ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ చనిపోయినట్లు అంతర్జాతీయ వార్తా సంస్ధలు సంచలన కథనాలు అందిస్తున్నాయి.  కొద్ది రోజులుగా కిమ్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హ్రుదయ సంబంధమైన ఆపరేషన్ జరిగినపుడు కిమ్ కోమాలోకి వెళ్ళాడనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. కోమాలో ఉన్నపుడే కిమ్ బ్రెయిన్ కూడా డెబ్ అయ్యిందనేది మరో ప్రచారం. అయితే ఈ ప్రచారాల్లో ఏది నిజమో కూడా ఎవరికీ తెలీదు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కిమ్ తో పాటు ఆయన కుటుంబం మాత్రమే ఉపయోగించే ఓ అత్యాధునిక రైలు వోన్ సాన్ రిసార్ట్స్ లో నిలిచి ఉన్నట్లు అమెరికాలోని 38 నార్త్ అనే  వెబ్ సైట్ చెబుతోంది. మూడు రోజులుగా ఈ రైలు ఇక్కడే నిలిచి ఉంది కాబట్టి కిమ్ కూడా కచ్చితంగా ఇదే రైలులోనో లేకపోతే ఇక్కడే ఉన్న రిసార్ట్స్ లోనే ఉండి చికిత్స చేయించుకుంటున్నట్లు నిర్ధారణగా చెబుతోంది. దానికితోడు కిమ్ నార్త్ కొరియాలో జరిగే ఎటువంటి ఉత్సవాలకు కూడా హాజరుకావటం లేదు. ఏప్రిల్ 15వ తేదీన తన తాత జయంతి సందర్భంగా జరిగిన ఉత్సవాల్లో కూడా పాల్గొనకపోవటంతో అనారోగ్యంపై ప్రచారం ఊపందుకుంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఉత్తరకొరియాలో న్యూస్ పేపర్లు లేవు. వార్తా ఛానళ్ళు లేవు. వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్ళుండవు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ ఛానల్, పేపర్ మాత్రం జనాలకు ఆధారం. అందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఉన్న విషయాన్ని ఉన్నదున్నట్లుగా సమాచారం ఇచ్చేందుకు లేదు. కాబట్టి కిమ్ అనారోగ్యం విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే కానీ బయట ప్రపంచానికి తెలిసే ఛాన్సే లేదు.

 

అయితే కిమ్ అనారోగ్యం విషమించిందని, చనిపోయాడనేందుకు విదేశీ మీడియాకు ఉన్న ఆధారం ఏమిటంటే చైనా నుండి వైద్య నిపుణులు ఉత్తరకొరియాకు చేరుకున్నారు. ఉత్తరకొరియాకు చైనా మిత్రదేశం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో ప్రభుత్వంలోని మొత్తం వ్యవహారాలను కిమ్ సోదరి నేరుగా పర్యవేక్షిస్తోందట. కిమ్ బతికుంటే సోదరి ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన అవసరం ఏమిటనేది విదేశీ మీడియా సందేహం.

 

విదేశీమీడియా సందేహాలు, క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే కిమ్ అనారోగ్యం విషమించిందనో, ఇక లేరనో అనుకోవాల్సొస్తోంది. కాకపోతే ఆవగింజంత సమాచారం కూడా బయటకు పొక్కనీయకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోందంటే ఆశ్చర్యంగానే ఉంది. ఒకవైపు కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం వణికిపోతున్న సమయయంలోనే కిమ్ అనారోగ్యం వార్త కూడా ప్రపంచ దేశాల్లో సంచలనమవుతోందంటే కిమ్ మామూలోడు కాదనేది మాత్రం కచ్చితంగా అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: