పై ఫొటో చూస్తే అర్ధమైపోతుంది అమెరికాలో కరోనా వైరస్ ప్రభావం ఎంత భయంకరంగా ఉందో. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఫుడ్ బ్యాంకుల ముందు చాంతాడంత క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. మనకు ఉచిత ఆహారం పంపిణి చేస్తున్నట్లే అమెరికాలోని అన్నీ రాష్ట్రాల్లోను ఇపుడు ఫుడ్ బ్యాంకుల ముందు వందలాది మంది క్యూలైన్లలో నిలుచుంటున్నారు. మామూలుగా అయితే ఈ ఫుడ్ బ్యాంకుల్లోని ఆహారం కోసం ఎవరూ నిలుచోరు. కానీ ఇపుడు ఇది తప్ప చాలామందికి వేరే దారి లేదు.

 

ఒక్కసారిగా ఫుడ్ బ్యాంకులకు ఎందుకింత డిమాండ్ పెరిగిపోయిందంటే దాదాపు నెల రోజులుగా రెస్టారెంట్లు, హోటళ్ళు, బార్లు అన్నింటినీ మూసేశారు. అదే సమయంలో ఉద్యోగాలు పోయాయి. ఉద్యోగం లేదంటే జీతాలూ ఉండవు కాబట్టి తిండికి ఇబ్బందులు మొదలైపోయాయి. జీతాన్ని పొదుపుగా వాడుకునే అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఇపుడు ఇబ్బందులు పడిపోతున్నారు. అందుకనే ఉచితంగా ఆహారాన్ని పంపిణి చేసే ఫుడ్ బ్యాంకుల ముందు ఉచితంగా సరుకులు పంపిణి చేసే కౌంటర్ల ముందు వందలాది మంది జనాలు క్యూలు కడుతున్నారు.

 

ప్రస్తుత పరిస్ధితిని చూస్తేనే అమెరికాలో వైరస్ తీవ్రత ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవటానికి. మామూలుగా అయితే అమెరికాలో ఎంతటి సమస్య వచ్చినా ఫుడ్ బ్యాంకుల ముందు క్యూలో నిలబడి ఉచిత ఆహారాన్ని తీసుకోవటాన్ని అవమానంగా భావిస్తారు. కానీ ఇపుడలా అనుకునే పరిస్ధితి పోయింది కాబట్టే క్యూ లైన్లు పెరిగిపోతున్నాయి.

 

న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, టెక్సాస్, వాషింగ్టన్, నార్త్ కరోలినా, లాస్ ఏంజెలిస్, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి అనేక రాష్ట్రాల్లో ఫుడ్ బ్యాంకులకు ఇపుడు ఫుల్లుగా డిమాండ్ పెరిగిపోయింది. ఇదే విధంగా మరికొన్ని కౌంటర్లలో ఫుడ్ కు బదులుగా నిత్యావసరాలను కూడా ఉచితంగా అందిస్తున్నారట.  ప్రభుత్వాలు అందిస్తున్న నిత్యావసరాలను గనుక తీసుకుంటే సుమారు నెల రోజులు ఇబ్బందులు తప్పుతాయన్న ఉద్దేశ్యంతోనే జనాలు ఇటువంటి కౌంటర్ల ముందు కూడా బారులు తీరుతున్నారు.

 

ఇప్పటికే అమెరికా మొత్తం మీద సుమారు 7 లక్షల మంది బాధితులుండగా మరో 41 వేలమంది చనిపోయారు. వైరస్ దెబ్బకు అన్నీ రంగాలు కుదలైపోవటంతో దాదాపు 80 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. దాంతో వాళ్ళంతా ఆహారం, నిత్యావసరాలకు అల్లాడిపోతున్నారు. అందుకనే ప్రభుత్వంతో పాటు కొన్నిచోట్ల స్వచ్చంద సంస్ధలు కూడా ఫుడ్ బ్యాంకులు, నిత్యావసరాలను అందించే కౌంటర్లను ఏర్పాటు చేసి బాధితులను ఆదుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: