రాష్ట్ర రాజ‌కీయాల్లో అనూహ్యంగా తెర‌మీదికి వ‌చ్చిన వారు ఇద్ద‌రే ఇద్ద‌రు! వారిలో తొలి నాయ‌కుడు నంద‌మూరి తార‌క రామారావు.  రాష్ట్రంలో తెలుగు వారికి జ‌రుగుతున్న ఢిల్లీ అవ‌మానాల‌ను భ‌రించ‌లేక‌, తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీలో చాటాల‌నే ఏకైక ల‌క్ష్యంతో ఆయ‌న రాజ‌కీయ అరంగేట్రం చేశారు. ఇక‌, రెండో వారు.. వైఎస్ విజ‌య‌మ్మ‌. అప్ప‌టి వ‌ర‌కు గుట్టుగా ఇంటికే ప‌రిమిత‌మై.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌తీమణిగానే ప‌రిమిత ‌మైన క‌డ‌ప గ‌డ‌ప కోడ‌లు.. అనూహ్యంగా వైఎస్ అకాల మ‌ర‌ణంతో ఎదురైన కాంగ్రెస్ ఆటుపోటుల నేప‌థ్యంలో .. అవ‌మానాల సుడి నుంచి కుటుంబాన్ని కాచుకునేందుకు అంత బాధ‌లోనూ, అంతులేని దుఃఖంలోనూ ఆమె రాజ‌కీయ అరంగేట్రం చేశారు.



వైఎస్ మ‌ర‌ణానికి ముందు ఈ రాష్ట్రంలో విజ‌య‌మ్మ అంటే .. కేవ‌లం రాజ‌కీయ వ‌ర్గాల‌కు మాత్ర‌మే ప‌రిమిత ‌మైన పేరు. దీనికి కార‌ణం.. ఏనాడూ  గ‌డ‌ప బ‌య‌ట ప్ర‌పంచం ఆమెకు అవ‌స‌రం రాలేదు కాబ‌ట్టి. ఇక‌, వైఎస్ మ‌ర‌ణానంత‌రం ఏర్ప‌డిన ప‌రిస్థితులు ఆమెను గ‌డ‌ప దాటేలా చేశాయి. నిజానికి తెలుగునాట .. ఇలా ఇంత వ‌ర‌కు భ‌ర్త మ‌ర‌ణాంత‌రం.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. రాజ‌కీయంగా స‌క్సెస్ అయిన వారు లేర‌నే చెప్పాలి. భ‌ర్త‌తో పాటు క‌లిసి రాజ‌కీయాలు చేస్తున్న నాయ‌కురాళ్లు ఉన్నారు. లేదా భ‌ర్త వ్యాపారాలు వ్య‌వ‌హారాలు చూసుకుం టే తాను రాజ‌కీయంగా కుద‌రుకున్న నాయ‌కురాళ్లు ఉన్నారు. కానీ, అస‌లు అప్ప‌టి వ‌ర‌కు మైకు కూడా ప‌ట్టుకోవ‌డం చేత‌కాని మ‌హిళ‌, కేవ‌లం ఇంటి వ్య‌వ‌హారాల‌కే ప‌రిమిత‌మైన గృహిణి.. రాజ‌కీయాల్లోకి రావ‌డం.. ఓ సంచ‌ల‌న‌మే!



``ఇన్నాళ్లూ మీకు సేవ చేశాం. పార్టీకి నా పెనిమిటి ప్రాణం పోసి.. రెండు సార్లు అధికారంలోకి తీసుకువ  చ్చారు. అలాంటి మా కుటుంబానికి మీరిచ్చే విలువ ఇదేనా?! ఇప్ప‌టికైనా మా గురించి ఆలోచించండి. ఇంటి పెద్ద‌దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాం``- అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని వేడుకున్న విజ‌య‌మ్మ‌లో బేల‌త‌నం చూసిన వారు త‌ర్వాత కాలంలో వైఎస్ కోసం.. త‌న కుమారుడు జ‌గ‌న్ కోసం.. ఆమె వీధుల్లోకి వ‌స్తార‌ని, ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో ప్ర‌జ‌ల కోసం, ప్ర‌జ‌ల చేత నిర్మిత‌మైన ఈ ప్ర‌జాస్వామ్యంలో రాజ‌కీయ పోరాటం చేస్తార‌ని ఎవ‌రూ అప్ప‌ట్లో ఊహించ‌లేదు. వ‌చ్చాక కూడా అదే కాంగ్రెస్ నేత‌ల నుంచి అనేక ఛీత్కార స‌త్కారాలే ఆమెకు ఎదుర‌య్యాయి.



ఎన్ని అవ‌మానాలు ఎదురైనా విజ‌య‌మ్మ ఖాత‌రు చేయ‌లేదు. మేం ప్ర‌జ‌ల‌ను న‌మ్మాం. దివంగ‌త వైఎస్ ప్ర‌జ‌ల కోసం ఎన్నో చేశారు. అలాంటి మాకు ప్ర‌జ‌లు ఆ మాత్రం చేయ‌లేరా? మ‌మ్మ‌ల్ని క‌డుపులో పెట్టుకోలేరా? అంటూ.. రాజ‌కీయంగా ఆమె చేసిన ప్ర‌సంగాల‌కు ప్ర‌జలు ఫిదా అయ్యారు. వైఎస్ కుటుంబాన్ని క‌డుపులో దాచుకున్నారు. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. త‌ర్వాత జ‌గ‌న్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌర‌వ అధ్య‌క్షురాలిగా వ్య‌వ‌హ‌రించారు. 

 

 
పార్టీని స‌మున్న‌తంగా న‌డిపించేందుకు, పేద‌ల ప‌క్ష‌పాతిగా పేరు తెచ్చుకున్న వైఎస్ ఆశ‌యాల‌ను నిల‌బెట్టుకునేందుకు త‌న‌దైన రీతిలో ఆమె సూచ‌న‌లు స‌ల‌హాలు ఇస్తూనే ఉన్నారు. ఇలా రాజ‌కీయంగా విజ‌య‌మ్మ సాధించిన రికార్డు న‌భూతో.. అన్న‌రీతిలోనే సాగింది. మున్ముందు సాగాల‌ని ఈ శుభ జ‌న్మ‌దినోత్స‌వం నాడు కోరుకుంటూ ఆమె కు శుభాకాంక్ష‌లు చెబుదాం!!

మరింత సమాచారం తెలుసుకోండి: