ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఆయన్ను పదవి నుంచి తొలగించినా జగన్ సర్కారు అంతటితో ఆయన్ను వదిలేలా కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రతినిధిలా వ్యవహరించారని భావిస్తున్న వైసీపీ ఇప్పుడు ఆయన లేఖను టీడీపీ నేతలు ఫోర్జరీ చేశారంటూ డీజీపీకి ఫిర్యాదు చేయడం ద్వారా అటు నిమ్మగడ్డ గుండెల్లోనూ.. ఇటు టీడీపీ గుండెల్లోనూ వణుకుపుట్టిస్తున్నారు.

 

 

ఈ మొత్తం వ్యవహారంలో నిమ్మగడ్డ వ్యవహారశైలి అనుమానాస్పదంగా కనిపిస్తోంది. ఆయన జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు పెరుగుతున్నాయి. అవేమిటో చూద్దాం..

 

మొదటి ప్రశ్న: ఏపీలో అప్పటికే మొదలైన ఎన్నికల ప్రక్రియను ఆపుతున్నప్పుడు కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు కనీస మాత్రంగా సంప్రదించలేదు. కనీసం తన కార్యాలయంలోని సిబ్బందికి కూడా తెలియకుండా ఎందుకు గోప్యత పాటించారు..?

 

రెండో ప్రశ్న: జగన్ ప్రెస్ మీట్ తర్వాత.. ఆంధ్రప్రదేశ్ లో అరాచకాలు జరుగుతున్నాయని.. తనకు ప్రాణహాని ఉందని.. స్వయంగా ముఖ్యమంత్రే అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని కేంద్రానికి ఆయన పేరుతో లేఖ వెళితే.. అది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయితే కనీసం ప్రెస్ నోట్ కూడా ఎందుకు ఇవ్వలేదు.. అది అవునో కాదో కూడా ఎందుకు చెప్పలేదు..?

 

మూడో ప్రశ్న: కేంద్రానికి తన పేరు మీద లేఖ వెళ్లిందని.. తెలుగుదేశం అనుకూల పత్రికలు పేజీలకు పేజీలు ఆ లేఖను హైలెట్ చేస్తూ ప్రచురిస్తే.. కనీసం ఎందుకు స్పందించలేదు.. లేఖ తనదో కాదో ఎందుకు చెప్పలేదు. పైగా.. ఏఎన్‌ఐ వంటి వార్తా సంస్థకు ఆ లేఖతో తనకు సంబంధం లేదని ఎందుకు చెప్పారు..? ఆయన అబద్దం చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది..?

 

నాలుగో ప్రశ్న: మరి ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న నిమ్మగడ్డ.. చివరకు తనను తొలగించినా కనీసం ప్రెస్ నోట్ కూడా విడుదల చేయని నిమ్మగడ్డ.. హైకోర్టు మెట్లెక్కినా సరే.. కనీసం ప్రెస్ మీట్ కూడా నిర్వహించని నిమ్మగడ్డ.. హఠాత్తుగా ఈరోజు ప్రెస్ నోటు విడుదల చేసి ఆ లేఖ తాను రాసిందే అని వివరణ ఎందుకు ఇస్తున్నట్టు.. ? టీడీపీ నేతలను కాపాడేందుకే అన్న విమర్శలకు ఏం సమాధానం చెబుతారు..?

 

ఐదో ప్రశ్న: ఇప్పుడు ఆ లేఖ తాను రాసిందే అని చెబుతున్న నిమ్మగడ్డ ఆ లేఖలోని విషయాలను అంగీకరిస్తున్నట్టే కదా.. మరి ఓ ఎన్నికల కమిషనర్ లా కాకుండా.. ఓ ఫక్తు రాజకీయ నాయకుడిలా ఆ లేఖ ఎందుకు రాసినట్టు.. ఆ భాష, పదజాలం ఎందుకు టీడీపీ పదజాలంగా కనిపిస్తున్నట్టు.. ?

 

ఆ ఐదు ప్రశ్నలకు నిమ్మగడ్డ సరైన సమాధానం చెబితే రాష్ట్ర ప్రజలకు ఆయన నిజాయితీపై నమ్మకం కలుగుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: