ఏపీ సీఎంగా వైసీపీ అధినేత జగన్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక నిందలు, నిష్ఠూరాలు, ప్రశంసలు, విమర్శలు ఎన్నో ఎదుర్కుంటున్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నా జగన్ స్వీయ తప్పదాలు కూడా ఆయనపై విమర్శలకు కారణంగా కనిపిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విచిత్రమైన రాజకీయ పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి. ఇక్కడ ప్రజల సంక్షేమం ఎలా ఉన్నా ఫర్వాలేదు కానీ తమ పార్టీ  పలుకుబడి పెరగాలి అన్నట్టుగా ప్రస్తుత రాజకీయ పార్టీల వ్యవహారశైలి ఉండడం అనేక విమర్శలకు తావిస్తోంది. ఏపీ ఇప్పుడు కష్టకాలంలో ఉంది. కరోనా విలయతాండవం చేస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఎక్కడి జనాలు అక్కడే లాక్ అయిపోయారు. ఈ సమయంలో ప్రజల ఇబ్బందులను తీర్చడమే అన్ని రాజకీయ పార్టీల బాధ్యత కానీ, అధికార పార్టీని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు... ఆ విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొట్టడంలో అధికార పార్టీ వేస్తున్న తప్పటడుగులు ఇలా ఎన్నోరకాలైన పరిణామాలు ఏపీలో చేటుచేసుకుంటున్నాయి. 

 

 

అసలు ఈ కరోనా విషయంలో జగన్ మొదటి నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. మొదట్లో ఏపీలో కరోనా కేసులు పెద్దగా నమోదు కాలేదు. అయితే ఏపీ ప్రభుత్వం కరోనా కేసులను దాచిపెడుతుందని, పాజిటివ్ కేసుల సంఖ్యను తగ్గించి చూపిస్తోంది అంటూ అనేక విమర్శలను టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు చేశాయి. అయితే ఈ విమర్శలకు వైసీపీ గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోయింది. ఇక ఆ తరువాత దక్షిణ కొరియా నుంచి కొనుగోలు చేసినా, కరోనా టెస్టింగ్ కిట్ల విషయంలోనూ వైసీపీ విమర్శలు ఎదుర్కొంది. అయితే ఈ వ్యవహారంలో గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. అయితే వీటిపైనా పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. 

 


దేశవ్యాప్తంగా కరోనా టెస్టింగ్ ల విషయంలో ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది అంటూ దేశవ్యాప్తంగా ఏపీ ప్రభుత్వానికి ఖ్యాతి వస్తున్నా దానిని సక్రమంగా ప్రచారం చేసుకోవడం లో జగన్, ఆయన పార్టీ సరిగా ప్రచారం చేసుకోలేకపోతోంది. దీనికి కారణం ప్రధాన మీడియా అంత ఒక సామాజికవర్గం వారికి చెందింది కావడం, వారు వైసీపీ ప్రభుత్వ హవా పెరగకుండా, ఏపీ ప్రభుత్వానికి వస్తున్నా మైలేజ్ ను తొక్కిపడుతూ వ్యవహరిస్తోంది. ఇక మీడియా విషయంలోనూ జగన్ వైకిరి అనేక విమర్శలకు కారణం అవుతోంది. జగన్ మీడియా సమావేశాలు చాలా అరుదుగా నిర్వహిస్తున్నారు. తాను ఏమి చెప్పాలనుకున్నా వీడియో రూపంలో రికార్డు చేసి మీడియాకు పాముతున్నారు తప్ప ఎక్కడా మీడియా తో మాట్లాడేందుకు జగన్ ఇష్టపడడంలేదు. 

 

ఎవరు ఎన్ని విమర్శలు చేస్తున్నా జగన్ అవేవి పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు. ఈ విషయంలో జగన్ సూటిగా, దూకుడుగా వెళ్లడం సరైనదే అయినా, ప్రజలకు ప్రభుత్వం ఎంత చిత్తశుద్దితో పనిచేస్తుందో చెప్పుకుని నమ్మకం కలిగించకపోతే అది జగన్ కు ముందు ముందు ఇబ్బందులు తీసుకురావచ్చు.జగన్ నిరంతరం ప్రజలపక్షంగా పనిచేస్తూ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే చిరునవ్వుతో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనపై పడుతున్న నిందలు, నిష్ఠూరాలు, నిజాలు, ప్రతిపక్షాల రాద్ధాంతాలు ఇవన్నీ జనాలు గమనిస్తూనే ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: