కరోనా ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఎంత తీవ్రంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని రంగాలు ఈ దెబ్బకు అతలాకుతలం అయ్యాయి. కొన్ని కోలుకునే అవకాశం కనిపిస్తున్నా, మరికొన్ని పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ జాబితాలో ఇప్పుడు పత్రికలు కూడా వచ్చి చేరబోతున్నట్లుగా కనిపిస్తోంది. అసలు కరోనా ప్రభావం మొదలు అవ్వకముందే పత్రికల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. పత్రికల నిర్వహణ, ప్రింటింగ్, సిబ్బంది, జీతభత్యాలు, వేజ్ బోర్డ్ ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఎప్పటి నుంచో పత్రికల స్థానంలో డిజిటల్ ప్లాట్ ఫార్మ్ పై సేవలుఅందించాలని పత్రికల యాజమాన్యాలు భావిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే ఈ రంగంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముందుగా జిల్లా టాబ్లాయిడ్ లు తీసివేసి మెయిన్ ఎడిషన్ మాత్రమే ప్రింట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా కసరత్తు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా కరోనా ప్రభావం పత్రికా రంగం పై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించింది. 

 

IHG


ఇప్పటికే ఎలక్ట్రానిక్, సోషల్, వెబ్ మీడియా వచ్చిన తర్వాత పత్రికలకు ఆదరణ తగ్గింది. దాంతోపాటు ప్రకటనలు కూడా భారీగా తగ్గిపోయి ఆదాయం కోల్పోయాయి. కేవలం ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలపైనే ఎక్కువ పత్రికలు ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా ప్రభావం రావడం, మరి కొంతకాలం పాటు అన్ని రంగాలు కోలుకునే పరిస్థితి లేకపోవడంతో, పత్రికలకు ఆదాయ వనరుల పూర్తిగా తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పత్రికలను మూసివేయాలని ఒక నిర్ణయానికి అన్ని పత్రికల యాజమాన్యాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సిబ్బందిని తగ్గించే పనిలో పత్రికలు ఉన్నాయి. 


తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామి పత్రికగా కొనసాగుతున్న ఈనాడు ఇప్పటికే పేజీల లేఅవుట్ డిజైనర్లను తగ్గించింది. మరికొంతమంది సబ్ఎడిటర్ లను తీసివేసే ఆలోచనలో ఉంది. ఇక ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలు వంటివి కూడా దాదాపు ఇదే బాటలో ఉన్నాయి. సాక్షిలో ఇంకా తీసివేతలు మొదలవ్వనప్పటికీ ఆంధ్రజ్యోతిలో మాత్రం పూర్తిగా మొదలై పోయినట్టు సమాచారం. ఇక అన్ని పత్రికల్లో జీతాల కోతలు మొదలయ్యాయి. మెల్లి మెల్లిగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించి ఆ తర్వాత పత్రికల ముద్రణ నిలిపివేయాలనే ఆలోచనలో అన్ని పత్రికల యాజమాన్యాలు ఉన్నాయి.

 

 ఈ మేరకు త్వరలోనే పత్రికాధిపతులు అంతా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో డిజిటల్ మీడియా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో మీడియా సంస్థల యాజమాన్యాలు ఉన్నట్టు సమాచారం. ఎప్పటి నుంచో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పత్రికలకు కరోనా పరోక్షంగా మేలు చేసినట్టుగానే కనిపిస్తుంది. అయితే ఉద్యోగుల జీతాలు, జీవితాలను మాత్రం అగాధంలోకి తోసేసినట్టుగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: