పుట్టిన గడ్డకు పేరు తీసుకురావడం అంటే మాటలు కాదు.. మన బతుకు మన కోసం కాకుండా దేశం కోసం బతకడం అంత సులభం కాదు. పుట్టిన రాష్ట్రానికి పేరు తెచ్చిన వాడు గొప్పోడు.. రాష్ట్రానికే కాదు.. దేశానికే పేరు తెచ్చిన వాడు ఇంకా గొప్పవాడు.. కానీ ఓ దేశానికి పరిమితం కాకుండా ప్రపంచ మానవుడిగా కీర్తించబడిన వాడు ప్రాంతాలకు అతీతుడు.. అందుకే అలాంటి వారిని విశ్వమానవులు అంటాం. అలాంటి కోవకే చెందినవాడు నేటి మన హెరాల్డ్ విజేత రవీంద్రనాథ్ ఠాగూర్.

 

 

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్.. భారత దేశం ఆయన్ను గురుదేవుడు అని పిలుచుకుంటుంది. ఆయన ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు.. భారతదేశం నుంచి సాహిత్య నోబెల్ అందుకున్న ఒకే ఒక్కడు. రవీంద్రనాథ్ ఠాగూర్ ను కేవలం కవిగా, సాహితీ వేత్తగా చూస్తే అది సంకుచితమే అవుతుంది. ఆయన విశ్వమానవ వాదాన్ని ఖండాంతర వ్యాప్తి చేసిన ఆధునిక భారత రచయిత. రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 కోల్‌కతాలో పుట్టాడు. గురుకుల విద్యావ్యవస్థకు పితామహుడుగా చెప్పుకోవచ్చు.

 

 

కలకత్తాలో శాంతినికేతన్ అనే ప్రకృతి పాఠశాలను ఏర్పాటు చేసి విద్య గొప్పదనాన్ని, పరమార్థాన్ని విద్యావ్యవస్థ ఉండాల్సిన తీరుకు ఓ నమూనా చూపించాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన కుటుంబ సభ్యులంతా ఆధునిక భావాలు గల ఆదర్శవాదులు. తన తండ్రి నుంచే సంఘ సంస్కరణల ఆవశ్యకతను గ్రహించాడు. రవీంద్రుడు.. గొప్ప రచయిత, గొప్ప విద్యావేత్త. గొప్ప గురువు. భారతదేశాన్ని తన మాతృభూమిగా ఆరాదిస్తూనే ప్రపంచ మానవాళిని ఆదరించే విశ్వనరుడాయన.

 

 

విశ్వమానవ సౌభ్రాతృత్వం, పరస్పర సహజీవనంల అవసరాన్ని నొక్కి చెబుతూ క్షమాగుణం ప్రవచించే ఆధునిక ప్రవక్త. మనిషిలోని జ్ఞానాన్ని గౌరవించినప్పుడు ఆయన ఎదుగుదలకు ప్రోత్సాహం ఉంటుందని నమ్మే విశ్వనరుడు. మతం మనిషిలో విభాజక హేతువు కారాదని వాదించాడు. మనిషిలో మానవత్వాన్ని పెంపొందించేలా ఉండాలని, పక్షపాత వైఖరిని విడనాడి స్వచ్చమైన వ్యక్తిత్వాన్ని ప్రభోదించేలా మతం తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఠాగూర్ వాదించాడు.

 

 

ఠాగూర్ 1905లో రచించిన అమార్ సోనార్ బంగ్లా గీతం బంగ్లాదేశ్ జాతీయ గీతంగా స్వీకరించబడింది. ఆయన రచించిన జన గణ మన గీతం మనదేశ జాతీయగీతంగా గౌరవం పొందింది. ఇలా ఒక కవి రాసిన రెండు గీతాలు రెండు దేశాల జాతీయ గీతాలు అవడం ప్రపంచంలోనే అరుదైన విషయం. 1910 లో ఆయన రచించిన గీతాంజలి నోబెల్ సాహిత్య బహుమతి అందుకుని ఆయన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. ఆయన్ను విజేతగా నిలిపింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: