దాదాపు 50 రోజుల తర్వాత దేశవ్యాప్తంగా ఓపెన్ అయిన మద్యం షాపుల దగ్గర భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఇక్కడా అక్కడ అన్న తేడా లేకుండా జనాలు షాపులపైకి ఎగబడుతున్నారు. సరే మగవాళ్ళు మందుకోసం ఎగబడుతున్నారని అనుకుంటే ఏదోలే అలవాటైన ప్రాణాలు ఏమి చేస్తాం ? అని సరిపెట్టుకోవచ్చు. కానీ విచిత్రంగా మహిళలు కూడా మగవాళ్ళతో సమానంగా ఎగబడుతున్నారు. మద్యంకోసం మహిళలు ఇలా షాపుల ముందు క్యూలు కట్టడం బహుశా దేశంలో ఇదే మొదటిసారేమో చూడటం.

 

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, జైపూర్, ముంబాయ్ ఇక్కడా అక్కడ అన్న తేడా లేకుండా దాదాపు అన్నీ నగరాల్లోను మద్యం కోసం మగవాళ్ళతో ఆడవాళ్ళు పోటి పడటం చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. హై సొసైటీలోని ఆడవాళ్ళు మందు తాగుతారన్న విషయం చాలామందికి తెలిసిందే. కానీ మగవాళ్ళతో పోటిలు పడి మరీ షాపుల ముందు ఆడవాళ్ళు ఈ స్ధాయిలో నిలబడతారని ఎవరూ అనుకోలేదు. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయని విశ్లేషణలు వినబడుతున్నాయి.

 

మొదటిదేమో చాలామంది ఆడవాళ్ళు సాఫ్ట్ వేర్ కంపెనీలు, మల్టీ నేషనల్ కంపెనీల్లో పనిచేస్తుండటం. ఇక రెండో కారణం  మనదేశంలో కార్పొరేట్ కల్చర్ పెరిగిపోతుండటం. మూడో కారణం చాలా నగరాల్లో సింగిల్ పేరంటింగ్ కల్చర్ ఎక్కువైపోతుండటం. చివరి కారణం ఆర్ధికంగా మగవాళ్ళతో సమానంగాను కొందరైతే ఇంకా ఎక్కువ స్ధాయిలో ఉండటమే అని అంటున్నారు.

 

పైన చెప్పిన రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆడ/మగ ఎవరైనా కావచ్చు మద్యం తీసుకోవటం అన్నది సాధారణమైపోయింది. దానికి తోడు సినిమాలు, వెబ్ సీరీసుల్లో కూడా ఏది చూసినా ఆడ, మగ అన్న తేడా లేకుండా మద్యం, సిగిరెట్లు తాగేయటం చూపిస్తున్నారు.  ఒకప్పటితో పోల్చుకుంటే ఇపుడు ఆడవాళ్ళకు స్వేచ్చ కూడా బాగా పెరిగిపోయింది. దాంతో మగవాళ్ళకన్నా తాము ఎందుతో తక్కువన్నట్లుగా ఆడవాళ్ళు కూడా ఫుల్లుగా మందు లాగించేస్తున్నారు.

 

ఇన్ని కారణాలున్నాయి కాబట్టే బహిరంగంగా ఎవరికీ భయపడకుండా మద్యం షాపుల ముందు క్యూ లైన్లలో నిలబడి మరీ బాటిళ్ళకు బాటిళ్ళు  కొనేసుకుంటున్నారు. సాఫ్ట్ వేర్ రంగం, కార్పొరేట్ రంగాల్లో పనిచేస్తున్న ఆడవాళ్ళల్లో చాలామంది తమ పెద్ద వాళ్ళకు దూరంగా ఉంటున్నారు. దాంతో కావాల్సినంత స్వేచ్చ కూడా దొరుకుతోంది. అందుకే ఎవరినీ లెక్క చేయకుండా మద్యంషాపుల ముందు ధైర్యంగా నిలబడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: