తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏ రేంజ్ లో రాజకీయాలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండడంతో దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తుండడంతో కేంద్రం దేశవ్యాప్తంగా నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇక తెలంగాణ విషయానికొస్తే ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం మే మూడో తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించింది. అయితే తెలంగాణాలో మాత్రం మే ఏడో తేదీ వరకు ఈ నిబంధనలను పొడిగించింది. కేంద్రం ఏప్రిల్ 20 తర్వాత నుంచి అనేక రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చింది. అయితే తెలంగాణలో మాత్రం ఆ నిబంధన అమల్లోకి రావని, మరింత కఠినంగా లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్టుగా కేసీఆర్ ప్రకటించడంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా కేసీఆర్ నిర్ణయంతో మీడియా రంగం మరింత కుదేలయ్యేలా కనిపిస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ మీడియాను దెబ్బతీసే విధంగా వ్యవహారాలు నడిపిస్తున్నారని వాదన తెరమీదకు వస్తోంది.

IHG


లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ప్రకటనలు లేకపోవడంతో పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ఆదాయం గణనీయంగా తగ్గిపోయిన నేపథ్యంలో పత్రికలు జిల్లా ఎడిషన్ లను పూర్తిగా ఎత్తివేసి, మెయిన్ ఎడిషన్ పేజీ లను కూడా బాగా తగ్గించి వేశాయి. సిబ్బందిని కూడా బాగా తగ్గించి వేశారు. ఇక ప్రధాన పత్రికలు వద్ద ఉన్న న్యూస్ ప్రింట్ మరో 15 రోజులు మాత్రమే వచ్చేలా ఉంది. అది కనుక అయిపోతే ప్రింటింగ్ మొత్తం ఆగిపోతుంది. న్యూస్ ప్రింట్ కావాలంటే దానిని రష్యా నుంచి  దిగుమతి చేసుకోవాలి. కేంద్రం సడలింపులు ఇచ్చినా, తెలంగాణలో కేసీఆర్ మాత్రం ఎటువంటి సడలింపులు ఇవ్వలేదు కాబట్టి మే 7 వరకు న్యూస్ ప్రింట్ తెలంగాణకు వచ్చే అవకాశమే లేదు. 


మరో చోట నుంచి తెచ్చుకునే అవకాశం కూడా లేదు.ఇక ప్రింటింగ్ కు అవసరమైన కలర్స్ కూడా ముంబై నుంచి దిగుమతి చేసుకోవాలి. అక్కడా లాక్ డౌన్ తీవ్రంగా ఉంది. దీంతో అవి కూడా వచ్చే అవకాశమే లేకుండాపోయింది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా కేంద్రం సడలింపులు ఇచ్చినా, తెలంగాణలో వాటిని అమలు చేయకపోవడంతో మీడియా రంగం మొత్తం మరింత సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం కనిపిస్తోంది. అయితే సీఎం కేసీఆర్ కు సంబంధించిన పత్రికకు మాత్రం రెండు నెలలు సరిపడగా న్యూస్ ప్రింట్ అందుబాటులో ఉందట. అందుకే ఆయన ఈ రంగానికి ఎటువంటి సడలింపులు ఇచ్చేందుకు ఇష్టపడడంలేదు అనేది మీడియా సర్కిల్స్ లో చర్చకు వస్తోంది. 


కరోనా పేరుతో విధించిన లాక్ డౌన్ నిబంధన ప్రజల సంక్షేమం కోసమే అయినా ఈ పేరుతో మరింత కఠిన నిబంధనలు రూపొందించడం వల్ల మీడియా రంగం మొత్తం కుదేలు అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రధాన పత్రికలుగా చెప్పుకుంటున్న రెండు దినపత్రికలు ఈ న్యూస్ ప్రింట్ కొరత కారణంగా పూర్తిగా మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని ఆ మీడియా యాజమాన్యాలలో ఆందోళన నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: