ఇపుడిపుడే కరోనా వైరస్ దెబ్బ నుండి ప్రపంచదేశాలు కోలుకుంటున్నాయి. దాదాపు నెల రోజులుగా వైరస్ సమస్యతో అల్లాడిపోయిన చాలా దేశాల్లో పరిస్ధితులు ఇపుడిపుడే సాధారణ స్ధితికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ఐరోపా దేశాల్లోని కొన్ని చోట్ల లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేస్తుంటే మరికొన్ని దేశాల్లో పాక్షికంగా సడలిస్తున్నారు. కేసుల తీవ్రత తగ్గటంతో బాధితుల సంఖ్య తగ్గిపోవటంతో పాటు మృతుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది.

 

స్విట్జర్లాండ్ లో హెయిల్ సెలూన్లు, ఇతర వాణిజ్య సముదాయాలను ఇప్పటికే తెరిచేశారు. వైరస్ మళ్ళీ వ్యాపించకుండా ఆ దేశపు ఆర్మీ రోజుకు పది లక్షల మాస్కులను పంపిణి చేస్తోంది. సడలింపుల వల్ల కేసుల నమోదు కాకపోతే మే 11వ తేదీనుండి మరిన్ని రంగాలను ఓపెన్ చేయటానికి రంగం సిద్దం చేస్తోంది.  ఇక నార్వేలో ప్రాధమిక పాఠశాలలన్నింటినీ ఓపెన్ చేసేశారు.

 

స్పెయిన్ లో చిన్న పిల్లలు ఇళ్ళలో నుండి బయటకు వచ్చి ఆడుకోవటానికి వీలుగా పార్కులను ప్రభుత్వం ఓపెన్ చేసింది. కాకపోతే సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు పెట్టుకోవటాన్ని మాత్రం తప్పనిసరి చేసింది. పరిస్ధితిని సమీక్షించి లాక్ డౌన్ నుండి మరిన్ని రంగాలకు సడలింపులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానని చెప్పింది. అలాగే  ఇటలీలో మే 4వ తేదీ నుండి ఫ్యాక్టరీలు, నిర్మాణ రంగానికి సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించింది. మే 18 నుండి అన్నీ రకాల దుకాణాలు, మ్యూజియంలు, జూన్ 1 నుండి రెస్టారెంట్లు, కెఫేలు ప్రారభం కానున్నాయి. ఇటలీ కరోనా దెబ్బకు ఎలా వణికిపోయిందో అందరికీ తెలిసిందే.

 

ఆస్ట్రియాలో చిన్న చిన్న దుకాణాలను ఏప్రిల్ 14 నుండే అనుమతించారు. మిగిలిన వాటిల్లో మే 1 నుండి కొన్నింటికి, మే 11 నుండి మరిన్ని రంగాలకు సడలింపులు ఇస్తారు. అయితే ఎప్పుడెపుడు దేనికి సడలింపులు ఇచ్చేది తొందరలోనే ప్రకటించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బెల్జియంలో మే 11 నుండి అన్నీ రకాల దుకాణాలు, మే 18 నుండి విశ్వవిద్యాలయాలను ప్రారంభమవుతున్నాయి.

 

ఇక క్రొయేషియా, డెన్మార్క్, నెదర్లాండ్స్, పోలెండ్ లాంటి దేశాలు కూడా మే 11 నుండే లాక్ డౌన్ కు సడలింపులు ఇవ్వటమో లేదా పూర్తిగా ఎత్తేసేందుకో ప్లాన్ చేస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చాలా దేశాలు లాక్ డౌన్ నుండి బయటపడేందుకు మే 11వ తేదీనే ఎందుకు నిర్ణయించుకున్నాయో అర్ధం కావటం లేదు.  సరే ఎవరి నమ్మకాలు ఎలాగున్నా మనదేశంలో కూడా తొందరలోనే పరిస్దితులు కుదుటపడతాయని ఆశిద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: