లాక్ వేశారు.. ! తాళం ఎక్కడ పెట్టారో మరిచిపోయినట్టు ఉన్నారు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పై సెటైర్లు పడుతున్నాయి. నిజమే లాక్ డౌన్ విధించడం ఎంత అవసరమో తియ్యడం కూడా అంతే అవసరం. ఎందుకంటే లాక్ డౌన్ విధించకపోతే ఈ పాటికి పరిస్థితి చే జారిపోయి ఉండేది. అయితే లాక్ డౌన్ కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. జనాలంతా గగ్గోలు పెట్టేస్తున్నారు. ఉపాధి అవకాశాలు ఇప్పటికే కరువయ్యాయి. అసలు బతుకు ఈడ్చుకురావడమే ఇప్పుడు సమస్యగా మారింది. మార్చి 23 నుంచి నిరవధికం గా జనాలంతా ఎక్కడికక్కడ లాక్ అయిపోయారు. వివిధ పనులు, శుభకార్యాల నిమిత్తం వివిధ రాష్ట్రాలకు వెళ్లిన వారంతా ఎక్కడికక్కడే ఆగిపోయారు. 

 

IHG


వలస కూలీలా సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చేసేందుకు పని లేక, ఉండేందుకు నీడ లేక తమ సొంత ఊళ్లకు వెళ్ళిపోతే అక్కడే ఏదో రకంగా బతుకు బండి లాగించేయవచ్చనే ధీమాతో సొంత ఊళ్లకు వందల కిలోమీటర్ల నడక ను నమ్ముకుని వెళ్తున్న వారు ఎంత మందో చెప్పనవసరంలేదు. అలా వెళ్తున్నవారిలో ఎంతోమంది మధ్య దారిలోనే మృత్యువాత పడుతున్నారు. దీంతో లాక్ డౌన్ ను ఎత్తివేయాలని డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. కేంద్రం కూడా ఇదే రకమైన ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎంత కఠినంగా లాక్ డౌన్ నిబంధన విధించినప్పటికీ దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం కేంద్రాన్ని ఆలోచనలో పడేస్తోంది. 


ఇప్పటి వరకు 33వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1074 మంది  చనిపోయారు.
దీంతో కొన్ని రాష్ట్రాల నుంచి లాక్ డౌన్ నిబంధనలు పొడిగించాలనే డిమాండ్ పెరుగుతోంది. అయితే మోదీ ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తారు అన్న విషయంలో అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. మే మూడో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన సందేశాన్ని వినిపించనున్నారు. అటు ఆర్థిక వ్యవస్థ, ఇటు ప్రజల ప్రాణాలూ రెండూ తమకు ముఖ్యమేనని కేంద్రం చెబుతోంది. ఇంకా ఈ విషయంలో  స్పష్టమైన క్లారిటీకి రాలేదు. కాకపోతే వివిధ రాష్టాల్లో చిక్కుకున్న వలస కూలీలు, విద్యార్థులు లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవ్వుతుండడంతో వారిని స్వస్థలాలకు పంపించే విషయంలో కాస్త సానుకూల నిర్ణయం తీసుకుంది. 

 

అయితే మే మూడు తరువాత లాక్ డౌన్ నిబంధలు సడలించినా అది పరిమిత నిబంధనల్లో మాత్రమేనని మరికొంతకాలం ఆంక్షల జీవితానికి అలవాటు పడాల్సిందేనని తెలుస్తోంది. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ లో సుదీర్ఘకాలం లాక్ డౌన్ కొనసాగిస్తే జరిగే నష్టం ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా కలిగించే నష్టం కంటే ఉపాధి కరువయ్యి, ఆకలితో అలమటించి మరణించే వారే ఎక్కువగా ఉంటారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మోదీ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: