కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. మిగితా దేశాల గోల ఒకటైతే అగ్రరాజ్యమైన  అమెరికా  గోల మరో విధంగా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని, ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) ముందస్తు హెచ్చరికలు చేయలేదంటూ ట్రంప్ ఒకటే మండిపోతున్నాడు. పైగా డబ్ల్యూహెచ్ఓకి అమెరికా తరపున వెళ్ళే నిధులను కూడా నిలిపేశాడు. దాంతో డబ్ల్యూహెచ్ఓతో పాటు ఇతర దేశాలు ఎంత మొత్తుకుంటున్నా ట్రంప్ పట్టించుకోవటం లేదు.

 

ప్రపంచంలోని ఏ దేశాలు కూడా చైనా విషయంలో కానీ డబ్ల్యూహెచ్ఓ విషయంలో కానీ చేయనంత రచ్చ ఒక్క ట్రంప్ మాత్రమే ఎందుకు చేస్తున్నాడు ? ఇక్కడే ఉంది అసలు కిటుకంతా.  అదేమిటంటే  అమెరికాలో కరోనా వైరస్ సమస్య పెరిగిపోవటానికి చైనా ఎంత కారణమో తెలీదు కానీ ట్రంప్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.  అమెరికా, ఇతర దేశాల మధ్య   ట్రావెల్ బ్యాన్ పెట్టకపోవటం, దేశమంతా లాక్ డౌన్ ప్రకటించకపోవటం, పౌరులను ముందుగా అప్రమత్తం చేయకపోవటం లాంటి అనేక లోపాలున్నాయి ట్రంప్ లో.

 

ప్రపంచదేశాలతో పోల్చితే అమెరికాలో బాధితులు, మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచం మొత్తం మీద వైరస్ బాధితులు 21 లక్షలుంటే ఒక్క అమెరికాలోనే సుమారు 7 లక్షలున్నారు. అలాగే మరణించిన వారి సంఖ్య ప్రపంచంలో 1.5 లక్షలుంటే అమెరికాలో మాత్రమే 35 వేలమంది చనిపోయారు. వైరస్ దెబ్బ అమెరికా మీద ఇంతగా ప్రభావం చూపటానికి కేవలం ట్రంప్ నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

 

తొందరలోనే అమెరికాలో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఎలాగూ అధ్యక్షుడి హోదాలో ట్రంప్ మళ్ళీ పోటి చేయటం ఖాయం. అదే సమయంలో జనాలేమో ట్రంప్ పై మండిపోతున్నారు. ఈ సమయంలో ట్రంప్ మళ్ళీ రెండోసారి గెలవాలంటే జనాల దృష్టిని మళ్ళించక తప్పదు. అందుకనే తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను ట్రంప్ చైనా, డబ్ల్యూహెచ్ఓ పైకి మళ్ళించే ప్రయత్నాలు చేస్తున్నాడు.  షెడ్యూల్ ప్రకారం ఇదే ఏడాది నవంబర్ 3వ తేదీన ఎన్నికలు జరగాలి. మామూలుగానే ట్రంప్ పై జనాల్లో వ్యతిరేకత ఉంది.

 

ఈ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో కరోనా వైరస్ విరుచుకుపడింది. ట్రంప్ కు వివిధ రాష్ట్రాల గవర్నర్లకు పడకపోవటం కూడా వైరస్ తీవ్రత పెరిగిపోవటానికి కారణమనే ఆరోపణలు వినబడుతున్నాయి.  మరో రెండు మూడు నెలల్లో వైరస్ సంక్షోభం  ముగిసినా  నవంబర్ లో ఎన్నికలు జరిగితే జనాల మూడ్ ఎలాగుంటుందో అర్ధం కావటం లేదు. అందుకనే జనాగ్రహం మొత్తాన్ని చైనా, డబ్ల్యూహెచ్ఓ వైపు మళ్ళించేందుకు నానా అవస్తలు పడుతున్నాడు. మరి ట్రంప్ ప్రయత్నాలు ఎంత వరకు సఫలమవుతాయో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: