ఏపీ అధికార పార్టీ వైసీపీలో నేత‌ల వ్య‌వ‌హారం రోజుకోర‌కంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. క‌రోనా ఎఫెక్ట్‌కు ముందు నేత‌లు ఒక‌రితో ఒక‌రు పోటీ ప‌డి మ‌రీ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించారు ఒక‌రిపై ఒక‌రు కుమ్ములాడుకున్నారు. ఇక‌, లాక్‌డౌన్ విధించిన త‌ర్వాత నియ‌మాల‌ను ఉల్లంఘిస్తూ.. త‌మ దారిలో తాము ఉంటూ.. కూడా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. ఇలా రెండు విధాలా కూడా సోష‌ల్ మీడి యాలో వైసీపీ నేత‌ల‌కు విమ‌ర్శ‌లు త‌ప్ప‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా ప్ర‌భుత్వ సార‌థి సీఎం జ‌గ‌న్‌పైనా ఇప్పుడు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో ఆయ‌న కేబినెట్‌లోని ఒక‌రిద్ద‌రు మంత్రుల‌పైనా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

 

నిజానికి ఈ విమ‌ర్శ‌ల వెనుక స‌హేతుక కార‌ణం అంటూ లేద‌ని అన‌లేం. నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లే ఈ విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా ఎఫెక్ట్ ఎక్కువ‌గానే ఉంది. ఈనేప‌థ్యంలో నాయ‌కులు క‌రోనా అప్‌డేట్స్‌ను వెల్ల‌డించేందుకు మీడియా ముందుకు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో వారు త‌డ‌బ‌డుతున్నారు. ఇవి సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌ల‌కు, ట్రోల్స్‌కు ఆస్కారం ఇస్తున్నాయి. కొన్నాళ్ల కింద‌ట సీఎం జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ.. క‌రోనా పుట్టింది ద‌క్షిణ కొరియాలో అన్నారు. ఆ వెంట‌నే స‌ర్దుకున్నారు. 

 

అయితే, ముందు చెప్పిన విష‌యాన్నే విమ‌ర్శ‌కులు లెక్క‌లోకి తీసుకున్నారు. పోనీ ఆ త‌ర్వాతైనా ఆయ‌న త‌న తీరు మార్చుకోలేదు. ఎవ‌రైనా వ్య‌క్తుల‌కు క‌రోనా కొవిడ్‌-19 పాజిటివ్ వ‌స్తే.. వెంట‌నే క్వారంటైన్‌కు పంపిస్తామ‌ని చెప్పాల్సిన సీఎం.. నెగిటివ్ వ‌స్తే.. 108లో క్వారంటైన్‌కు త‌ర‌లిస్తామ ‌ని చెప్పి.. అభాసుపాల‌య్యారు. ఇక‌, ఈయ‌న సంగ‌తి ఇలా ఉంటే.. మంత్రులు కూడా త‌క్కువేమీ తిన‌లే దు. స‌మాచార శాఖ మంత్రి పేర్ని నాని కూడా ఇదేత‌ర‌హాలో త‌డ‌బ‌డి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. 

 

కొవిడ్‌-19 కేసుల గురించి ఓ టీవీ చానెల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో పాల్గొన్న ఆయ‌న‌.. రాష్ట్రంలో 514 మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని చెప్పి .. అందరినీ విస్మ‌యానికి గురిచేశారు. నిజానికి 514 కేసులు అనాల్సిన ఆయ‌న మ‌ర‌ణాలు అన్నారు. ఇలా ఒక్కొక్క‌రు ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ పోవ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ త‌డ‌బాటు ఎంత దూర‌మో.. ఎంత‌కాల‌మో.. చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: