ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి పెద్దగా ఆలోచించలేదనే చెప్పాలి. అయితే స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉన్నపుడు కరోనా వైరస్ సాకుతో ఎన్నికల ప్రక్రియను అర్ధాంతరంగా వాయిదా వేస్తున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించటంతోనే సమస్య మొదలైంది. ఎన్నికల వాయిదా లాంటి కీలకమైన నిర్ణయాన్ని ప్రభుత్వంతో మాట్లాడకుండా నిమ్మగడ్డ తీసుకునేందుకు లేదు. కానీ నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని ఏ దశలోను విశ్వాసంలోకి తీసుకోలేదు. దాంతో జగన్-నిమ్మగడ్డ మధ్య వివాదం మొదలైంది. 

 

ఎన్నికల వాయిదా తీసుకోవాలన్న నిర్ణయం ప్రకటనకు ముందు టిడిపి, బిజెపి, సిపిఐ అధినేతల నుండి  వచ్చిన సంకేతాల కారణంగానే నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం మండిపోతోంది. రాజ్యాంగబద్దమైన స్ధానంలో ఉన్న వ్యక్తి కులం ఆధారంగా చంద్రబాబు చెప్పినట్లు నడుచుకున్నాడంటూ స్వయంగా జగన్ అండ్ కో తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. నిజానికి ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిన తర్వాత నిమ్మగడ్డ రాజీనామా చేస్తారనే అందరు అనుకున్నారు. కానీ ఆయన కంటిన్యు అయ్యారు. సరే తర్వాత ప్రభుత్వం సుప్రింకోర్టుకు వెళ్ళటం అక్కడ నిమ్మగడ్డ నిర్ణయాన్ని తప్పు పట్టడం అందరికీ తెలిసిందే.

 

నిమ్మగడ్డ నిర్ణయం వెనుక రాజకీయ ఉద్దేశ్యాలు ఉన్నట్లు తెలుస్తున్నా ఎన్నికల వాయిదా వేయాలన్న నిర్ణయం తీసేసుకున్నారు కాబట్టి ఇపుడు ఆ విషయంతో జోక్యం చేసుకోవటం లేదని స్పష్టంగా చెప్పింది. ఇక ముందు తీసుకోబోయే నిర్ణయాలను ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత మాత్రమే తీసుకోవాలని ఆదేశించింది. సరే ఆ తర్వాత ఎన్నికలు తేదీ నిర్ణయం అయ్యే వరకు ఎన్నికల కోడ్ ఎత్తేయాలన్న సుప్రింకోర్టు ఆదేశాలతో కోడ్ ఎత్తేస్తున్నట్లు కమీషన్ ప్రకటించింది.

 

ఇదే సమయంలో లాక్ డౌన్ కారణంగా పేదలకు పంపిణి చేస్తున్న వెయ్యిరూపాయలపై చంద్రబాబు, కన్నా, రామకృష్ణ ఫిర్యాదు చేయగానే నిమ్మగడ్డ వెంటనే కలెక్టర్లను విచారణ జరపాలంటూ ఆదేశించాడు. నిజానికి ఎన్నికల కోడ్ అమల్లో లేకపోయినా ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయటం, నిమ్మగడ్డ రెస్పాండ్ అవ్వటం చాలా విచిత్రంగా ఉంది.  నిమ్మగడ్డ వ్యవహార శైలి చూస్తే ఆయన చంద్రబాబు అండ్ కో ఆడమన్నట్లు ఆడుతున్నాడనే భావన ఎవరికైనా కలుగుతుంది. రాజ్యాంగబద్దమైన స్ధానంలో ఉన్న వ్యక్తి నిష్పక్షపాతంగా ఉండాలన్న విషయాన్ని నిమ్మగడ్డ మరచిపోయాడు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా   ప్రతిపక్షాలు చెప్పినట్లు వింటున్న వ్యక్తిని రాజ్యాంగబద్దమైన స్దానం నుండి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే అందులో తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: