బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం చూస్తే అందరిలోను ఇదే అనుమనం పెరిగిపోతోంది. వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ గా కన్నా మీడియాతో మాట్లాడాడు. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో కన్నా తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నాడా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ కన్నా మాటల్లో మూడు అంశాలపై  ప్రధానంగా చర్చ జరుగుతోంది. రాజకీయ నేతలన్నాక ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమన్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఆరోపణలు చేసేవారు, ప్రత్యారోపణలు చేసేవారు కూడా తమ ఆరోపణలకు ఆధారాలను చూపించరు. గట్టిగా మాట్లాడితే సరైన సమయంలో తమ దగ్గరున్న ఆధారాలను బయటపెడతామంటూ బెదిరిస్తుంటారంతే. ఇక్కడ ఎంపి ఆరోపణలపై కన్నా కౌంటర్లు విచిత్రంగా ఉన్నాయి. ఇంతకీ అవేమిటంటే తనపై ఆరోపణలు చేయటమంటే ఆకాశంపై ఉమ్మేయటమేనట. అంటే కన్నా ఉద్దేశ్యం ఏమిటంటే తనను తాను ఆకాశమంతగా ఊహించుకుంటున్నట్లు అర్ధమవుతోంది.

 

ఇదే సమయంలో తనను కొనగలిగే వాడు ఇంకా భూమ్మీద పుట్టలేదట. నిజానికి ఇదేదో సినిమా డైలాగులాగే ఉంది వినటానికి. విజయసాయి ఆరోపణల ప్రకారం తాను చంద్రబాబుకు అమ్ముడు పోలేదని కన్నా చెప్పటం వరకూ ఓకేనే. మరి జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబునాయుడు ఆరోపణలు చేయగానే కన్నా కూడా ఎందుకు వాటినే రిపీట్ చేస్తున్నాడో చెప్పగలడా ?  కన్నాకంటూ సొంత వ్యక్తిత్వం లేదా ? అనే సందేహాలు వస్తున్నాయి. పైగా చంద్రబాబు ఆడమన్నట్లే కన్నా ఆడుతున్నాడనే ఆరోపణలను బిజెపిలోనే నేతలే జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేశారట.

 

అలాగే తనపై పరువు తక్కువ ఆరోపణలు చేస్తే ఊరికే ఉంటానా ? అంటూ ఎంపిపై మండిపోయాడు. నిజమే ప్రతి ఒక్కళ్ళకీ పరువుంటుందన్న విషయం తెలిసిందే. మరి ప్రభుత్వంపైనా జగన్ పైనా నిరాధార ఆరోపణలు చేస్తున్నపుడు జగన్ లేదా ప్రభుత్వానికి పరువుంటుందని కన్నాకు ఎందుకు తోచలేదు ? జగన్ అవినీతికి పాల్పడినట్లు కన్నా చేసిన ఆరోపణలకు ఎప్పుడైనా ఆధారాలు చూపించాడా ?  ఎటువంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబు ఆరోపణలనే  గుడ్డిగా ఫాలో అవుతున్నాడు కాబట్టే కన్నా అమ్ముడుపోయాడనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

ఇక చివరగా కన్నా అనే నేత అవుట్ డేటెడ్ రాజకీయ నేత అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకపుడు గుంటూరు రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుండచ్చు. కానీ ఇపుడు మాత్రం అవుట్ డేటెడ్ అనే చెప్పాలి. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో నరసరావుపేట లోక్ సభ కు పోటి చేసిన కన్నాకు వచ్చింది 15,468 ఓట్లు.  అంటే డిపాజిట్ కూడా రాలేదని అర్ధమైపోతోంది. పార్టీ అధ్యక్షడయ్యుండి కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయిన కన్నా కూడా తనను తాను ఆకాశమంతగా ఊహించుకోవటమే విచిత్రంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: