దాదాపు 50 రోజుల తర్వాత రాష్ట్రంలో మద్యం షాపులు తెరుచుకున్నాయి.  రెడ్ జోన్లో ఉన్న షాపులను మాత్రం ప్రభుత్వం తెరవలేదు. అంటే ఆరెంజ్, గ్రీన్ జోన్లో ఉన్న 2345 షాపులు మాత్రమే తెరుచుకున్నాయి. ఈ షాపులు ఉదయం తెరిచారో లేదో కొత్త సినిమా టిక్కెట్ కోసం ఎగబడే జనాల మాదిరిగా జనాలు మందు కోసం ఎగబడ్డారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మగవాళ్ళతో పోటీగా ఆడవాళ్ళు కూడా మందుకోసం ఎగబడటమే. ఇక మొదటిరోజు అమ్మకాల వల్ల సుమారు 60 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చిందని సమాచారం.

 

మొదటి రోజు ఆదాయం 60 కోట్ల రూపాయలు మామూలుగా అయితే లాక్ డౌన్ ముందు కూడా వచ్చేదే. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెడ్ జోన్లో షాపులు తెరుచుకోలేదు.  రెడ్ జోన్లో ఉన్న షాపులు కనీసం మరో 2 వేలుంటాయి. అంటే మొత్తం మద్యం షాపుల్లో ఇపుడు తెరుచుకున్నవి సగమే అయినా వ్యాపారంలో మాత్రం ఎక్కడా తేడా కనబడలేదు. సగం షాపులకే మామూలుగా వచ్చే ఆదాయం ఎలా వచ్చింది ? ఎలాగంటే జనాలు మందుకోసం ఎంతలా మొహం వాచిపోయున్నారో అర్ధమైపోతోంది.

 

రోజువారీ మద్యం తీసుకునే వారు లాక్ డౌన్ కారణంగా 50 రోజులు మందుకు దూరంగా ఉండటమంటే మామూలు విషయం కాదు. అందుకనే షాపులు ఓపెన్ చేయగానే ఒక్కసారిగా ఎగబడ్డారు. ఎందుకు ఇంతలా మందు కోసం ఎగబడ్డారంటే మళ్ళీ మద్యం షాపులకు ఎక్కడ లాక్ డౌన్ పెట్టేస్తారో అనే భయమే కారణం. ఈ భయంతోనే దొరికిన వారు దొరికినట్లుగా ఒకటికి పది బాటిళ్ళు, కొందరైతే కేసుల కొద్దీ మద్యాన్ని కొనుక్కుని ఇళ్ళల్లో స్టాక్ పెట్టేసుకున్నారు. ఒకవేళ ప్రభుత్వం మద్యం షాపులను మళ్ళీ లాక్ డౌన్ పరిధిలోకి తీసుకెళ్ళిపోయినా ఇబ్బంది ఉండకూడదన్న కారణంతోనే ఇలా ఎగబడి కొనేశారు.

 

ఇక్కడ విచిత్రమేమిటంటే మగవాళ్ళతో పోటిగా ఆడవాళ్ళు కూడా మద్యం షాపుల ముందు క్యూ కట్టడం.  కార్పొరేట్ కల్చర్ బాగా పెరిగిపోవటంతో ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా మందు కొట్టేస్తున్నారు.  ఐటి, మల్టీనేషనల్ కంపెనీలు, విదేశీ కంపెనీల్లో పనిచేస్తున్న ఆడవాళ్ళు కూడా రెగ్యులర్ గా మద్యం తీసుకోవటం చాలా మామూలైపోయింది. దాదాపు 50 రోజులు లాక్ డౌన్లో ఉండిపోవటం, అప్పటికే తమ వద్ద ఉన్న మందు స్టాక్ అయిపోవటంతో అందరూ అల్లాడిపోతున్నారు.

 

ఈ ఒక్క కారణంగానే ఆడవాళ్ళు కూడా మందుకోసం పోటిపడ్డారు. బెంగుళూరు సిటి, విశాఖపట్నం, ముంబాయ్, చెన్నై, జైపూర్, ఢిల్లీ లాంటి అనేక నగరాల్లో ఆడవాళ్ళు క్యూల్లో నిలబడటం చూసిన మిగిలిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. మామూలుగా ఇంతమంది ఆడవాళ్ళు మందు తాగుతారంటే ఎవరూ నమ్మరు. కానీ ఇపుడు క్యూలైన్లలో నిలబడి పెద్ద ఎత్తున మందు కొనుగోలు చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. మొత్తం మీద మద్యం కోసం అందరూ ఎగబడటంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా బాగానే వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: