస్తవానికి అఖిలపక్ష సమావేశం అంటూ ఏర్పాటు చేసి ఉంటే అది వైసీపీకి రాజకీయంగానూ లాభించి ఉండేది. ఎలాగంటే.. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి పార్టీల అధ్యక్షులకు ఆహ్వానాలు పంపి ఉండాల్సింది.

 

 

అఖిల పక్షం అంటే అధికార పార్టీ అధ్యక్షతన జరుగుతుంది. ఎలాగూ జగన్ అధ్యక్షతన జరుగుతుంది. దానికి విపక్ష నేత హోదాలో చంద్రబాబు వచ్చే అవకాశం ఉండేది కాదు. తన కంటే చిన్నవాడైన జగన్ సీఎంగా ఉండగా.. విపక్ష నేతగా ఆ సమావేశానికి చంద్రబాబు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఏ యనమలనో.. అచ్చెన్నాయుడునో పంపించి ఉండేవారు. అప్పుడు ఎలాగూ వైసీపీ.. మేం పిలిచినా చంద్రబాబు రాలేదని ప్రచారం చేసుకునే అవకాశం ఉండేది. నిజంగా జగన్ ఆ పని చేసి ఉంటే చంద్రబాబు బుక్కయ్యేవాడే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: