తొందరలో జరగబోయే అమెరికా ఎన్నికల్లో  ట్రంపుకు కరోనా వైరస్ గండం పొంచి ఉన్నట్లే అనుమానంగా ఉంది. ఈ ఏడాది నవంబర్ 3వ తేదీన అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతోంది. అసలే ట్రంప్ పాలన, వ్యవహార శైలితో చాలా వివాదాస్పదమయ్యాడు. రానున్న ఎన్నికల్లో తిరిగి గెలిచేది అనుమానంగానే ఉందనే ప్రచారం ఒకవైపు ఊపందుకుంటోంది. ఇటువంటి నేపధ్యంలోనే కరోనా వైరస్ అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేసేస్తోంది. కరోనా దెబ్బకు ట్రంప్ పై వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం మొదలైంది.

 

అందుకనే ట్రంప్ కూడా తెలివిగా అమెరికా జనాల ఆగ్రహం మొత్తాన్ని చైనా మీదకు మళ్ళించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లే ఉన్నాడు.  అగ్రరాజ్యంలో వైరస్ సమస్య పెరిగిపోవటానికి చైనానే కారణమనే వాదన మొదలుపెట్టాడు ట్రంప్. సరే ట్రంప్ వాదనతో ఎంతమంది ఏకీభవిస్తారనే విషయం ఇప్పటికిప్పుడు తేలేదాకాదు. అమెరికాలో పరిస్ధితులైతే చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా దిగజారిపోయాయనేది వాస్తవం.

 

అగ్రరాజ్యంలో వైరస్ తీవ్రత పెరిగిపోవటానికి ట్రంప్ ఎంత కారణమో ఆయా రాష్ట్రాల గవర్నర్లు కూడా అంతే కారణమనే వాదన కూడా పెరిగిపోతోంది. ఎందుకంటే గవర్నర్లు తమ రాష్ట్రాల్లో లాక్ డౌన్ పెట్టాలని ప్రతిపాదించినపుడు ట్రంప్ అంగీకరించలేదు. దాంతో ట్రంప్ అంగీకారంతో సంబంధం లేకుండానే కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించేశారు. సమస్య పెరిగిపోయిన తర్వాత లాక్ డౌన్ ప్రకటించాలని ట్రంప్ చేసిన ప్రతిపాదనను కొందరు గవర్నర్లు తీవ్రంగా వ్యతిరేకించారు.

 

ఒకవైపు పెరిగిపోతున్న తీవ్రత మరోవైపు గవర్నర్ల నుండి కొరవడిన సహకారంతో చివరకు ట్రంప్ నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సొచ్చింది.  తాజాగా లాక్ డౌన్ ను వ్యతిరేకంగా కొన్ని రాష్ట్రాల్లో మొదలైన భారీ నిరసనలకు ట్రంప్ కూడా అనుకూలంగా ప్రకటించటం గవర్నర్లకు మండుతోంది. వైట్ హౌస్ కు రాష్ట్రాల గవర్నర్లకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోవటంతో   జనాలు బాగా ఇబ్బందులు పడుతున్నారు.

 

ఒకవైపు దేశంలో జనాలు కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతుంటే ట్రంపుకు వివిధ రాష్ట్రాల గవర్నర్లకు మధ్య  వివాదాలు పెరిగిపోతుండటం విచిత్రంగా ఉంది. జనాలు ఏమైపోయినా పర్వాలేదు తమ వ్యక్తిగత ప్రతిష్టే తమకు ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సరే ఏదేమైనా నవంబర్ లో జరగబోయే అధ్యక్ష ఎన్నికలు ట్రంప్ కు పెద్ద సవాలుగా మారిందనే ప్రచారమైతే వాస్తవం. మరి కరోనా వైరస్ గండాన్ని ట్రంప్ అధిగమిస్తాడా ? లేదా అన్నది చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: