ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ ను తొలగించేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనేది రాజ్యంగబద్దమైన పదవి.. దాన్నుంచి తొలగించడం అంత సులభం కాదు. దానికి పార్లమెంటు అభిశంసన వరకూ వెళ్లాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అస్సలు సాధ్యం కాదు.. కానీ మరి ఎలా.. జగన్‌ కేమో నిమ్మగడ్డపై పీకల దాకా కోపం ఉంది.

 

 

అందులోనూ సదరు నిమ్మగడ్డ.. ఆంధ్రప్రదేశ్ లో అరాచకం జరుగుతోంది బాబోయ్ అంటూ కేంద్రానికే లేఖ రాసేశాడు.. నా ప్రాణాలకే ముప్పుంది.. స్థానిక ఎన్నికల్లో గెలవకపోతే.. ఏకంగా మంత్రులను పీకేస్తానని ముఖ్యమంత్రే ఇక్కడ బెదిరిస్తున్నాడంటూ ఏకంగా కేంద్రానికే లేఖ రాసేశాడు.. ఏపీ ప్రభుత్వాన్ని ఎంత అప్రదిష్టపాలు చేయాలో అంతా చేసేశాడు. అంతేనా అబ్బే ఆ లేఖ నాది కాదు అంటూ ఓ వార్తా సంస్థకు చెప్పాడు. కానీ లేఖ అందిందని కేంద్రమంత్రే అంగీకరించాడు.

 

 

ఇక పరిస్థితి ఇంత వరకూ వచ్చాక ఎలాగైనా నిమ్మగడ్డకు షాక్ ఇవ్వాల్సిందేనని జగన్ డిసైడ్ అయ్యాడు. కానీ ఎలా.. అదేమో రాజ్యాంగబద్ధ పదవి. కానీ..ఎక్కడో ఒక దగ్గర మన చట్టాల్లో లొసుగులు ఉండకపోతాయా అని అన్వేషణ ప్రారంభమైంది. మాజీ ఐఏఎస్ రమాకాంత్‌ రెడ్డి వంటి పెద్దలు జగన్ ను కలిశారు. మొత్తానికి ఓ లూప్ హోల్ దొరికింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక అర్హతలు, పదవీ కాలం వంటి వాటిని సవరించే హక్కు రాష్ట్రానికి ఉంటుందని తేలింది.

 

 

అంతే అదే అదనుగా ఉత్తర్వులు రెడీ అయ్యాయి. అంతా బాగానే ఉంది. కానీ రాజ్యాంగంలో మరో చిక్కు కూడా ఉంది. ఇలాంటి మార్పులు చేసుకునే హక్కు రాష్ట్రానికి ఉన్నా.. ఇప్పటికే ఆ పదవిలో ఉన్న వ్యక్తికి నష్టం కలిగించేలా ఉంటే ఈ కొత్త ఉత్తర్వులు వర్తించవు. ఉదాహరణకు ఇలా పదవీ కాలం తగ్గించడం వంటివి. కానీ పదవీకాలం పొడిగింపు వంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. అయినా సరే..అదంతా కోర్టులకు వెళ్లినప్పుడు తీర్పులు వచ్చినప్పుడు కదా అన్న భావంతో జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: