నీతి..నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం..

సహకార బ్యాంక్ ఉద్యోగుల నిత్య స్పూర్తి..

77 ఏళ్ళుగా చెక్కు చెదరని ఉక్కు సంకల్పం...

అవిశ్రాంత శ్రామికుడు...

మనకాలపు మహా మనిషి..

కామ్రేడ్ చలసాని మాధవరావు గారికి శ్రామికుల దినోత్సవం శుభాకాంక్షలు..!!!

 

ఎంతో మంది ప్రజా ఉద్యమ కారులు, పోరాట యోధులు బానిస సంకెళ్ళని తెంచే క్రమంలో తమ రక్తాన్ని సైతం ధారపోసి , జీవితాలని పణంగా పెట్టి కొన్ని రోజులని చారిత్రాత్మక రోజలుగా లిఖించిన సందర్భాలు చరిత్రలో అనేకం ఉన్నాయి. ఆ సంఘటన తాలూకు గుర్తులు చెరిగిపోకుండా ఉండేందుకు, వారి త్యాగాలు భావితరాలకి స్పూర్తిగా నిలిచేందుకు చరిత్రలో ఆయా ఉద్యమాలకి ఓ పేజీని సృష్టించారు..అలాంటిదే “మే” డే. చికాగోలో జరిగిన కార్మికుల రక్త తర్పణం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికుల జీవితాలలో ఆ రోజు కొత్త వెలుగులు నింపింది. ఈ పోరాటంలో చనిపోతామని తెలిసినా చెమటోడ్చే ప్రతీ కార్మికుడికి న్యాయం జరగాలని వారు చేసిన త్యాగం ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మిక లోకం స్మరించుకుంటూనే ఉంది..అప్పటి నుంచీ ప్రపంచ కార్మికులు అందరికి మే 1 పండుగ రోజు..

IHG

ఉద్యమాలు చేయలన్నా..నిరసనలు తెలుపాలన్నా శ్రామికులు మే1 నే ఎంచుకుంటారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం కోసం...కార్మికుల హక్కులు..కార్మిక చట్టాలు ఇలా కార్మికుల సంక్షేమం కోసం ఎందరో నాయకులు ఉద్యమాలు నడిపారు..పోరాటాలు సలిపారు..వ్యక్తిగత జీవితాలకి దూరమయినా తమని నమ్ముకుని ఉన్న కార్మికుల కోసం అలుపెరుగని పోరాటం చేశారు..అలాంటి ఓ మహోన్నతమైన నాయకుడిని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాము..ఆయన పేరే కామ్రేడ్ చలసాని మాధవరావు.. కృష్ణా జిల్లా విజయవాడలో సహకార బ్యాంక్ లో ఉద్యోగిగా చేరడంతో ఆయన ఉద్యమ జీవితం మొదలయ్యింది...

పుట్టింది కృష్ణా జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డి పల్లె. ఉద్యమాల పురిటిగడ్డగా పేరొందిన పోతిరెడ్డి పల్లె గురించి తెలియని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎంతో మంది పోరాట యోధుల్ని కన్న ప్రాంతమది పశువుల పుల్లరికి వ్యతిరేకంగా మాధవరావు గారి కుటుంబం అక్కడ  పెద్ద ఉద్యమమే చేసింది. చిన్న వయసు నుండే  ఉద్యమాలని చూస్తూ  పెరగడం, ఆయన మాతృమూర్తి సైతం ఉద్యమ స్పూర్తిని కలిగి ఉండటం తండ్రికి ఉన్న అంతులేని మంచితనం తో  పాటు ఆ గ్రామ ఉద్యమాల నీడన పెరిగిన  క్రమం  కాబోలు మాధవరావు గారిని  మహోన్నతమైన వ్యక్తిగా నిలబెట్టాయి.  వారసత్వంగా వచ్చిన ఆస్తులు లేకపోయినా ప్రజా సేవ చేయడాన్ని వారసత్వంగా తీసుకున్నారు మాధవరావు గారు. అన్యాయాన్ని నిక్కచ్చిగా నిలదీయడం, న్యాయం కోసం పోరాటాలు చేయడం హక్కుల కోసం ఉద్యమించడం  ఇవన్నీ పోతిరెడ్డి పల్లె గడ్డపై పుట్టడం వల్లనే జరిగాయని అంటారు మాధవరావు గారు.

 

1966 లో విజయవాడ సహకార బ్యాంక్ లో ఉద్యోగిగా  చేరిన ఆయన అనతి కాలంలోనే ఉద్యోగులతో కలిసి  . ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్  బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఉద్యోగులు చాలి చాలని జీతాలతో ఆర్ధిక  ఇబ్బందులు పడుతున్నారని, వారి ఆర్ధిక పుష్టికి జీతాలు పెంచాలాని మేనేజ్మెంట్ కి  నోటీసులు ఇచ్చి  46 రోజుల పాటు కొందరు నాయకులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. దాంతో మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందించినా సమ్మె అనంతరం మాధవరావు గారిని ఉద్యోగం నుండీ తొలగించింది. కానీ ఉద్యమాలే ఊపిరిగా భావించిన  ఆయన బెదరలేదు.

అనంతరం చిత్తూరు జిల్లా  ల్యాండ్ మార్ట్ గేజ్  బ్యాంక్ లో 1967 ఉద్యోగంలో చేరారు. అక్కడ కూడా ఉద్యోగుల  సంక్షేమం కోసం అప్పటి ఉమ్మడి ఏపీలో ఉన్న అన్ని జిల్లాల బ్యాంకులు  ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేయాలని పులుపునిచ్చారు. 1970 లో వివాహం జరిగింది అప్పట్లో జీతాలుకూడా చాలా తక్కువ. కుటుంభ పోషణ కూడా చేయాలేని పరిస్థితి. ఒక పక్క ఉద్యమం, మరో పక్క కుటుంభ బాద్యతలతో ఎక్కడా పట్టు వదలకుండా ఉద్యోగుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారు. ఉద్యమ అరెస్టులతో జైలు జీవితం గడిపిన సంధర్బాలైతే అనేకం.

ఏపీలో సహకార ఉద్యోగులతో అతిపెద్ద బలమైన అసోసియేషన్ నిర్మించిన మాధవరావు గారు రైతులకి మెరుగైన సేవలు అందించడానికి సహకార బ్యాంకింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి సింగల్ విండో విధానం ఎంతో ఉపయోగపడుతుందని 1987 లో అప్పటి ముఖ్యమంత్రి  ఎన్ టీ రామారావు గారికి వివరించి చెప్పి ఆ పధకాన్ని అమలు చేయించడంలో కీలక పాత్ర పోషించారు. సహకార బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న సమయంలో ఆర్ధిక సాయం అందించాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. పార్లమెంట్ , రిజర్వ్ బ్యాంక్ ముందు ధర్నాలు నిర్వహించారు. అప్పటి కేంద్ర మంత్రులుగా ఉన్న అజిత్ సింగ్ , చిదంబర వంటి వారితో సహకార బ్యాంకింగ్ రంగ పరిస్థితులని వివరించారు..ఈ పోరాటానికి మద్దతుగా సుమారు 85 మంది ఎంపీలతో సంతకాలు తీసుకున్నారు..ఎంతో సుధీర్గమైన పోరాటం అనంతరం  ప్రభుత్వం వైద్యనాధన్ కమిటీ వేయడం దేశ వ్యాప్తంగా ఉన్న సహకార సంస్థలకి కోట్లాది రూపాయలు సాయం అందడం జరిగింది. గ్రామీణ సహకార సంఘాలలో రైతులు ఓటు వేసేలా, ప్రతీ మండలానికి ఓ సహకార సంఘం ఉండాలని ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. సహకార బ్యాంక్ ఉద్యోగుల సర్వీస్ కండిషన్స్ గురించి దాదాపు 10 ఏళ్ళుపాటు  పోరాటాలు చేసి ఉద్యోగుల  జీవితాలలో కొత్త వెలుగులు నింపారు. సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో యువరక్తం రావాలని మొదటి సారిగా  ఉద్యోగ నియామకాలు  IBPS ద్వారా జరిగేలా పట్టుబట్టి విజయం సాధిచారు.

ముఖ్యంగా రైతులకి వెన్ను దన్నుగా నిలుస్తున్న సహకార బ్యాంక్ లు మరింత బలమైన వ్యవస్థగా మార్పు చెందాలన్నా..రైతులకి మరింత తక్కువ వడ్డీకే ఋణాలు అందాలన్నా రెండంచెల విధానం ఎంతో ఉపయోగపడుతుందని  దాదాపు 30  ఏళ్ళుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు..హక్కుల సాధన కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ నెలలో 20 రోజులు హైదరాబాద్ లోనే గడిపేవారు. తాను చేపట్టే ప్రతీ ఉద్యమంలో కొండారెడ్డి, రాధాకృష్ణ మూర్తి పలువురు ఎంతోగానో తోడుగా నిలిచారని తెలిపారు. 50 ఏళ్ళ వైవాహిక జీవితంలో తానూ కుటుంభంతో గడిపింది 20 ఏళ్ళు మాత్రమేనని ఆ సమయంలో నా భార్య అందించిన మద్దతు మాటల్లో చెప్పలేనిదని అన్నారు. అసోసియేషన్, కుటుంభం నాకు రెండు కళ్ళు అనే చెప్పే మాధవరావు గారు..రెండంచెల విధానం ఇప్పటికీ అంటే 77 ఏళ్ళ వయసులో కూడా అలుపెరుగకుండా పోరాటం చేస్తూనే ఉన్నారు...ప్రభుత్వాలకి వినతులు ఇస్తూనే ఉన్నారు..

 

అందుకే ఈ అలుపెరుగని పోరాట యోధుడికి హెరాల్డ్ తరపున సలామ్ చేస్తున్నాం..

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: