ప్రపంచ మానవాళిని కబళించేందుకు పుట్టుకొచ్చిన కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ పోరాడుతున్నాయి. అసలు ఎందుకు పుట్టిందో అనేది ఇంకా క్లారిటీ లేదు. అలాగే ఈ వైరస్ ని అంతమొందించే మందు ఏది ఇంకా అందుబాటులోకి రాకపోవడం, అదే సమయంలో రోజు రోజుకి ఈ వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో పెరిగిపోతుండటం కాస్త ఆందోళన కలిగినా అంశమే. ఇక మనదేశం విషయానికి వస్తే...! ఈ కరోనని ఎదుర్కొనేందుకు సమర్ధవంతంగానే పోరాడడంతో పాటు ఈ వైరస్ వ్యాప్తి మరింత పెరగకుండా కేంద్రం కఠినమైన నిబంధనలతో 21 రోజులుగా లాక్ డౌన్ ని విడించించారు. అయినా ఈ వైరస్ వ్యాప్తి అదుపులోకి రాకపోవడంతో వచ్చే నెల అంటే మే 03 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగించే అంశంగానే కనిపిస్తోంది. 

 


అసలు మన దేశంలో ఫిబ్రవరి 1న కరోనా తొలి కేసు నమోదైంది. దీంతో కేంద్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఇంత తీవ్ర స్థాయిలో విజృంభిస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేకపోవరు. ఇక అప్పటి నుంచి ఈ వైరస్ మహమ్మారి ప్రభావం రోజు రోజుకి పెరుగుతూ పెరుగుతూనే వస్తోంది. ఇప్పుడు అత్యధికంగా మహారాష్ట్రలో ఈ వైరస్ ప్రభావం పెరిగిపోతుండటం, దేశంలోనే అత్యధిక మరణాలు ఈ రాష్ట్రం నుంచే నమోదవ్వడం అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర ముందంజలో ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో రోజుకు 200 వరకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో రోజుకు 30 నుంచి 40 మరణాలు సంభవిస్తుంటే,  మహారాష్ట్రలో 10 నుంచి 20 వరకు సంభవిస్తున్నాయి. 

 


మహారాష్ట్రలోని ఒక్క ముంబైలోనే 1146 కేసులు ఉన్నాయి. 76 మరణాలు అక్కడే ఉన్నాయి. మహారాష్ట్రలో కరోనా వల్ల 21 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల లోపు వాళ్లు ఎక్కువగా చనిపోతున్నారు. కరోనా కేసుల్లో పురుషులు 61 శాతంగా ఉండగా, స్త్రీలు 39 శాతంగా ఉన్నారు. కరోనా మరణాల్లో పురుషులు 69 శాతంగా ఉండగా, స్త్రీలు 41 శాతంగా ఉన్నారు. మహారాష్ట్రలో 35668 మందికి టెస్టులు చెయ్యగా, వారిలో 4 శాతం మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. మహారాష్ట్రలో 85 శాతం కేసుల్లో ముందుగా లక్షణాలు కనిపించట్లేదు. కొన్ని రోజుల తరవాత లక్షణాలు బయటపడుతున్నాయి.


బాంద్రా స్టేషన్ వద్ద కూలీల ఆందోళన : 


లాక్ డౌన్ ని మే 03 వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకోవడంతో ముంబైలోని బాంద్రా స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. వేల సంఖ్యలో వలస కూలీలు స్టేషన్‌ దగ్గరకు చేరుకొని ఆందోళన  చేపట్టారు. సొంతూళ్లకు వెళ్లేందుకు అవకాశం లేక ఇప్పటి వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఎప్పుడెప్పుడు లాక్ డౌన్ నిబంధన ఎత్తివేస్తారా ..? తమ సొంత ప్రాంతాలకు వెళదామా అన్నట్టుగా వీరంతా ఇప్పటివరకు వేచి చూస్తూ గడుపుతున్నారు. కానీ ఒక్కసారిగా ప్రధాని ప్రకటన వీరిలో అసహనాన్ని రగిల్చింది. దీంతో వలస కూలీలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. దీంతో వలస కూలీలు, కార్మికులను పోలీసులు లాఠీలతో చెదరగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేల సంఖ్యలో స్టేషన్‌ దగ్గర గుమిగూడిన కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని డిమాండ్‌ చేపట్టారు. భారీ సంఖ్యలో రోడ్డుపైకి చేరుకొని మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను వెంటనే స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేశారు. 

 

ఐతే ఈ ఘటనపై కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు ఫోన్ చేసి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనల వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముంబైలో ఇప్పటి వరకు 1,753 కరోనా పాజిటివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో  111 మంది మరణించారు. గత 24 గంటల్లో ముంబైలో 204 కేసులు నమోదవగా 11 మంది చనిపోయారు. నిత్యం వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవడంతో తమకు ఎక్కడ ఆ వైరస్ ప్రభావం ఉంటుందో అన్న ఆందోళన అక్కడి వలస కొలీల్లో ఎక్కువగా కనిపించడంతోనే ఇంతగా ఆందోళన చెందుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: