అగ్రరాజ్యం అమెరికాలో గ్రీన్ కార్డుల జారీని 60 రోజులు రద్దు చేయటంతో పాటు ఇతర వీసా నిబంధనలను కూడా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా కఠినంగా మార్చేశాడు. ట్రంప్ తాజా నిర్ణయం వల్ల అమెరికాకు వెళ్ళాలని అనుకుంటున్న ప్రపంచ దేశాల జనాలకు తాత్కాలికంగానే అయినా  ఇబ్బందులు తప్పవు. ఇంతటి కఠినమైన నిర్ణయాన్ని ట్రంప్ ఇంత హఠాత్తుగా ఎందుకు తెచ్చాడు ? అన్నదే అసలైన ప్రశ్న. ఎందుకంటే అమెరికా అంటేనే వలసదారుల దేశమని పేరు. అమెరికా ఈరోజున ఇంత ఉన్నతంగా ఉందంటే అందుకు ప్రధానకారణం వలసదారుల్లోని ప్రతిభే అని చెప్పటంలో సందేహమే అవసరం లేదు.

 

వలసదారుల కష్టం వల్లే అభివృద్ధి చెందిన దేశంలోకి ఇతర దేశాలను తాత్కాలికంగా నిషేధించటం వెనుక పెద్ద వ్యూహమే ఉందని చెప్పుకుంటున్నారు. రానున్న నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్ రెండోసారి పోటి చేయటం ఖాయం. ఇప్పటివరకూ ట్రంప్ పాలనలో జనాల్లో వివిధ కారణాలతో వ్యతిరేకత పెరిగిపోతోందని  సర్వేలు చెబుతున్నాయి.

 

తనపై జనాల్లో పెరుగుతున్న వ్యతిరేకత పెరుగుతున్న నేపధ్యంలోనే అకాస్మత్తుగా కరోనా వైరస్ సంక్షోభం వచ్చిపడింది. జనాల్లో తనపై పెరిగిపోతున్న వ్యతిరేకతను ఎలా తగ్గించుకోవాలా అని ఆలోచిస్తున్న ట్రంప్ కు కరోనా వైరస్ సంక్షోభం అవకాశంగా వచ్చినట్లుంది. నిజానికి వైరస్ దెబ్బకు అమెరికా ఇంత ఘోరంగా దెబ్బ తిన్నదంటే ఇందులో ట్రంప్ నిర్లక్ష్యం కూడా ఉన్న విషయం వాస్తవం. అసలే వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ట్రంప్ జనాల దృష్టిని మరలించేటంలో భాగంగా గ్రీన్ కార్డుల జారీని 60 రోజులు రద్దు చేయటం, వీసా నిబంధనలను కఠినతరం చేశాడు.

 

దీనివల్ల ట్రంప్ కు వచ్చే లాభం ఏమిటంటే అమెరికాలో ఉద్యోగాలు కేవలం తమకు మాత్రమే వస్తాయనే ఆలోచనే అమెరికన్లలో ఉత్సాహాన్నిస్తోందనే అంచనాలు మొదలయ్యాయి. నిజానికి ఇతర దేశాల్లోని యువత ప్రతి ఏడాది లక్షల మంది వివిధ రంగాల్లో ప్రధానంగా ఐటి సెక్టార్ కోసం  అమెరికాకు చేరుకుంటారు. అంటే ఆ మేరకు అమెరికాలోని స్ధానికులకు ఉద్యోగవకాశాలు కోల్పోయినట్లే అనుకోవాలి.  

 

ప్రస్తుత కరోనా వైరస్ సంక్షోభం కారణంగా అమెరికాలో సుమారు 2 కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి కోల్పోయినట్లు ఓ అంచనా. మరి ఇన్ని కోట్లమంది స్ధానంలో అమెరికాలోని స్ధానికులతో భర్తీ చేసుకోవటం సాధ్యమేనా అన్నది అనుమానమే. ఏదేమైనా విదేశీయులపై అమెరికాలోని స్ధానికుల్లో వ్యతిరేకత పెరిగిపోతోందన్న విషయాన్ని ట్రంప్ గ్రహించాడట.  అలాంటి వాళ్ళను ఆకర్షించేందుకే ట్రంప్ తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. మరి ట్రంప్ వ్యూహం ఎంత వరకూ ఫలిస్తుందో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: