కరోనావైరస్ దెబ్బకు మనదేశంలో మహారాష్ట్ర డేంజర్ జోన్లోకి వెళిపోతోందా ? నిపుణులు, కంద్రప్రభుత్వం అత్యున్నత వర్గాల అంచనా ప్రకారం అదే అనుమానంగా ఉంది. ప్రపంచం మొత్తంమీద అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో వైరస్ ఎంత భయంకరంగా ఉందో అందరికీ తెలిసిందే. అటువంటి పరిస్ధితే ఇండియాలో మహారాష్ట్రలో ఎదురవ్వబోతోందని కేంద్రప్రభుత్వం తరపున అధ్యయనం చేసిన నిపుణుల బృందం నివేదిక ఇచ్చిందట.

నిపుణుల బృందం నివేదిక ప్రకారం రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో మాత్రమే వైరస్ బాధితుల సంఖ్య లక్షలకు చేరుకునే ప్రమాదం ఉందని తెలుస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం ఏప్రిల్ 30వ తేదీకి బాధితుల సంఖ్య  42, 604కు పెరిగే అవకాశం ఉందని చెప్పింది.  అయితే మే 15వ తేదీ నాటికి బాధితుల సంఖ్య ఒక్కసారిగా 6, 56, 407కు పెరిగే ప్రమాదం ఉందని చెప్పింది. ఏప్రిల్ 30వ తేదీకి మే నెల 15వ తేదీకి మధ్య ఉన్నది 15 రోజులే గ్యాప్. ఈ 15 రోజుల్లోనే ఒక్కసారిగా బాధితుల సంఖ్య లక్షల్లో పెరిగిపోతుందంటే ప్రమాదం ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

 

పెరిగిపోయే కేసుల సంఖ్య అంచనా ప్రకారమే 13,636 వెంటిలేటర్లు, 4.83 లక్షల ఐసొలేషన్ బెడ్లు అవసరం అవుతుందని కూడా నిపుణుల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఆక్సిజన్ అవసరం లేని బెడ్లు 30481, ఆక్సిజన్ అవసరం అయిన బెడ్లు 5466 అవసరం అవుతాయని నిపుణులు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను నిపుణుల బృందం హెచ్చరించింది. నిజానికి మహారాష్ట్రలో కేసుల తీవ్రత పెరిగిపోతుండటానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిదేమో ఢిల్లీలోని మర్కజ్ మసీదులో జరిగిన ప్రార్ధనలకు హాజరై తిరిగి వచ్చిన వారు. రెండో కారణం ధారావి స్లమ్.

 

మర్కజ్ మసీదులో ప్రార్ధనలకు హాజరై తిరిగి వచ్చిన వాళ్ళల్లో కొందరి వల్ల మహారాష్ట్రలో వైరస్ సమస్య ఒక్కసారిగా పెరిగిపోయింది. దీన్ని అదుపు చేయలేక నానా అవస్తలు పడుతున్న ప్రభుత్వంపై ధారావి స్లమ్ సమస్య పెద్ద బండను వేసినట్లయ్యింది. మొత్తం ఏషియాలో ముంబాయిలోని ధారావి స్లమ్ అతిపెద్దదన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ స్లమ్ లో సుమారు 15 లక్షల మంది ఉంటున్నారు. ఇక్కడ గనుక వైరస్ సమస్య మొదలైతే ఆపటం కష్టమని మొదటి నుండి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు టెన్షన్ పడుతున్నాయి.

 

ప్రభుత్వాలు ఆందోళన పడుతున్నట్లే ధారావిలో సమస్య మొదలైంది.  రాష్ట్రం మొత్తం మీద సమస్య ఒక ఎత్తు ధారావిలో సమస్య ఒకఎత్తుగా తయారైంది పరిస్ధితి. ధారావిలో సుమారు 150 కేసులున్నట్లు సమాచారం. బహుశా నిపుణుల టెన్షన్ కూడా ఈ స్లమ్ లో పెరిగిపోతున్న కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకునే అయ్యుండచ్చు. మొత్తం మీద అందరూ టెన్షన్ పడుతున్నట్లే నిపుణుల అంచనాలు కూడా ఉన్నాయి. అయితే నిపుణుల బృందం అంచనాలు, ఆందోళనలను మహారాష్ట్రప్రభుత్వం కొట్టిపడేస్తోంది. సరే చూద్దాం ఏమి జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: