అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశాడు. ప్రపంచ ఆరోగ్య సంస్ధకు నిధులను నిలిపేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనాతో కలిసి ప్రపంచ ఆరోగ్య సంస్ధ అమెరికాను మోసం చేసిందంటూ అధ్యక్షుడు మండిపోతున్నాడు. తమ దగ్గర నిధులు తీసుకుంటు తమ దేశాన్నే దెబ్బ కొడతారా అంటూ ట్రంప్ ఊగిపోయాడు. ట్రంప్ ప్రకటన రావటమే తరువాయి డబ్ల్యూహెచ్ఓ వణికిపోతోంది ఇపుడు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ సోకిన విషయాన్ని చైనా వెంటనే అమెరికాకు తెలియజేయలేదన్నది ట్రంప్ ఆరోపణ. పోనీ విషయం బయటపడిన తర్వాత చైనా విషయంలో తాము ట్రావెల్ బ్యాన్ పెడతానని చెబితే ప్రపంచ ఆరోగ్య సంస్ధ అడ్డుకున్నట్లు ఆరోపించాడు. ట్రావెల్ బ్యాన్ పెట్టేంత అత్యవసరం ఏమీ లేదని డబ్ల్యూహెచ్ఓ వాదించిందన్నది ట్రంప్ ప్రధాన ఆరోపణ. డబ్ల్యూహెచ్ఓ వాదనను నమ్మే తాను ట్రావెట్ బ్యాన్ పెట్టలేదని ట్రంప్ చెప్పాడు. ఎప్పుడైతే ట్రావెల్ బ్యాన్ పెట్టలేదో చైనా నుండి పర్యాటకులు అమెరికాలోకి ప్రవేశించారట. దాంతో అమెరికాలో కూడా వైరస్ పెరిగిపోయిందంటున్నాడు. ఇందుకు డబ్ల్యూహెచ్ఓనే కారణమని కూడా ట్రంప్ ఆరోపిస్తున్నాడు.

 

పైగా తన వాదనకు విరుద్ధంగా డబ్ల్యూహెచ్ఓ చైనాకే మద్దతు తెలపటం ఏమిటంటూ ఇపుడు అగ్గిమీద గుగ్గిలమైపోతున్నాడు. డబ్ల్యూహెచ్ఓ నడవటానికి ప్రపంచ దేశాలు నిధులిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తం నిధుల్లో అమెరికానే దాదాపు 15 శాతం భరిస్తోంది. అంటే సుమారు 500 మిలియన్  డాలర్లను అమెరికానే అందిస్తోంది. అదే సమయంలో చైనా అందిస్తున్నది కేవలం 40 మిలియన్ డాలర్లు మాత్రమే.

 

డబ్ల్యూహెచ్ఓ నడవటంలో ఎంతో కీలకంగా వ్యవహిస్తున్న అమెరికా ప్రయోజనాలను కాదని చైనాకు మద్దతుగా నిలుస్తోందంటూ ట్రంప్ ఇపుడు మండిపోతున్నాడు. అందుకనే  డబ్ల్యూహెచ్ఓ నిర్వహణ వ్యయాన్ని నిలిపేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. ట్రంప్ ప్రకటనతో ప్రపంచదేశాలతో పాటు డబ్ల్యూహెచ్ఓ కూడా గందరగోళంలో పడిపోయింది. ప్రపంచం మొత్తం కోరానా వైరస్ తో ఇబ్బందులు పడుతున్న సమయంలో ట్రంప్ నిధుల నిలిపివేత లాంటి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదని తీరిగ్గా డబ్ల్యూహెచ్ఓ సన్నాయి నొక్కులు నొక్కుతోంది.

 

నిధులను నిలిపేయాలంటూ ట్రంప్ జారీ చేసిన తాజా ఆదేశాలపై ప్రపంచ దేశాలు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే. ఎందుకంటే చైనాలో పుట్టిన కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం కుదేలైపోతోంది. వైరస్ విషయంలో ముందుగా తమను చైనా ముందుగా హెచ్చరించలేదన్నది చాలా దేశాలు వాదన. చైనా నిర్లక్ష్యమని, కుట్ర ఉందనే ప్రచారాలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ నేపధ్యంలోనే మిగిలిన దేశాలు కూడా అమెరికానే అనుసరిస్తే డబ్ల్యూహెచ్ఓ ఉనికే ప్రశ్నార్ధకమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: